Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదు

weakboy-mother-grandfather

ఉప్పాడపేటలో ఉన్న లక్ష్మి, సన్యాసిరావు దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రవి. కొడుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వాడు ఆడిందే ఆట పాడిందే పాట. ఏది కావాలంటే అది కొని ఇచ్చేవారు. రవి చిరుతిళ్ళు ఎక్కువగా తినేవాడు.

ఇంట్లో తల్లి ఎంత రుచిగా వండి పెట్టినా. కూర కారంగా ఉందనో, ఉప్పగా ఉందనో వంక పెట్టి తినేవాడు కాదు.

అలాగే రాత్రిపూట పడుకునే సమయంలో కూడా "అబ్బా... ఆ ఫ్యాన్ గాలి నాకు తగలడం లేదు, పడుకున్న పక్క సరిగా లేదు, మెత్తగా లేదు, ఉక్కపెడుతోంది" అంటూ పేచీ పెట్టేవాడు. వాడిని నిద్రపుచ్చడానికి లక్ష్మికి తలప్రాణం తోకకి వచ్చేది.

అర్థరాత్రి వరకు కొడుకు మెలకువగా ఉండడంతో లక్ష్మి కూడా మెలకువగా ఉండాల్సివచ్చేది. దాంతో ఉదయాన్నే తొందరగా నిద్ర లేవలేక పనులన్నీ ఆలస్యమయ్యేవి.

సరిగ్గా తిండి తినకపోవడం, వేళకు నిద్రపోకపోవడంతో రవి ఆరోగ్యం దెబ్బతిన్నది. కొడుకుని ఎలా దారిలోకి తేవాలో అర్థం కాలేదు లక్ష్మికి.

మనవడిని చూడాలనిపించి ఉప్పాడ పేటకు వచ్చాడు రవి తాతయ్య ప్రకాశరావు. మనవడు బలహీనంగా ఉండటం చూసి చాలా బాధపడ్డాడు. కోడలిని అడిగి విషయం తెలుసుకున్నాడు.

“మార్పు రావలసింది మనవడిలో కాదు మీలో. మప్పుకుంటే తిప్పుకోవడం కష్టం. మీరు చిరుతిళ్ళు అలవాటు చేసారు. వాడు అన్నం, కూర ఎందుకు తింటాడు.” అని కోడలిని మందలించాడు మామగారు.

“ఎంత రుచిగా వండినా తినడం లేదు. ఏదో ఒక వంక పెడుతున్నాడు. నేనేం చేసేది” అంది కోడలు.

“నాతో రా” అని దగ్గర లో ఉన్న పొలం దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది కూలీలు గట్టు మీద కూర్చొని ఉల్లిపాయ నంజుకుని చద్ది అన్నం తింటున్నారు. కాస్త దూరంలో చెట్టు కింద కటిక నేలమీద ఒక పశువుల కాపరి నిద్రపోతున్నాడు.

ఇదేనమ్మా ‘ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదు’ అంటే బాగా ఆకలి వేసినప్పుడు రుచి తెలియదు, అలసిపోయి నిద్రవచ్చేటప్పుడు సుఖం గురించి ఆలోచించము.

మనవడికి చిరుతిళ్ళు పెట్టకుండా ఉంటే ఆకలి బాగా వేస్తుంది. అప్పుడు ఎంచక్కా మారు మాట్లాడకుండా నువ్వేది పెడితే అదే తింటాడు. అలాగే, తోటి పిల్లలతో ఎక్కువసేపు ఆటలాడి బాగా అలసిపోయి ఉంటే మాత్రం, ఎక్కడ పడుకున్నాడో, ఎలా పడుకున్నాడో కూడా తెలియకుండా ఎంచక్కా వాడు నిద్రపోతాడు.” అని చెప్పాడు ప్రకాశరావు.

మామగారు చెప్పినట్లు రవికి చిరుతిళ్ళు పెట్టడం మానేసింది. ఆకలి బాగా వెయ్యడంతో ఆవురావురుమంటూ బుద్ధిగా అమ్మ పెట్టిన బువ్వ తిన్నాడు.

నేస్తులతో ఆడుకుని అలసి అలసి ఇంటికి వచ్చిన కొడుక్కి స్నానం చేయించి అన్నం పెట్టింది లక్ష్మి. ఇంటి పనులు పూర్తి అయ్యేలోగా హాయిగా నిద్రపోయాడు రవి.

సరిగ్గా ఇలాంటి విషయాలనే పోల్చుతూ పూర్వకాలంలో పెద్దలు "ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదు" అన్న సామెతను వాడుకలోకి తెచ్చారు. ఇలా ఈ సామెతను ఎన్ని రకాల విషయాలకైనా అన్వయించుకోవచ్చు.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in March 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!