Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి

two-friends

చల్లపేట గ్రామంలో రాము, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలసి చదువుకున్నారు. పెరిగి పెద్దవారయ్యారు. రాముకి చదువు అబ్బలేదు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనం సాగించేవాడు. రవి ఉన్నత చదువులు చదివి వైద్య వృత్తిని చేపట్టాడు.

కొంతకాలం తరువాత స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు.

“నువ్వు రెండుచేతులా సంపాదిస్తున్నావు. విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నావు. నీ అంత అదృష్టవంతుడు మరొకడు లేడు” అన్నాడు రాము.

“ఎంత సంపాదిస్తే ఏం లాభం. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఉండదు. ప్రకృతి ఒడిలో ఎలాంటి ఒత్తిడులు లేకుండా జీవితం గడుపుతున్న నువ్వే నాకంటే అదృష్టవంతుడివి” అన్నాడు రవి.

‘సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి’ నేను కాలాన్ని కనిపెట్టుకుంటూ నిరంతరం శ్రమించాలి. నాకు విశ్రాంతి అన్నది లేదు. తెల్లారి లేచింది మొదలు కసవలు తుడవాలి, పశువులకు మేత పెట్టాలి, పాలు పితకాలి వాటిని పాలకేంద్రానికి ఇవ్వాలి. తరువాత పొలం పని పశువులను మేపుకు రావాలి. ఈ మూగ జీవాలని వదిలి ఎక్కడికీ వెళ్ళలేము.” అన్నాడు రాము.

“సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి” అన్నావెందుకు. అని ఆశ్చర్యంగా అడిగాడు రవి.

“మీవి పట్నం చదువులు మీకు తెలియవులే. సీతమ్మవారు దేవత అయినా మనుష్య రూపంలో ఉండడం వల్ల ఆమెకి కష్టాలు తప్పలేదు. రావణాసురుడు ఎత్తుకుపోయాడు. రాములవారికి దూరంగా లంకలో అశోకవృక్షం కింద నిద్రాహారాలు లేకుండా గడిపింది. ఆమెది ఒక రకమైన కష్టం. నీటిలో ఉండే అల్పజీవి పీత. అన్ని జీవుల్లాగా ఇది తిన్నగా నడవలేదు. పొలాల్లో, చెరువుల్లో నీరు ఇంకిపోగానే బోరియల్లోకి వెళ్లిపోతుంది. పీత మాంసం అనేక రోగాలను నయం చేస్తుందనే నమ్మకంతో చాలామంది వాటిని చంపి కూర చేసుకుని తింటారు. అందుకని ఎవరికంట పడకుండా అవి జాగ్రత్త పడతాయి. వీటి కష్టం మరొక రకం. ఇలా జీవులు చిన్నవైనా పెద్దవైనా వేటి కష్టం వాటిది. అందుకే ‘సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి’ అని అన్నారు. కష్టాలు లేని జీవితమంటూ ఉండదు.” అని చెప్పాడు రాము.

“అంతేలే! ఎదుటివారు సుఖంగా, సంతోషంగా ఉన్నారని మనం అనుకుంటాం కానీ ఎవరి కష్టాలు వారికుంటాయి.” అన్నాడు రవి.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in December 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!