
ఎరిక పిడికెడు ధనం

చాలా సంవత్సరాల క్రితం వరుసగా నాలుగేళ్లు వర్షాభావం ఏర్పడటంతో లోతేరు చుట్టుపక్కల గ్రామాలకు కరువుకాటకాలు సంభవించాయి. తినడానికి తిండిలేక బ్రతుకు తెరువుకోసం చుట్టుపక్కల గ్రామస్తులు కొందరు చెన్నపట్నం వెళ్లి కూలీనాలీ చేసుకుంటూ స్థిరపడ్డారు.
మరి కొద్ది కాలం తరువాత లోతేరు గ్రామస్తులు కూడా పిల్లా పాపలతో చెన్నపట్నానికి వెళ్ళారు. అక్కడ అందరూ తమిళంలో మాట్లాడటంతో వీరికి ఆ భాష అర్థంకాక చాలా ఇబ్బంది పడ్డారు.
ఎలాగైతేనేమి కొద్ది మందికి భవన నిర్మాణ కార్మికులుగా పని దొరికింది. వారు సంపాదించిన దినసరి వేతనంతో కాలం గడిపేవారు. మిగిలినవారికి కూలీనాలీ లేక తెచ్చుకున్న కాసిన్ని డబ్బులు అయిపోయాయి. దాంతో తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక, చాలా ఇబ్బందులు పడ్డారు. అలా పనికోసం తిరుగుతున్న సమయంలో వారికి పరిచయస్తుడైన అప్పన్న అనే ఆసామి కనిపించాడు.
“ఒరేయ్ సోములు మన పొరుగూరు అప్పన్నలా ఉన్నాడురా!” అన్నాడు రాముడు.
“నిజమేరా” అన్నాడు సోములు.
“ఎందుకా సంశయం పిలిస్తే తెలిసిపోతుంది.” అంటూ ‘అప్పన్నా’ అని గట్టిగా కేక వేశాడు వీరేసు.
ఇంకేముంది అప్పన్న వెనక్కి తిరిగి చూశాడు.
“సోములు, రాముడు, వీరేసు... బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు” అని ఆత్మీయంగా పలకరించాడు.
భాషరాక, పనిలేక, తిండిలేక, పడుతున్న ఇబ్బందిని వారు ఏకరువు పెట్టారు.
వారి కష్టాలను విని ఎంతో బాధపడ్డాడు అప్పన్న.
“మీ అందరికీ ఒక దారి చూపిస్తాను దిగులు పడకండి” అని చెప్పి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికీ పని చూపించాడు అప్పన్న.
అందరూ పనిలో చేరి తలో ఇంత సంపాదించుకుంటూ హాయిగా కాలం గడిపారు. ఎప్పటికప్పుడు వచ్చి వారి యోగ క్షేమాలు విచారించేవాడు. అలా ఓ సారి వచ్చినప్పుడు “ఎరిక పిడికెడు ధనం” అని ఊరికినే అనలేదు. ఆరోజు నువ్వు కనపడకపోతే మా బతుకేం గాను” అన్నాడు వీరేసు అప్పన్నతో.
“దానికేముంది పరిచయస్తులం, ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళం, ఈ మాత్రం సాయం చెయ్యకపోతే మరెందుకు” అన్నాడు అప్పన్న.
“ఎరిక లేదా ఎరుక అంటే పరిచయం లేదా పరిచయస్తుడు, స్నేహితుడు అని అర్థం. వారు కష్టకాలంలో ఆదుకునే పిడికెడు ధనంతో సమానం. అందుకే “ఎరిక పిడికెడు ధనం” అన్నారు. తెలియని ప్రదేశంలో స్నేహితులైనా ఉండాలి లేదా సొమ్మయినా ఉండాలి. రెండు లేకపోతే జీవితం గడవడం కష్టం. ఇది పెద్దలమాట.” అని చెప్పాడు వీరేసు.
“నువ్వు చెప్పింది నిజమే. అప్పన్న రుణం తీర్చుకోలేనిది” అన్నాడు సోములు.
“మనం స్నేహితులం. ఇది నా ధర్మం. మీకు ఏది అవసరమైనా నాకు చెప్పండి.” అని చెప్పాడు అప్పన్న.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.