పెద్ద కొడుకు పిల్లలైతే క్షణం వదలరు. ఇద్దరూ రామలక్ష్మణుల్లా తన దగ్గరే తిరుగులాడుతారు. ‘మేఁవిక్కడే చదువుకుంటాం మామ్మా’ అని గదిలోనే తను పోమ్మనేవరకూ ఆడుకుంటారు. కావలిసినప్పుడల్లా, మందులూ, మాత్రలూ, టానిక్కులూ, చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళూ ఇస్తూనే ఉంటారు.
వాళ్ళిద్దరూ వెళుతూ ‘వస్తాం మామ్మా’ అంటే తనకి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. ‘బాగా చదువుకోండి బాబు, ఇదిగో మీక్కావలిసినవి కొనుక్కోండి.’ చిన్న మనవాడి చేతిలో నోటుంచింది తను.
‘అదేఁవిటత్తయ్య గారు, వాళ్లకి డబ్బులిస్తారెండుకూ?’ వారించబోయింది కోడలు.
‘పోన్లేవే, చిన్న వెధవయ్యలు. ఉండనీ. ఏ పుస్తకాలో కొనుక్కుంటారు.’
‘వెళతాం, అత్తయ్య గారు! అవసరమైతే కార్డు రాసి పడేయండి. వెంటనే వస్తాం.’ పెద్ద కోడలు ఆప్యాయంగా అంది. దానితో కొడుకూ అందుకున్నాడు.
‘అవునమ్మా, దీన్ని తీసుకొచ్చి దిగబెడతా. అవసరమైతే నే తిరిగి వెళ్ళిపోతా. నాకేం పరవాలేదు. నా వంట నేను చేసుకోగలను. దేవుడి దయవల్ల నీ ఆరోగ్యం కుదుటపడితే అంతే చాలు. – కాస్త సులువుగా ఉందని తిరిగెయ్యకు. వంట మనిషిని మరికొన్నాళ్ళు ఉండమను. ఇద్దరికయితే మాత్రం అన్ని పనులూ చేసుకోవాలిగా! మనిషి సాయం ఎలా వస్తుంది?’
‘నిజఁవేన్రా. చిన్నాడు రాస్తూనే ఉన్నాడు. మేడమీద అద్దేకిచ్చేస్తే ఓ వందో నూట యాభైయ్యో వస్తుందని. ఇద్దరి మనుషులు, ఇంత ఇల్లు ఏం చేసుకుంటారంటాడు. కాని నాన్నగారికి ఇల్లు అద్దెకియ్యడం ఎప్పుడూ ఇష్టం లేదు. నువ్వూ వాడూ వస్తే గదులెలా సరిపోతాయంటారు. ఎలాగైనా ఏనాడు అద్దెకివ్వలేదు. మా రోజులు ఇలా వెళ్ళిపోతే చాలు. ప్రాణం కోసం కనిపెట్టుకుని వున్నాను నేను. తరవాత మీ ఇష్టం.’
‘అదేంటమ్మా అలా అంటావు’ చిన్నబోయాడు అబ్బాయి. అయినా ఆప్యాయంగా ‘నువ్వేమిటో తెలీక మాట్లాడుతున్నావ్! నీకిప్పుడేం ఎనభై నాలుగూ, తొంభై వచ్చాయా. ఆ ఎదురింటావిడ చూడు, తొంభై ఏళ్ళు ఉండి తన చేత్తో చేసుకున్న పేలాలు, చెకోడీలు కరకరా నమిలి తింటోంది. ఇకపోతే బ్లడ్ ప్రేషర్లూ అవీ ఈ రోజుల్లో నూటికి అరవైమంది కుండేవే.’
‘మరో కొన్నాళ్లుంటే బావుంటుందేమోరా’ అనాలని నాలిక చివరికొచ్చినా ఆ మాటలు ఆవిడంటే బావుంటుందని భార్యవంక చూశారు వెంకట్రామయ్య గారు.
‘బాబూ, నువ్వొచ్చి నెలరోజులయింది. కోడలు చేత చేయించుకుంటూవుంటే ఇలా ఎన్నాళ్ళైనా చేయించుకోవాలనే ఉంటుంది. అక్కడ పిల్లల చదువులు పోతున్నాయి – ఏదో ఈ మాత్రంగా లేస్తున్నాను కదా – ఇంకెన్నాళ్ళుంటారు – వెళ్ళండి -అవసరమైతే నాన్నగారు రాస్తారు.’ పేరిందేవమ్మ ఉత్సాహంగా మాట్లాడింది.
‘అవసరమంటే ఇదే కదమ్మా -మరి సెలవన్నది ఎందుకుంది? నీ ఆరోగ్యం బాగా మెరుగయ్యేవరకూ ఉంటె మంచిదనే నా ఉద్దేశ్యం. పిల్లల చదువులకేం – పెద్ద చదువులు కావుగా – ఇంట్లో మాష్టారిని ఎలానూ పెట్టావ్, ఆయనే చూసుకుంటాడు.
వెంకట్రామయ్య గారు కలుగచేసుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు: ‘నిజఁవేనే - మరో రెండువారాలుంటే మంచిది. ఏమంటావ్?’
‘బావుందండీ, ఆడ పిల్లలు లేని నాకు కూతురిలా చేస్తోంది ఈ కోడలు. వాళ్ళుండ గలిగితే అంతకంటె కావలిసదేఁవుంది? అయినా మన స్వార్థం మనం చూసుకోడం అంత బావుండదు.’
‘అమ్మా, నువ్ ఆ మాటనకు. నీచేత పుట్టిన దగ్గరనుంచీ చేయించుకున్నాం – ఓ వారమో, నెలో ఇక్కడ నీకు చేస్తే మనుషులం అరిగి పోతామా.. పోనీ దీన్ని వదలి నేను వెళతాను.’
‘తనకిప్పుడు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందనీ, వాళ్ళ అవసరం అంతగా లేదనీ, పనిమనిషి, వంట మనుషుల సాయంలో కాలక్షేపం చెయ్యగలనని పెద్ద కొడుకునూ, కోడలునూ నమ్మించేసరికి చాలా శ్రమపడవలసి వచ్చింది పేరిందేవమ్మకి.
‘పెద్దాడు వెళుతూ ఐదొందలిచ్చాడే!’ – ఆనందంగా చెప్పారు భార్యతో.
‘ఇస్తాడని నాకు తెలుసు. వాడి మనసు అలాంటిది.’ – కళ్ళు తుడుచుకుందావిడ.
‘ఎందుకా కంటతడి?’
‘ఏం లేదు.’
బయటకు కారణం చెప్పకపోయినా తనలో తనే చర్చించుకుంది పెరిందేవమ్మ కన్నీళ్ళెందుకో – ‘నా కొడుకూ ఉన్నాడు. రక్తం పంచుకుని కడుపు చీల్చుకుని పుట్టినవాడు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కోడలూ ఉంది. ఒంట్లో బాగులేదని రాస్తే వచ్చి ఏదో హోటల్లో విహారానికి వచ్చినట్టు మేడ దిగకుండా – రెండు పూటలా టిఫిన్లూ, కాఫీలు, పాలు, బోర్నవిటాలూ, ఇలా అన్నీ మేడమీదికే సరఫరా చెయ్యాలి. – ఆయనకొచ్చే పెన్షన్ చూస్తే ఐదొందలు. – ఇన్ని కొంటున్నారు, ఎలా వస్తున్నాయని వాళ్లెవరైనా అడిగారా? కోడలైతే కొత్త పిల్ల – కొడుక్కు తెలియని నిక్షేపాలేం లేవుకదా-వాడైనా అడగొద్దూ? – పోనీ డబ్బు మాట దేవుడెరుగు. ఆప్యాయంగా ఎప్పుడైనా కోడలు పలుకరించదు – కొడుకు సరేసరి. వాడికి పదిహేనొందలు జీతం అని సంబరపడాల్సిందే – ఇదిగో ఈ వంద – అని ఒక్కసారి ఇవ్వడు - పైగా కోడలు మెడలో తను చేయించి వేసిన గొలుసేమయిందంటే జవాబు చెప్పడు.’
ఉసూరుమంది మనస్సు.
చిన్నబ్బాయి వచ్చిన రెండు వారాల్లో మరో ఐదొందలు ఖర్చయింది. కొడుకుతో డబ్బు విషయం చెప్పడానికి వెంకట్రామయ్య గారికి చిన్నతనం. డాక్టర్లకీ, మందులకీ గత రెండు మూడు నెలల్లోనూ సుమారు రెండువేలయిపోయింది. చిన్నకొడుకు వ్యవహారం తన నచ్చకపోయినా భార్య బాధపడుతుందేమోనని మెదలకుండా ఊరుకున్నారు. పోనీ జబ్బు మాటెలావున్నా, వచ్చినవాడు తనకు ఆసరాగా ఉండటంలేదు. ఇంట్లో ఉన్నంతసేపూ మేడ – లేకపోతే బయట ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో ఇల్లు చేరడం. బయటకేమనడానికి మనస్కరించక లోపల బాధ దిగమింగుకోలేక విలవిల్లాడారు వెంకట్రామయ్య గారు.
ఓ రోజు మెల్లగా భార్య దగ్గరకు వచ్చి ఎలా మొదలుపెట్టాలో తెలియక కాలుకాలిన పిల్లిలా గదిలోంచి బయటకీ, బయటనుంచి గదిలోకీ తిరుగుతుంటే ఆయన చెప్పనవసరంలేకుండానే పేరిందేవమ్మకి విషయం అర్థమైపోయింది.
‘బ్యాంకు లో ఆఖరి ఐదొందలు అయిపోయినట్లున్నాయి!’ ఆవిడే ప్రారంభించింది.
‘పోన్లే ఏం చేస్తాం. అవసరానికని ఉంచుకున్నదేగా’
‘మనం ఇప్పుడనుకొని ఏం లాభం? చదువుకున్నా, వయసొచ్చినా చిన్నాడికి కష్టం తెలిసిరాలేదు. కారణం వాడికి మనం చేసిన ముద్దు. వాడు ఆడింది ఆట పాడింది పాట. నా పేరా వేసిన వెయ్యీ తియ్యండి. తరువాత భగవంతుడిదే భారం.’
‘అది కాదే, ఆ డబ్బు తియ్యడమెందుకు? ఈ ఉంగరం ...ఎలానూ ఇరుకైపోయి చిరాకుగా వుంది.’
పేరిందేవమ్మకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మొదటిజీతం అందుకుని బంగారం సులువుగావున్న ఆ రోజుల్లో అరతులం ఉంగరం చేయించి తెచ్చాడు పెద్దాడు. అయితే తన వేలికి బాగా వదులై పోయింది. ‘మీరు పెట్టుకోండి. మీ చేతికి చాలా బాగుంది.’ తనే అతని వేలికి తొడిగింది.
‘అమ్మా, నేను నీకని తెచ్చినది నాన్నగారికిచ్చేశావ్, నీ ఆశీర్వచనం వుంటే, నీకు గాజులే చేయించి తెస్తానమ్మా’ అన్నాడు పెద్దకొడుకు.
‘నాకు గాజులెందుకులేరా, కోడలి మెడలోకి ఓ రెండు తులాల గొలుసు చేయించు’ అంది తను.
ఆ ఉంగరం అమ్మేస్తే మరో పదిహేను రోజులు గడుస్తాయి. కాని వాడొచ్చి ఆయన వేలు చూస్తె బాధపడతాడు – అలా జరుగకూడదు. పేరిందేవమ్మ అనునయంగా చెప్పింది. ‘చూడండి, వాడు ఎంతో ఆప్యాయతతో చేయించింది. అది అమ్మేస్తానంటే వాడు బాధపడడూ? చూడండి చిన్నాడు ఉన్నాడు. మేడ దిగి అమ్మ ఎలా ఉందన్న మాటన్నా అడిగాడా? పైగా రాజాలా అన్నీ చేయించుకుంటున్నాడు. మొక్కయి వంగనిది మానై వంగుతుందా, నేనే ముద్దు చేశాను. నేనేమైనా అనుకుంటానని మీరూ ముద్దు చేశారు. చివరికి వాడలా తయారయ్యాడు.’
‘చిన్నవాళ్ళు, మనం సర్దుకుపోవాలి.’
