పెద్దలు-పిల్లలు
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
ఏవి నేర్పాలో తెలియని పెద్దలు,
ఎందుకు నేర్చుకోవాలో తెలియని పిల్లలు.
ఎందుకు కంటున్నామో తెలియని పెద్దలు,
ఎందుకు ఉంటున్నామో తెలియని పిల్లలు.
పిల్లల విషయంలో ఆశక్తతతో పెద్దలు,
పెద్దల విషయంలో అనాసక్తతో పిల్లలు.
చిన్నప్పుడు పిల్లలను ఆదుకొంటూ పెంచిన పెద్దలు,
పెద్దయ్యాక తమ పెద్దల జీవితాలతో ఆడుకొంటూ పిల్లలు.
పిల్లలే తమ లోకమనుకొంటున్న పెద్దలు,
పెద్దలుంటే తమకు శోకమనుకొంటున్న పిల్లలు.
చివరి రోజుల్లో పిల్లలే తమ తోడు అనే ఆశలో పెద్దలు,
చివరి వరకు పెద్దలుంటే తమకు పీడ అనే సంశయంలో పిల్లలు.
పిల్లలు తమకెందుకు దూరమౌతున్నారో అర్ధంచేసుకోలేని పెద్దలు,
పెద్దలు తమకెందుకు భారమౌతున్నారో ఆలోచించలేని పిల్లలు.
ఆదరించే బుద్ధితో పెద్దలు, చీదరించే బుద్ధితో పిల్లలు.
అమాయకత్వంతో పెద్దలు, చెంచలత్వంతో పిల్లలు.
కన్నీటితీరాన్ని చేరుకొంటూ పెద్దలు,
కలలమోజుల్ని కోరుకొంటూ పిల్లలు.