
కతికితే అతకదు
అనకాపల్లిలో నివాసముంటున్న ఆనందరావు తన కొడుకు మన్మధరావుకు పెళ్లి చేయదలచి దగ్గరి బంధువులందరికీ మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పాడు.
ఒకరోజు తగరపువలసలో ఉన్న తాతారావు అనందరావుకు ఫోన్ చేసి కాకినాడలో ఉన్న మన దగ్గరి బంధువు కాంతారావు కూతురు కాత్యాయని అయితే మన్మధరావుకి ఈడూజోడు బాగుంటుందని, మీకు ఇష్టమైతే పెళ్లి చూపులకు వెళ్దామని చెప్పి, పెళ్లి కూతురి వివరాలు చెప్పాడు.
మంచిరోజు చూసుకుని తాతారావుతో కలిసి ఆనందరావు కుటుంబసభ్యులు కాంతారావు ఇంటికి వెళ్ళారు.
కాంతారావు కుటుంబసభ్యులు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సపర్యలు చేసారు. తేనీరు, అల్పాహారాన్ని ఏర్పాటు చేసారు. అసలే ఆకలిమీద ఉన్న మన్మధరావు మిఠాయిని తినబోయాడు. అది గమనించిన తాతారావు తినవద్దని సైగ చేసాడు. ‘సరే’ నని ఊరుకున్నాడు. ఇరు కుటుంబాల వారు వారి అభిరుచులు, ఆలోచనలు, చుట్టరికాలు అన్నీ ఒకరికొకరు చెప్పుకున్నారు.
“మా ఇంటికి మీరు రండి” అని చెప్పి ఆనందరావు కుటుంబసభ్యులు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
“నాయనా మన్మధ! నువ్వు ఆకలి మీద ఉన్నావని నాకు తెలుసు కానీ పెళ్లి మాటలకు వెళ్లినపుడు కతికితే అతకదని పెద్దలు చెప్పిన మాట. కతకడం అంటే తినడం అని అర్థం. ఎందుకు తినకూడదు అంటే
వివాహంలో ఇల్లుచూపులు ప్రధానమైనవి. పూర్వం మగ పెళ్ళివారు అబ్బాయితో సహా అమ్మాయి ఇంటికి వెళ్ళేవారు..
అమ్మాయి తరపువారు అమ్మాయిని చూపించక మునుపే వారికి విందు భోజనం వడ్డించేవారు. ఆ సమయంలో ఆడపిల్ల తరపువారు అబ్బాయి కూర్చొనే విధానం అంటే పద్మాసనంలో కూర్చొంటే సౌమ్యుడనీ, నడుము నిటారుగా కూర్చుంటే ఆత్మ విశ్వాసం గలవాడనీ, కొన వేళ్ళతో కలిపితే అంటీ ముట్టక ఉంటాడనీ, వేళ్ళ సందులో నుంచి అన్నం పడిపోతూ ఉంటే లక్ష్మీ నివాసి కాదని, బాగా నమిలి ఓపిగ్గా తింటే ఓపిక కలవాడని, తొందరగా తింటే తొందరపాటు గలవాడనీ, మొదట కారం తింటే కోపిష్టి అనీ, అన్ని కూరలూ తింటే సంపూర్ణుడనీ, నాకి నాకి తింటే లోభి అనీ, కంచంలో ఒక్క మెతుకు లేకుండా తింటే జాగ్రత్త పరుడని, కొంత వదిలేస్తే దుబారా పరుడని, ఇలా అబ్బాయి తినే విధానం, మాట్లాడే విధానం, ఆచారం, సభ్యత, సంస్కారం అన్నింటినీ అంచనా వేసి అతని గుణగణాలు నచ్చితే అమ్మాయిని చూపించేవారు. నచ్చకపోతే ఏదో సాకు చెప్పి తిరస్కరించే వారు. అందుకని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కతికితే అతకదని సాకు చెప్పి తినేవారు కాదు. అలా అప్పటి నుంచి అది ఒక నమ్మకంగా మారింది. జనాల నోళ్ళలో సామెతగా మిగిలింది” అని చెప్పాడు తాతారావు.
“ఈ వంకనైనా సామెత గురించి తెలిసింది” అన్నాడు మన్మధరావు.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.
కొత్తగా, ఆసక్తి పెంచేలా ఉంది మాష్టారూ! అభినందనలు ! ప్రచురించి ప్రోత్సహిస్తున్న సిరిమల్లె నిర్వాహకులకు ధన్యవాదాలు!