అరచేతిలో వైకుంఠం
శివరాంపురం గ్రామంలో అరసవిల్లి, సింహాచలం దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వారసత్వంగా వచ్చిన అర ఎకరం భూమిని సాగుచేసి పండిన పంటతో కాలక్షేపం చేసేవారు. కొంతకాలం తర్వాత అకాల వర్షాలు, నాసిరకం విత్తనాలు, మిడతలు మొదలైన కారణాల వల్ల పంట దిగుబడి తగ్గుతూ వచ్చింది. కుటుంబ పోషణ కష్టమై, భార్యభర్తలిద్దరూ కూలీనాలీ చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. బాగా చదివించారు. ఇద్దరు పిల్లలు ఉన్నత విద్యను పూర్తిచేశారు.
సరిగ్గా అదే సమయంలో దళారీల కళ్ళు ఆ పల్లె మీద పడ్డాయి. “మీ భూములు మాకు అమ్మితే అధిక ధర చెల్లిస్తాం” అని రైతులను ఒప్పించారు దళారీలు.
పంట దిగుబడి లేక, నష్టాల్లో ఉన్న రైతుకు భూమిని నమ్ముకునే కంటే అమ్ముకోవడమే మంచిదనిపించింది. అందరూ కలసి దళారీలకు అమ్మజూపారు. దళారీలు పట్నంలో ఉన్న పెట్టుబడి దారులచేత కొనిపించి నాలుగు కాసులు వెనకేసుకున్నారు. ఉన్న ధర కంటే ఎక్కువ ధర రావడంతో రైతులు కూడా సంతోషించారు. పొలాల చుట్టూ కంచెలు వెలిశాయి. పచ్చదనం కనుమరుగయ్యింది.
పొలాలు అమ్మిన డబ్బుతో అప్పులు తీర్చుకోవాలని కొందరు, కూతుళ్లకు పెళ్లి చెయ్యాలని కొందరు. వైద్యానికి ఖర్చుపెట్టాలని కొందరు అనుకున్నారు. కొద్ది నెలల క్రితం వెలసిన గోవిందా చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు రైతులను కలిశారు.
“మమ్మల్ని నమ్మండి. మీ డబ్బుకు మాదీ భరోసా. మా గోవిందా ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే వందరోజుల్లో మీ డబ్బుకు రెట్టింపు ఇస్తాం. అంతేకాదు మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి మంగళ సూత్రం కూడా ఉచితంగా ఇస్తాం. అనారోగ్యం పాలైతే వైద్య ఖర్చులు భరిస్తాం” అని నమ్మబలికారు.
ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన కొద్దిమందికి డబ్బులు రెట్టింపు కావడంతో జనాలకు ఆశపుట్టింది. దీంతో పొలాలమ్ముకున్న రైతులంతా తండోపతండాలుగా వెళ్ళి పెట్టుబడులు పెట్టారు.
అరసవిల్లి తన భార్యతో
“మనం పొలం అమ్మగా వచ్చిన డబ్బు పెద్దదాని పెళ్లికే సరిపోవు అందుచేత ఈ డబ్బులను గోవిందా ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే వందరోజుల్లో రెట్టింపు అవుతుంది. ఆ డబ్బులతో ఇద్దరికీ పెళ్లిళ్లు చెయ్యొచ్చు” అన్నాడు.
“నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఆడు అర సేతిలో వైకుంఠం సూపిత్తన్నాడు” అంది భార్య సింహాచలం.
భార్య మాటను పెడచెవిన పెట్టి, పొలం అమ్మగా వచ్చిన డబ్బులన్నీ గోవిందా ఫైనాన్స్ లో పెట్టుబడి పెట్టాడు అరసవిల్లి.
రెండు నెలల కాలం గడిచింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి గోవిందా చిట్స్ అండ్ ఫైనాన్స్ ప్రతినిధులు డబ్బులన్నీ పట్టుకుని పరారయ్యారు.
ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారందరూ అటు భూమి లేక ఇటు డబ్బులు లేక నిరాధారమై లబోదిబో మంటూ ఏడవసాగారు.
“నేను సెప్తే ఇన్నావు కాదు. మనకి ఎవరైనా అరసేతిలో వైకుంఠం సుపిత్తామంటే నమ్మేయడమేనా? అది సాధ్యమేనా అని ఆలోసించాలి. ఇప్పుడు ఏడిసి ఏం లాభం?” అని చివాట్లు పెట్టింది భార్య సింహాచలం. కిమ్మనకుండా ఉండిపోయాడు అరసవిల్లి.
"అరచేతిలో వైకుంఠం" అనేది ఒక సామెత. అరచేతిలో వైకుంఠం చూపించడం ఎలా సాధ్యం కాదో అలాగే కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు ఇచ్చిన హామీలు కూడా అమలుపరచడం సాధ్యం కాదు. ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని వారి కోరికలు లేదా అవసరాలను తీరుస్తామని, వారి డబ్బును రెట్టింపు చేస్తామని, భ్రమ కల్పించి, నమ్మబలికి, మోసం చేసే సందర్భాల్లో ఈ సామెతను వాడుతున్నాము.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.
ఏ కథకు ఆ కథే సందేశాత్మకంగా ఉంది. ఆలోచింప చేస్తున్నాయి. కల్పిత కథలా కాకుండా వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈ రోజుల్లో జరిగే కార్పోరేటర్లు మెాసాలు ఇలాంటివే.చాలా సంతోషం. అద్భుతం సార్.