మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు
పశుపతినాథ్ ఆలయం, ఖాట్మండు, నేపాల్
శ్రీకర(1)కలితపదాబ్జ! య
గౌకస(2)! కందర్పదర్పహర! సుందరది
వ్యాకృతి! కావుమ భవ! హర!
శ్రీకంఠ(3)! నతార్థిచక్రి! శ్రీధరహారా!(4)
(1) శుభకర (2) పర్వతనిలయుడు (3) విషకంఠుడు (4) సర్పములు హారములుగా కలవాడు
అని అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారి స్తుతితో;
మనిషి భౌతిక దేహంలో ఇమిడిపోయి ఉన్న ఆత్మజ్ఞానాన్ని వెలికితీసి, ఆ జ్ఞానానికి సృజనాత్మకతను జోడించి ఇహ, పర విషయపరిజ్ఞానాన్ని శోధించి, అవగతం చేసుకుని తద్వారా అనంత విశ్వంలోని అనేక అలౌకిక విషయాలను అవపోసన పట్టినవాడే మహా యోగి, బ్రహ్మజ్ఞాని కాగలడు. అటువంటి మహా జ్ఞానులు, యోగులకు ఆవాసమైన హిమపర్వత శ్రేణులలో ఉన్న నేపాల్ దేశం లోని పశుపతినాథ్ ఆలయ విశేషాలు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఫిబ్రవరి మాస సంచికలో మీ అందరికోసం అందిస్తున్నాను.
ఆసియా ఖండంలో ఉన్న నాలుగు ప్రధాన శివాలయాలలో శ్రీ పశుపతినాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం 5 వ శతాబ్దం లోనే నిర్మించినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. నేపాల్ దేశం మొత్తం మీద అతి పెద్దదైన ఆలయ ప్రాంగణం కలిగి ఉన్న ఆలయం ఈ పశుపతినాథ్ దేవాలయం. ఈ పశుపతినాథ్, భాగమతి నది పడమటి ఒడ్డున ఎన్నో ఎకరాలు విస్తరించి ఉన్న ఏకైక ప్రాంగణం. పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరల నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడి శిల్ప సంపద హిందూ సంస్కృతికి ప్రతిబింబమనే చెప్పవచ్చు.
కైలాసగిరి ని చూడడానికి వచ్చే భక్తులు ముందుగా నేపాల్ లోని ఈ పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించి పిదప కైలాసగిరి దర్శనానికి వెళతారు. ఈ ఆలయంలో పెద్దఎత్తున వివాహితులైన స్రీలు తమ భర్త యోగక్షేమాల్ని కాంక్షిస్తూ. కన్యకలు మంచి వరుడు లభ్యం కావాలని ఆకాంక్షిస్తూ పూజాదికాల్ని నిర్వహిస్తారు. వీరికి శివుడు యోగశాస్త్ర పరంపరలో ఆదిగురువు, ఆరాధ్యదైవం. ముఖ్యంగా మహా శివరాత్రి నాడు సాక్షాత్తూ ఆ పరమశివుడే వచ్చి ఇక్కడ నాట్యమాడుతాడని భక్తుల నమ్మకం.
ఈ పశుపతినాథ్ ఆలయానికి ఎంతో విశిష్టమై, ఆధ్యాత్మిక భావనతో కూడిన ప్రత్యేక చరిత్ర ఉంది. అందరికీ అభయప్రదాత ఆ భోళాశంకరుడు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా అధిపతియే. అందరినీ కాపాదేవాడే. ప్రతి శివభక్తుడు ఎంతో భక్తీ శ్రద్ధలతో పూజించే ఈ పరమశివుడు, పశుపతి అంటే పశువులకు రాజైన నందీశ్వరుని రూపంలో ఇక్కడ సంచరిస్తున్న తరుణంలో ఇచ్చటి ప్రకృతి అందాలకు పరవశించి నాట్యమాడి పిదప దేవరూపం ధరించే ప్రక్రియలో తన శరీరం అయిదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని వివిధ ప్రదేశాలలో పడ్డాయి. ప్రధాన భాగమైన శిరస్సు మాత్రం ఈ ప్రదేశంలోనే ఉండిపోయి లింగాకృతి పొంది అదే పశుపతినాథ్ ఆలయంగా నేడు విలసిల్లుతోంది అని ఒక ఐతిహ్యం. మిగిలిన భాగాలు పడిన ప్రదేశాలు ‘పంచాకేదార్’ (కేదార్ నాథ్, రుద్రనాథ్, తుంగనాథ్,మధ్య మహేశ్వర్ మరియు కల్పేశ్వర్) లుగా ప్రసిద్ధిచెందాయి. భౌగోళికంగా చూస్తే హిమాలయాలు భారతఖండానికి కిరీటంవలె ఉండి ఎన్నో పుణ్యనదులు, ఆయుర్వేద వనమూలికలు, ఆధ్యాత్మిక మహిమలు కలిగి అలరారుతున్నాయి. అయితే రాజకీయ పరిణామాలు, దేశాల నైసర్గిక స్వరూపాలకు అనుగుణంగా ఈ హిమాలయాలు కూడా విడగొట్టబడ్డాయి. కనుకనే పంచాకేదార్ క్షేత్రాలు మన దేశంలోఉంటే, ఈ పశుపతినాథ్ ఆలయం నేపాల్ దేశంలో ఉంది. అలాగే కైలాసగిరి టిబెట్ దేశంలో (ప్రస్తుతం చైనా అధీనంలో) ఉంది.
ఏది ఏమైనా ఈ అతి పురాతన ఆలయాలు ఎంతో అపూర్వ శిల్పకళా సంపదతో, మనిషి ఎంతో ప్రశాంతతను చేకూర్చే మహిమతో నిరాజమానమై వెలుగొందుతున్నాయి.