Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

చుక్కెదురు(జాతీయం కథ)

రాజారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. హోటల్ వ్యాపారం చేస్తే ఇంతకు పదింతలు సంపాదించవచ్చని మిత్రులు సలహా ఇవ్వడంతో హోటల్ వ్యాపారం ప్రారంభించాడు.

వ్యాపార అనుభవం లేకపోవడం, పని చేసేవారి జీతాలు, కరెంటుబిల్లు, రూము అద్దె, సామానులకు అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉండడం అందుకు తగ్గట్టు బేరాలు లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ మిగిలేది కాదు. కొన్నాళ్ళకు పూర్తిగా అప్పులపాలు అయ్యాడు.

ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాలేదు. డబ్బులు సాయం చెయ్యమని స్నేహితులు బంధువుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ముఖం చాటేశారు. అప్పుగా ఇవ్వడానికి కూడా ఇష్టపెట్టుకోలేదు. ఇంటి జాగా అమ్మి అప్పుతీరుద్దామని అనుకున్నాడు.

ఒకరోజు ఆ జాగా దగ్గరికి వెళ్ళాడు. తీరాచూస్తే ఆ జాగాని ఎవరో ఆక్రమించుకున్నారు. వారితో గొడవపడి కోర్టుకు వెళ్తానని వారిని హెచ్చరించి ఉసూరు మంటూ ఇంటికి వచ్చాడు రాజారావు. కొడుకును చూసి “ఇక్కడా చుక్కెదురేనా?” అని అడిగింది తల్లి. జరిగినదంతా తల్లికి చెప్పి బాధపడ్డాడు రాజారావు.

“చుక్కెదురు పోవాలంటే పూజలు ఏమైనా చేయించాలా అత్తగారు” అని అడిగింది కోడలు.

నీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురైన సందర్భంలో చుక్కెదురేనా అని అడుగుతారు.

పంచాంగం ప్రకారం దీన్ని ప్రతిశుక్ర, భౌమ, బుధ దోషం అంటారు. ప్రయాణం చేసే సమయంలో కొంతమంది రాహుకాలం, వర్జ్యం, శకునం, యమగండం లాంటివి చూస్తుంటారు. ఏ దిక్కుకు ఏ రోజు ప్రయాణిస్తే మంచిదో కూడా మన పంచాంగాలు చెబుతాయి.

చుక్క అంటే శుక్రుడు. మనం వెళ్లాల్సిన దిక్కున కుజ, శుక్ర, బుధ గ్రహాలు సంచారం చేస్తుంటే ఆ రోజు ప్రయాణం మానుకోవాలి. దీనికే చుక్క ఎదురు, లేదా ఎదురు చుక్క అంటారు.

గర్భిణీలను ప్రసవానికి తీసుకెళ్లేటపుడు, పుట్టింటినుంచి పసిబిడ్డతో అత్తగారింటికి పంపిస్తున్నపుడు కుజ, బుధ, శుక్ర గ్రహాలు సంచారం చేస్తున్న దిక్కుగా వెళ్లడం అశుభ్రదమని అలా చెయ్యడం వల్ల అనేక అవాంతరాలు ఎదురౌతాయి అనేది కొంతమంది నమ్మకం.

అలా ఆనాటి నుంచి ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురయ్యే సందర్భంలో చుక్కెదురేనా అని అనడం అలవాటుగా మారింది. ఇది ఒక జాతీయం.” అని చెప్పింది అత్తగారు.

“ఓహో అదా సంగతి. తెలిసింది లెండి” అంది కోడలు.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in June 2025, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *