పెద్దనోటు పెద్దనోటు ఎక్కడుంటివే?
గొప్పోళ్ళ భోషాణాల, మాళిగల,
బ్యాంకుల్ల లాకర్ల, శేఠుల జేబుల్ల నిండి ఆహా హాయిగనుంటినే!
పెద్దనోటు పెద్దనోటు ఎలాగుంటివే?
పెద్ద చేత చిన్న చేత ఇంతి చేత పూబంతి చేత
మరెందరి చేతో ఓహో గొప్పగా పూజలందుకొనుచుంటినే!
పెద్దనోటు పెద్దనోటు ఏమనుకొనుచుంటివే?
ఓటు కైన, పెద్ద పదవికైన, డాబుకైన బడాబాబుకైన
నేను లేక అసలు అస్తిత్వమే లేదు హే హే నేనే గొప్పనుకొనుచుంటినే!
పెద్దనోటు పెద్దనోటు ఈ వార్త వింటివా!
నేటి రాత్రి నుండి నిన్ను రద్దు చేసినారంటనే?
అవునా? అయ్యో! అయ్యయ్యో! ఇప్పుడు నా గతి ఏమగునే?
రద్దైన పెద్దనోటు రద్దైన పెద్దనోటు ఇప్పుడు ఎక్కడుంటివే?
పిడతకింద పప్పుకు పొట్లంలాగ, కుప్పతొట్టిలో చెత్తలాగ,
నడిరోడ్డులో మంటలాగ కాలుతూ అయ్యయ్యో విలువపోయి వగచుచుంటినే!!
రద్దైన పెద్దనోటు రద్దైన పెద్దనోటు ఇప్పుడు ఎలాగుంటివే?
గొప్పోళ్ళకు అక్కరలేక భారమై నలిపి చింపి బస్తాల కుక్కి
పారవేయ వ్యర్థమై ఎవ్వరికీ అక్కరకురాక ఉక్కిరిబిక్కిరై శోకించుచుంటినే !!?
రద్దైన పెద్దనోటు రద్దైన పెద్దనోటు ఇప్పుడు ఏమందువే?
విలువలేని కలకాలం నిలువలేని పెద్దరికం ఎందుకందునే?
ఎవ్వరికీ సమయానికి అక్కరకురాని జన్మ వ్యర్థమందునే !!
మరుజన్మనైన నన్ను చిన్ననోటుగా పుట్టించమని వేడుకొందునే!
చిన్ననోటునై ఎల్లరి చేతుల, జేబుల గౌరవంతో నిండి ఉండాలని కోరుకుందునే !
ఆక్షణాన అందరికి అక్కరకు వస్తినని సంతసించి మిడిసిపడక నేను పొంగిపోదునే!!!!!