మూడు వారాలయ్యాక మరి ఉండబట్టలేదు పేరిందేవమ్మకి. మెల్లగా మేడమీదకెళ్ళింది ఓ రాత్రి. తన ముద్దులకొడుకు మంచంమీద పడుకొని ఓ చేత్తో పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు. రెండో చేతిలో రెండున్నాయి. ఓ గ్లాసు, ఓ సిగరెట్టూ. పక్క బల్లమీద ఓ బుడ్డీ, మరచెంబుతో నీళ్ళూ. కోడలు కుర్చీలో కూచుని చదువుకుంటోంది.
‘ఏమ్మా, ఇంకా పడుకోలేదూ?’ తనని చూసి పుస్తకంలో ముఖం చాటుచేసుకుంది.
‘ఏరా, నిన్నే?’
‘నిద్దర రావడంలేకపోతే...’
‘బావుంది, ఇదా నువ్ చేసే నిర్వాకం – ఇల్లెలా గడుస్తుందని అడగవ్. చచ్చానా, బ్రతికానా అని అడగవ్ – ఒకటీ, ఒకటీ కరిగించి నెట్టుకొస్తున్నాం – నీ సరదాలే కానీ కొడుకుగా నీ బాధ్యత నువ్వు బోధపర్చుకోకపోతే ఎలా? పైగా ఈ పాడు అలవాట్లు, ఇంట్లో, ఎంత బరితెగించేశావ్, ఛీ, నీకు సిగ్గు లేదూ?’ -ఆవేశం వచ్చింది పేరిందేవమ్మకి. ఉండబట్టలేక నాలుగూ అనేసింది.
‘ఎందుకత్తయ్య గారు, అలా ఆడి పోసుకుంటారు – మేం ఉండడం ఇష్టం లేకపోతే రేపే వెళ్ళిపోతాం. తిండికోసం రాలేదిక్కడకి. తిండి లేకా రాలేదు. టెలిగ్రాంగా భావించి రమ్మని రాస్తే ఎక్కడికక్కడ ఒదిలేసివచ్చాం. మేం తిన్నదే మీకు ఎక్కువగా కనపడుతోంది.’ కోడలు కసిరేసింది.
విలవిల్లాడిపోయింది పేరిందేవమ్మ. కొడుకు ప్రేమించి, ఇంట్లో చెప్పకుండా చేసుకుని తీసుకొచ్చిన పిల్ల – ఉద్యోగం చేసి నెలకు ఆరొందలు సంపాదిస్తున్న పిల్ల –
‘హు! ఎవరి ఖర్మ వాళ్ళది.’
కిందకొచ్చేసిన పేరిందేవమ్మ మరి మేడెక్కలేదు. తెల్లవారగానే భర్తకు చెప్పింది – ‘అబ్బాయికీ, వాళ్ళకీ టిక్కెట్లు రిజర్వు చేయించేయండి. – వాళ్ళు వెళితేనే నాకు కొంచెం మనశ్శాంతి వుంటుంది.
వెంకట్రామయ్య గారికి ఇంటి సంగతి తెలియక కాదు. భార్య ఏం బాధపడుతుందోనని తెలిసినా కిమ్మనకుండా ఊరుకున్నారు.
చిన్నాడికి ఉత్తరం పోస్టు చేసి రాగానే ‘పెద్దాడ్ని రమ్మని టెలిగ్రాం ఇవ్వండి!’ అంది కళ్ళు తుడుచుకుంటూ.
రెండోరోజు సాయంకాలానికి పెద్దాడు, కోడలు, పిల్లలూ వచ్చేశారు. పేరిందేవమ్మని చూసి అన్నాడు అబ్బాయి ; ‘దేవుడి దయవల్ల నువ్ కులాసాగా వున్నావమ్మా – టెలిగ్రాం చూసి హడలిపోయాం.’
‘ఏం కులాసా నాయనా..’ అన్నా, పేరిందేవమ్మ చుట్టూ కొడుకూ, కోడలూ, పిల్లలూ, భర్తా ఉండడం చూసి ‘మహారాణిని, నాకేం’ అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది.
ఆ మరుసటి రోజు చిన్నవాడూ పిల్లలూ వచ్చారు. వెంకట్రామయ్య గారు, పేరిందేవమ్మా మొహమొహాలు చూసుకున్నారు. అప్పుడు పెద్దాడు చెప్పాడు: ‘నేను బయలుదేరుతూ ఎందుకయినా మంచిదని తమ్ముడికో టెలిగ్రాం ఇచ్చాను. వాడూ వచ్చాడు.’
పేరిందేవమ్మ ఏం మాట్లాడలేదు. రాత్రి భోజనాలవుతుండగా పేరిందేవమ్మకి ఆయాసం వచ్చింది.
‘డాక్టరునుపిలుస్తా’ అంటూ వెంకట్రామయ్య గారు బయలుదేరారు. అంతా చుట్టూ వచ్చి నుంచున్నారు. ‘అమ్మా, మీ చెల్లెల్ని పిలువ్!’ అంది పేరిందేవమ్మ. వెళ్లి పిలిస్తే చిన్నకోడలు వచ్చింది.
‘నేను మీకు ఇవ్వగలిగిందేం లేదమ్మా! ఈ గొలుసు పెద్దాడు చేయించాడు. ఆ రోజుల్లో ఐదు తులాలు. అమ్మాయ్ నీకు ఎలానూ ఆడపిల్లలు లేరు, ఇది చిన్నదాని కిచ్చెయ్. గాజులు నువ్ తీసుకో....వాడిది మిగిలిస్తే కూతురు పెళ్ళికి బాలతొడుగ్గా ఇవ్వచ్చు...’ పెద్ద కోడలితోనే మాటాడుతోంది పేరిందేవమ్మ.
‘అదేమిటత్తయ్య గారు, అలా మాటాడుతున్నారు....మీకేం ఆరోగ్యంగా ఉన్నారు. మీ ఆరోగ్యం ఇంకా బాగవుతుంది., నాది పూచీ...’
‘ఆ బావుంటుంది. వచ్చినప్పుడల్లా వెయ్యి రూపాయలు పోసుకుని వస్తున్నాం. మరి మా వల్ల కాదు.’ చిన్నకోడలు మూతి ముడిచింది.
‘పోన్లెండమ్మా, మరి రాకండి...ఒరేయ్ నాయనా, నీకు అన్నీ తెలుసు – అయినా నేను చెబుతున్నాను. మీ అమ్మ పోలిక నీకు – జాలి గుండె – నాదో కోరిక – నేను నిన్ను కనకపోయినా, నీకు నా మీద ఎంత అభిమానమో నాకు తెలుసు. నే నిన్ను అడిగేది ఒక్కటే., నా తలకి కొరివి...’
‘ఏమిటమ్మా, నిండు ఇంట్లో వాగాయిత్యం మాటలు..నువ్ పదికాలాలపాటు మాకు పెద్దదిక్కుగా వుండాలి.’
‘వాగాయిత్యం కాదు. నిజం. నీలాంటి కొడుకుంటే ఎన్నాళ్ళు బ్రతికినా ఆనందమే – కాని చావుబతుకులు మన చేతుల్లో లేవు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో – నేనేమైనా అనుకుంటానని మనసులో మాట బయటకు చెప్పరు. ఆయన మనసు మరీ సున్నితం.’
ఆవిడ గొంతు పూడుకుపోయింది.
‘పెద్దకొడుకును. నువ్ నాకు చెప్పాలా? నువ్వూ నేనూ వుండగా నాన్నగారికేవమ్మా రాజాలా వుంటారు. తమ్ముడు మాత్రం ఏం చదువులేనివాడా, తెలియనివాడా, ఏదో చిన్నతనం...’ కళ్ళు తుడుచుకున్నాడు పెద్దబ్బాయి.
‘తమ్ముడు, తమ్ముడు...హుఁ! – అబ్బ!’ గుండె చేత్తో పట్టుకుని వెనక్కి వాలిపోయింది పేరిందేవమ్మ.
‘తమ్ముడేడి’ మరదలి నడిగాడు.
‘సినిమాకెళ్లారు. మరో కొడుకున్నాడన్న తలపైనా వుందీ ఈవిడకి. మనసులేని మనుషులు.’ చిన్నకోడలు వ్యాఖ్యానించింది కసిగా.
“ఓయ్ అయిపొయింది అలా పట్టుకో...తొందరగా, మంచం మీద ప్రాణం పోకూడదు..’
పెద్దకొడుకూ, కోడలూ దింపుతుంటే తనకు తెలియకుండానే ఘొల్లుమంది చిన్నకోడలు కూడా.
(ఆంద్ర సచిత్ర వార పత్రిక సౌజన్యంతో..)