Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

తిరుపతిలో బోడిగుండును వెతికినట్లు

చామలాపల్లి అగ్రహారంలో లక్ష్మీనరసమ్మ అనే ముసలామె నివాసముండేది. ఆమె వయస్సు 78 సంవత్సరాలు. ఆమెకు సరిగ్గా వినపడదు, కనపడదు. ఏదీ గుర్తుండదు అయినా చలాకీగా అందరి ఇళ్ళకు వెళ్ళి చుట్టరికాలు చేసి వచ్చేది. ఓ ఏడాది సంక్రాంతికి నెల్లిమర్లలో ఉంటున్న ఆఖరి అన్నదమ్ముడు సత్తిబాబు రమ్మనమని పిలిచాడు. తమ్ముడు మాట కాదనలేక సత్తిబాబు ఇంటికి బయలుదేరింది. నెల్లిమర్ల వెళ్ళే బస్సు ఎక్కింది. “ఎక్కడికి వెళ్తారు మీరు?” అని అడిగాడు కండక్టర్. ఎక్కడికి వెళ్ళాలో చాలాసేపటి వరకు ముసలమ్మకు గుర్తుకురాలేదు. బుర్ర గోక్కుంటూ ఆలోచించి,

“మా తమ్ముడు ఇంటికి టిక్కెట్టు ఇవ్వండి” అని అడిగింది. “మీ తమ్ముడు ఏ ఊళ్ళో ఉంటాడు?” అడిగాడు కండక్టర్.

ఈలోగా పక్కనే ఉన్న ఓ పెద్దాయన “నాకు నెల్లిమర్లకు ఒక టికెట్టివ్వండి” అన్నాడు. “అదే బాబూ నెల్లిమర్ల కే నాకూ ఓ టికెట్టివ్వండి” అంది ముసలమ్మ.

“మా తమ్ముడి ఇంటిదగ్గర బస్సు ఆపు బాబు నేను దిగిపోతాను” అంది లక్ష్మీనరసమ్మ.

“మీ తమ్ముడి ఇల్లు నాకెలా తెలుస్తుంది. బస్సులు ఎక్కడ పెడితే అక్కడ ఆపరు” అన్నాడు విసుగ్గా కండక్టరు.

“ఇక్కడే కరెంటు స్థంభానికి ఒక గేదె కట్టి ఉంటుంది ఆ వీధిలోనే మా తమ్ముడి ఇల్లు” అంది లక్ష్మీనరసమ్మ.

“చాలు చాల్లే మా గొప్పగా చెప్పొచ్చావు 'తిరుపతిలో బోడి గుండును వెతికినట్లు” అన్నాడు కండక్టర్.

“మీ తమ్ముడు ఎవరమ్మా?” అడిగాడు పెద్దాయన. “పోలీసు పని చేసేవాడు. సత్తిబాబు అంటారు” అంది ముసలమ్మ.

“ఆ ముసలామె తమ్ముడు మా ఇంటి పక్కనే ఉంటాడు. ఆమెను నేను తీసుకు వెళ్తాను.” అని కండక్టర్ కి చెప్పాడు పెద్దమనిషి.

“మా బాబే మంచి మాట చెప్పేవు కానీ కండక్టర్ బాబేంటి గేదె అంటే బోడిగుండు అంటాడు” అని పెద్దమనిషిని అడిగింది ముసలమ్మ.

“గతంలో ఒకసారి పల్లెటూరి ఆసామీ తన కుటుంబంతో తిరుపతికి వెళ్ళాడట. తలనీలాలు ఇచ్చి దర్శనానికి వెళ్ళే సమయంలో అతడి ఆరేళ్ల కొడుకు తప్పడిపోయాడట. లబో దిబో మని ఏడుస్తూ అందరినీ వాకబు చేశాడట. నీ కొడుకు ఎలావుంటాడని ఎవరైనా అడిగితే 'బోడి గుండుతో' అని సమాధానమిచ్చేవాడట.

అందులో ఒకరికి ఒళ్ళు మండి “తిరుపతిలో అందరూ బోడి గుండుతోనే దర్శనమిస్తారు. తిరుపతిలో బోడిగుండును వెతకడమేమిటి. అందరూ బోడి గుండుతోనే దర్శనమిస్తారు. ప్రత్యేకమైన ఆనవాళ్ళు చెప్తే గుర్తించగలం” అని అన్నాడట.

అప్పటి నుంచి 'తిరుపతిలో బోడిగుండును వెతికినట్లు' అన్న సామెత వాడుకలోకి వచ్చింది. ఆనవాళ్లు సరిగ్గా చెప్పని సందర్భంలో వాడే సామెత ఇది” అని వివరించాడు పెద్దాయన.

“అదా! సర్లే” అంది ముసలమ్మ. ఇంతలో బస్సు నెల్లిమర్లకు చేరుకుంది.

“సరే బాబు ఆ ఆంజనేయస్వామి బొమ్మదగ్గర బస్సు ఆపు దిగిపోతాము” అన్నాడు పెద్దమనిషి.

ఆంజనేయస్వామి గుడి దగ్గర బస్సు ఆగగానే ఇద్దరూ బస్సు దిగారు. “ఎప్పుడూ ఇక్కడ కరెంటి స్తంభానికి గేదె కట్టి ఉండేది. ఇప్పుడు లేదు” అనుకుంటూ పెద్దమనిషి సాయంతో తమ్ముడు సత్తిబాబు ఇంటికి క్షేమంగా చేరుకున్నారు లక్ష్మీ నరసమ్మ.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in August 2025, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *