Menu Close
Kasi Viswanatham
కంచి గరుడ సేవ (జాతీయం కథ)
కాశీ విశ్వనాథం పట్రాయుడు

కాశీపట్నం శివారులో ఒక ప్రవాస భారతీయుడికి (NRI) చెందిన పెద్ద ఫామ్ హౌస్ ఉంది. దానికి రంగయ్య కాపలాదారుగా ఉన్నాడు.

విదేశాల్లో ఉండే యజమాని ఎప్పుడు వస్తాడో ముందస్తు సమాచారం ఏమీ ఉండేది కాదు. అందుకే రంగయ్య ప్రతిరోజూ ఆ ఫామ్ హౌస్‌ను శుభ్రం చేస్తూ, కడిగిన ముత్యంలా ఉంచేవాడు.

ఏడాదికి ఒకసారి మాత్రం యజమాని తన కుటుంబంతో కలసి వచ్చి, ఒక వారం రోజులు సరదాగా గడిపి వెళ్లేవాడు.

ఒకరోజు రంగయ్య బంధువు ఒకరు అక్కడికి వచ్చి, రంగయ్య బావా! ఏంటి సంగతి, బాగున్నావా? నా కూతురు పెళ్లికి కూడా రాలేదు. మనం అంత కానివాళ్లం అయిపోయామా? అని నిష్ఠూరమాడాడు.

రంగయ్య నిట్టూరుస్తూ ఇలా అన్నాడు.. ఏం చెప్పను బావా! ఈ ఉద్యోగం వల్ల ఏ శుభకార్యాలకూ హాజరు కాలేకపోతున్నాను. అందుకే అందరితోనూ మాట పడాల్సి వస్తోంది. గడచిన రెండేళ్లుగా యజమాని రాలేదు, నాకు సరైన సమయానికి జీతం కూడా అందలేదు. నా బతుకు కంచి గరుడ సేవ అయిపోతోంది అని వాపోయాడు.

బావా! నీ పరిస్థితికి, ఆ సేవకు సంబంధం ఏమిటి? అని ఆ బంధువు సందేహంగా అడిగాడు.

అప్పుడు రంగయ్య ఇలా వివరించాడు.. కంచి గరుడ సేవ అనేది ఒక జాతీయం బావా! దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

108 దివ్యదేశాల్లో ఒకటైన కంచిలో వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌ గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అక్కడ ఒక భారీ ఇత్తడి గరుడ వాహనం ఉంటుంది. ఉత్సవాల సమయంలో ఆ వాహనంపైనే స్వామివారిని ఉంచి గరుడ సేవ నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహం కంటే ఈ గరుడ వాహనం పరిమాణం చాలా పెద్దది.

ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ముందు ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండే చిన్న ఇత్తడి సామాను మెరిపించడానికే ఎంతో శ్రమ పడాలి, ఇక అంత పెద్ద విగ్రహాన్ని తోమి, శుభ్రం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు.

ఈ పనిలో అక్కడి సేవకులు బాగా అలసిపోయేవారు. అప్పుడు వారు.. వరాలు ఇచ్చేది ఆ వరదరాజ పెరుమాళ్లు. ఆయనకు సేవ చేస్తే పుణ్యం వస్తుంది, కోర్కెలు తీరుతాయి. కానీ కేవలం వాహనమైన ఈ గరుడ మూర్తిని ఎంత తోమినా ప్రయోజనం ఏముంది? ఎంత కష్టపడినా ఫలితం ఉండదు కదా! అని బాధ పడేవారట.

నాటి నుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది బావా.. ఫలితం ఆశించకుండా చేసే చాకిరీని లేదా వృథా ప్రయాసను మనవాళ్లు కంచి గరుడ సేవ అంటారు.

ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే.. ఇల్లు మెరిసిపోవాలని శ్రమపడుతున్నాను కానీ, యజమాని రాడు.. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు అని బాధ పడుతూ చెప్పాడు రంగయ్య.

ఆ మాటలు విన్న బంధువు రంగయ్య నిస్సహాయతకు జాలిపడ్డాడు.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి.

కాశీ విశ్వనాథం.

Posted in February 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *