"నేను వద్దనుకుంటే నీ పుట్టుక ఏదిరా." అనేసింది గిరిజమ్మ దిగులుతో.
రాఘవ గింజుకుంటూనే ఉన్నాడు.
"ఇప్పటి నీ ఇంతటి ఉన్నతికి కారణం అప్పటి నీ పుట్టుకేరా." చెప్పింది గిరిజమ్మ.
"ఐతే ఏమంటావు." రుసరుసలాడేడు రాఘవ.
"అమ్మ చెప్పింది వినుకుందాం రా." కలగచేసుకుంది కావ్య.
గిరిజమ్మ సంతానం కావ్య.. రాఘవ. గిరిజమ్మ తొలి సంతానం బట్టి కావ్య అక్క.. మలి సంతానం కనుక రాఘవ తమ్ముడు.
"ఆపక్కా. నువ్వు ఎన్నైనా మాట్లాడతావు. ఉబ్బరగా ఆస్తి వాటా తస్కరించుకు పోవడానికి తగలడ్డావు." విసురుగానే అన్నాడు రాఘవ.
"అరే. పెడసరం వద్దు రా. ముందటి నుండి ఇలా మాటలే వద్దంటూ నెత్తి బాదుకుంటున్న. అర్ధం చేసుకో." గిరిజమ్మ కలగచేసు కుంటుంది.
అడ్డై.. "నువ్వు దానికి వత్తాసి చాలించమ్మా. దానికి ఏం తక్కువయ్యింది. ఘనమైన మేర్బానిలతో అత్తారింటికి సాగనంపేంగా." చెప్పాడు రాఘవ.
ఆ వెంబడే..
"నీకు అనారోగ్యం అని అదేం ఊడిపడిపోలేదు.. ఆస్తి వాటా దొబ్బెయ్యడం కి వాలింది." అనేసాడు.
"ఎందుకురా దాన్ని ఆడిపోసుకుంటావు. దాని రక్తం పంచుకు పుట్టావురా.." గిరిజమ్మ చెప్పుతోంది.
"చాల్లే. ఒక తూరి నా పుట్టుకకి నువ్వు అంటావు.. మరో తూరి దీని రక్తం పంచుకున్నానంటావు. నీ తక్కిడితనము ఆపు." గద్దించాడు రాఘవ.
"తమ్ముడూ.. నీ నుండి అమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసేక ఆగలేక ఎకాఎకీన పారొచ్చేసాను." చెప్పుతోంది కావ్య.
అడ్డై.. "ఓయమ్మో. ఎంత ఇది. చెప్పాలని చెప్పేనే తప్పా.. అమ్మకి ఏమంత కాలేదు. అదీ చెప్పేక కూడా నువ్వు మాత్రం.. నీ మొగుడ్ని.. పిల్లల్ని వదిలేసి రంకెలేసుకు వచ్చేసావు.. ఎందుకు అలా గమ్మున వచ్చేసావో మళ్లీ చెప్పనా." రాఘవ నిలదీస్తాడు.
"అప్పటికే పిల్లలు స్కూలుకి పోయార్రా. నీ బావకి ఫోన్ చేసి కచేరీ నుండి రప్పించుకొని.. పిల్లల్ని తీసుకు రమ్మనమని ఆయనకి అప్పచెప్పి.. నేను ఆగలేక.. ఉన్నపాళాన వచ్చేసానురా. అమ్మకి మనం తప్ప ఎవర్రా. ఇలాంటప్పుడు మనకి మనం తోడు కామా." సంజాయిషిలా చెప్పుతోంది కావ్య.
"నీ టక్కుటమారాలు ఆపాపు." రాఘవ వెటకారంగా అంటాడు.
తల్లీ కూతుళ్లు మొహాలు చూసుకున్నారు. తల్లి అవస్తని చూడలేక పోతోంది కావ్య.
"కేకలు ఎందుకు కానీ.. కార్యం తేల్చేయ్." అనేసింది తమ్ముడుతో.
"అమ్మ మాటలు విన్నావుగా. అమ్మ చెప్పుతోంది నాకు నప్పదు. ఆస్తిలో నీకు ఏ వాటా లేదు." ఖరాఖండీగా చెప్పాడు రాఘవ.
ఇంతకు ముందు..
టీ కలుపుతున్న గిరిజమ్మకి అకస్మాత్తుగా కళ్లు తిరిగాయి. నిలదొక్కుకుంటూ అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చోగలిగింది. కొడుకుని పిలుస్తోంది. అవి చిన్న కేకల్లా హాలులో ఉన్న రాఘవకు వినబడ్డాయి.
రాఘవ వచ్చాడు.
"ఏమ్మా.. ఏమైంది.." అడుగుతూనే జోగిపోతున్న తల్లిని పట్టుకున్నాడు. లేవదీసాడు. గదిలోకి తీసుకుపోయి మంచం మీదకి చేరవేసాడు.
మంచి నీళ్లు తెచ్చి తల్లి ముఖం తడి గుడ్డతో వత్తాడు. కొద్ది నిముషాల్లోనే గిరిజమ్మ నిమ్మళమయ్యింది. కూర్చుంది.
"ఒక్కమాటుగా కళ్లు తిరిగాయి రా. ఇప్పుడు బాగుంది." చెప్పింది గిరిజమ్మ.
"హాస్పిటల్ లో చూపి వారం కాలేదు. మళ్లీ ఏమిటి. మందులు వాడడం లేదా." అడిగాడు రాఘవ.
"అయ్యో. వేళలుకు మింగుతున్నాన్రా." చెప్పింది గిరిజమ్మ.
ఆ వెంబడే..
"ఈ మారు దరి దరి నీర్సపడిపోతున్నాన్రా. నా మాట వినుకో. బింకాలు వద్దు. కోడలును.. మనవరాలును తెచ్చి ఇంట్లో పెట్టు. నువ్వు తగ్గితే అన్నీ కుదురుతాయి. నువ్వు కచేరీ పోతావు. నేను ఇదివరకటిలా ఒంటరిగా మెసలు లేను. భయమవుతోంద్రా. నా మాట వినుకోరా. అలాగే నీ అక్కని, బావని పిలిపించు. మాట్లాడాలి." చెప్పుతోంది.
అడ్డై.. "ఏమీ కాదు. సరిగ్గా ఉండు. నన్ను సతాయించుకు." సర్రున అనేసాడు రాఘవ.
ఆ వెంబడే..
"నాకు కొలువుకు వేళవుతోంది." అనేసాడు.
"నా సంగతి అక్కకి ఫోన్ చేసి చెప్పు. అది వస్తోంది. నాకు తగ్గే వరకు తోడుంటుంది." చెప్పింది గిరిజమ్మ.
కావ్యకి రాఘవ ఫోన్ చేసి.. "అమ్మకి బాగోలేదని చెప్పమంది. గందికేమీ లేదులే." చెప్పాడు. వెంటనే కాల్ కట్ చేసేసాడు.
దీర్ఘ నిట్టూర్పుతో లేవగలిగింది గిరజమ్మ.
కావ్య ఉంటుంది వీళ్లుంటున్న ఊరిలోనే. అర గంట లోపునే కావ్య ఇంటికి వచ్చేసింది. వంట వండుతున్న తల్లిని చూసి నొచ్చుకుంటుంది. రాఘవతో నిష్టూరమాడుతోంది. మరదలు ఊసాడింది.
"చాల్లే చెప్పొచ్చావు. నీ మరదలు తక్కువది కాదు. గొప్ప నెఱజాణ. దానికే అంత టెక్కుంటే నేనెందుకు తగ్గాలి." కసురుకుంటాడు రాఘవ.
"వీడు వినుకోడే. నేను ఇక వేగలేను. నేనుండగానే ఆస్తి పంచేస్తా. వాటాలు ఎత్తుకు పోండి." బాధలో విసురుగా అనేసింది గిరిజమ్మ.
"అంతే నమ్మా. నువ్వు ఉండగానే మాట ఖాతరు చేయని వీడు.. తర్వాత ఏం వింటాడు." అనేసింది కావ్య.
దాంతో రాఘవ తాండవము చేపట్టేసాడు.
అంతలోనే.. పిల్లలును తీసుకొని కావ్య భర్త సూరిబాబు అక్కడికి వచ్చాడు.
తల్లీ బిడ్డలు తగ్గారు.
"ఏమైందత్తమ్మ. ఇప్పుడు ఎలా ఉంది." గిరిజమ్మని పరామర్శించాడు సూరిబాబు.
"కూర్చో నాయనా." చెప్పింది గిరిజమ్మ.
హాలులోని కుర్చీలోకి చేరాడు సూరిబాబు.
"చూస్తున్నారుగా.. అమ్మ రోజు రోజుకి చిక్కిపోతోందిగా." అంది కావ్య.
తన ఇద్దరు పిల్లలు గిరిజమ్మను.. "అమ్మమ్మా" అంటూ చుట్టేసారు.
రాఘవ తచ్చాడుతున్నాడు.
"ఏం రాఘవా.. ఆఫీసుకి సెలవు పెట్టేసావుగా." అడిగాడు సూరిబాబు.
"పూట పెర్మిషన్ కి మెసెజ్ పెట్టాను." చెప్పాడు రాఘవ.
"నన్ను సెలవు పెట్టి వచ్చేయమంది మీ అక్క." చెప్పాడు సూరిబాబు.
"దానికేంటి. హుకుములు జారీ చేస్తోంది. మన అవస్తలు దానికెందుకు." రుసరుస లాడతాడు రాఘవ.
"అల్లుడుకి టీ ఇవ్వమ్మా." చెప్పుతోంది గిరిజమ్మ.
"వద్దొద్దు. ఇప్పుడేం వద్దు." చెప్పుతాడు సూరిబాబు.
"బావ వచ్చారుగా. మరి గుద్దులాటలు వద్దు. మాట్లాడేసుకుందాం." గమ్మున అన్నాడు రాఘవ.
"ఏమైంది రాఘవా." అడుగుతాడు సూరిబాబు.
"మరి చెప్పు బావా. ఆస్తిలో ఒక వాటా అక్కకి నేనెందుకు ఇవ్వాలి. ఆఁ." రాఘవ ఊగిపోతున్నాడు.
"ముందు నువ్వు కూర్చో రాఘవ." చెప్పాడు సూరిబాబు.
నిల్చున్న చోటే నేల మీదే గిరిజమ్మ చతికిలబడిపోయింది. ఆమెకు ఆసరాగా తల్లి పక్కనే కూర్చుంటుంది కావ్య. పిల్లలు అయోమయమవుతున్నారు. వాళ్లు ఫోర్త్.. సిక్స్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్.
"రాఘవ నిదానం అవ్వు. ఏమైంది. కావ్య ఏమైనా కదుపుతుందా." మెల్లిగా వాకబు చేపట్టాడు సూరిబాబు.
"అయ్యో. నేనేం కదిపేది లేదు." కలగచేసుకుంటుంది కావ్య.
"అమ్మే తొందరవుతోంది. తనకు ఏమో అవుతుందని గందిక చేస్తోంది." చెప్పాడు రాఘవ.
"అవును. నా ఒళ్లు నాకు తెలుస్తోంది. నేను ఉండగా చక్కబెట్టేస్తే.. తృప్తిగా పోగలను." చెప్తోంది గిరిజమ్మ.
"అలానే కానీ. కానీ అక్కకి వాటా ఎందుకు అంటున్నా." సర్రున అన్నాడు రాఘవ.
సూరిబాబు కాస్తా ఇరకాటమవుతాడు. తల తిప్పి భార్యని చూస్తాడు. తనూ అతడినే చూస్తోంది. తర్వాత ఇద్దరి చూపులు మారాయి. ఇద్దరూ రాఘవని చూస్తున్నారు.
"చెప్పు బావా. నా నిలదీత తప్పా." అడుగుతున్నాడు రాఘవ.
సూరిబాబు ఏమీ అనలేక ఊరుకుండిపోతాడు.
"అక్కకి పెళ్లితో అన్నీ ముగించేసాం. తనకి ఏమీ లోటు పర్చలేదు. నీకు తెలియదా బావా." ఆగాడు రాఘవ.
అటు ఇటు లా తలాడించడం తప్పా సూరిబాబు ఏమీ అనలేక పోతున్నాడు.
గిరిజమ్మ కలగ చేసుకుంది.. "మీ నాన్న పోతూ నాకు ఆస్తి అప్పగించాడు. మీకు తెలిసిందే. ఇంత వరకు పెద్ద ఖర్చులు అన్నీ దానిలోంచే పెట్టాను. అదీ మీకు తెలుసు. అక్కకీ పెళ్లి చేసాను. నీకు ఉద్యోగం వచ్చేక నీకూ పెళ్లి చేసాను. నీ జీతం నీదన్నట్టు నడుచు కుంటున్నావు నువ్వు. అడపాతడపా బొటబొట ఖర్చులు పెడుతున్నావనుకో. వీటిని ఏమీ నేను పెద్దగా తీసుకోవడం లేదు.." చెప్పుతోంది గిరిజమ్మ.
ఆ వెంబడే..
"ఏం బాబూ.. మీరీ ఇంటి అల్లుడుగా వచ్చిన లగాయతు మావి మీకు ఎరికేగా. ఏమైనా దాపరికమా." సూరిబాబుని అడుగుతోంది.
సూరిబాబు 'అవును' అన్నట్టే తలాడించాడు. కానీ రాఘనవే చూస్తున్నాడు.
"ఏంటీ లెక్కలూ.. కోతలు.. ఐనా.. ఇన్నెందుకు అమ్మా. బెంగతో బెంబేలు పడుతున్నావుగా. మరెందుకు. మిగిలిన ఆస్తి నాకే రాసే." పూనకం పట్టేవాడిలా ఊగిపోతున్నాడు రాఘవ.
గిరిజమ్మ గింజుకుంటుంది.
సూరిబాబు విస్మయంలో ఉన్నాడు.
కావ్య తల్లిని సముదాయిస్తోంది.
పిల్లలు తమ తల్లి చేరువున తంటాలు పడుతున్నారు.
"ఏం బాబూ మాట్లాడవు." గిరిజమ్మ ప్రయత్నంగా అడుగుతోంది సూరిబాబుని.
సూరిబాబు ఇక తప్పేలా లేదనుకున్నాడు.
"రాఘవ.. ప్రతి దానికి నువ్వు ఆవేశ పడిపోతావు. అమ్మ చెప్పేది నచ్చక పోతే నచ్చ చెప్పు. అంతే కానీ గగ్గోలు పడకు." చెప్పగలిగాడు.
రాఘవ మరింత రేగిపోతాడు.
"అవునవును. అంతే కానీ.. ఆస్తిలో మీ అక్కకి వాటా ఎందుకులే అనవు బావ. అనలేవు బావ.. ఉబ్బరిగా వచ్చేది వదులుకో బుద్ధి కాదులే." కస్సుమన్నాడు రాఘవ.
సూరిబాబు తంటాలవుతున్నాడు.
"ఏంట్రా.. నోటికి ఎంతొస్తే అంత అనేస్తున్నావు. అదుపులో పడు." కలగ చేసుకుంది కావ్య.
"ఓరె. ఆస్తి నాది. తంటాలు పడకు. తంటాలు పెట్టకు." మరి తప్పదన్నట్టు తేల్చేసేలా చెప్పేసింది గిరిజమ్మ.
రాఘవ మరింత రేగుతున్నాడు.
సూరిబాబు అతడిని ఆపడానికి యత్నిస్తున్నాడు.
మిగతా వాళ్లు బిత్తరలో పడ్డారు.
రాఘవ వాగుతూనే కుప్పకూలిపోయాడు.
అతడి గుండె.. ఆ..గి..పోయింది.