Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

తుంతగువు

Thumthaguvu Katha

సీతంపేట గ్రామంలో నరసింహులు అనే ఆసామి తన ఇద్దరు కొడుకులతో నివసిస్తూ ఉండేవాడు.

నరసింహులుకి రెండెకరాల పల్లం, రెండెకరాల జీడి, మామిడి తోట ఉంది. పెద్దకొడుకు సత్యం బద్ధకిష్టి. చిన్నకొడుకు నారాయణ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.

ఒకరోజు కొడుకులిద్దరిని పిలిచి పెద్దకొడుకు సత్యాన్ని మామిడితోటలను, చిన్న కొడుకు నారాయణను పల్లపు భూమిని సాగుచేసుకోమని చెప్పాడు. కొన్నాళ్ళ తరువాత నరసింహులు కాలం చేశాడు.

తండ్రి చనిపోగానే “మా నాన్న నాకు అన్యాయం చేశాడు. మీరే నాకు న్యాయం చెయ్యాలి” అని గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశాడు సత్యం.

“మీ నాన్న తెలివి తక్కువ వాడు కాదు. నిరంతరం కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. అందుకే దానిని నీ తమ్ముడికి ఇచ్చాడు. నువ్వు కష్టపడకుండానే ఫలసాయాన్ని పొందవచ్చని నీకు మామిడితోటలు ఇచ్చాడు.” అని చెప్పాడు గ్రామపెద్ద.

విషయాన్ని గ్రహించిన సత్యం మారుమాట్లాడకుండ వెళ్ళిపోయాడు.

“తుంతగువు” బాగా తీర్చారు” అన్నాడు పక్కనే ఉన్న అప్పన్న.

“ఆ తగువేంటో మాకు చెప్పు” అన్నారు అక్కడున్న వారు.

“పూర్వం ఒక రోజు జ్యేష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని వాదులాడుకుని తుని గ్రామంలో ఉన్న సెట్టి గారింటికి వెళ్లి తగువు తీర్చమని అడిగేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.

ఎటు తీర్పు చెప్పినా చిక్కేనని ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. అలా ‘కర్ర విరగకుండా పాము చావకుండా’ మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.

నాటినుంచి తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయం వాడుకలోకి వచ్చింది” అని చెప్పాడు అప్పన్న.

“శెభాష్ అప్పన్న! బాగా చెప్పావు” అన్నాడు గ్రామపెద్ద.

(తుని అనేది ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం. ఆ పేరు మీద ఉన్న జాతీయం)

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in February 2025, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!