Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

కుక్కమూతి పిందె

mother-daughter-in-law

వినయ్, శ్రీజ భార్యాభర్తలు. వినయ్ దినసరి వేతనం మీద పని చేస్తున్నాడు. చాలీచాలని సంపాదనతో అత్తెసరు బతుకు బతుకుతున్నారు. కొన్నాళ్ళకు ఒక కూతురు పుట్టింది. అందాలరాశి దానికి ముద్దుగా భవాని అని పేరు పెట్టుకున్నారు.

ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. వినయ్ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంట్లో పెద్దవాళ్లు, స్నేహితులు ఒక్క పిల్లతో సరిపెట్టుకో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకో అని హితబోధ చేశారు. పెద్దల మాట వారి చెవికెక్కలేదు.

ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సంసారం సాగించారు. భవాని చదువు సంధ్యలు, అనారోగ్యాలు, అనుకోని ఖర్చులతో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇలా పదహారు సంవత్సరాలు గడిచింది.

శ్రీజ మళ్ళీ నెల తప్పింది అప్పటికి వినయ్ వయస్సు నలభై ఆరు సంవత్సరాలు, శ్రీజ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు. ఈ వయసులో పిల్లలు కనడం మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు.

కరవడి కాయలా ఆడపిల్ల పుట్టింది. అది చూసిన అత్తగారు కుక్క మూతి పిందెలా ఉంది అన్నారు. అత్తగారి మాటలకు శ్రీజ బాధ పడింది కానీ తప్పును తెలుసుకోలేక పోయింది.

అత్తగారు అన్నమాటలు ఆమెను సూదుల్లా గుచ్చడంతో ఒకరోజు సాయంత్రం అత్తగారి దగ్గరికి వెళ్లి ‘కుక్క మూతి పిందెలు’ అని మీరెందుకు అన్నారు అని సాధించడం మొదలు పెట్టింది శ్రీజ.

“మీరు బుర్రతక్కువ మనుషులు. మీ అంతట మీరు తెలుసుకోరు అలాగని ఎవరైనా చెప్తే వాళ్ళతో గొడవకి దిగుతారు.

కుక్క మూతి పిందె అంటే ఒక చెట్టు లేదా పాదు ఎండిపోయే సమయం లో పూత పూసి కాపు కాస్తే ఆ కాయలు కుక్క మూతుల్లా ఉంటాయి వాటిని కరవడి కాయలు అని కూడా అంటారు. మొదటి సారి కాచిన కాయల్లా బలంగా నిగారింపుగా ఉండవు. బుడంకాయల్లా ఉంటాయి వాటిని ‘కుక్క మూతి పిందెలు’ అంటారు.

మనకి కూడా ఒక వయసు అయిపోయాక పిల్లలు పుడితే అలాగే ఉంటారు. భవాని పెళ్లి చెయ్యాలి పురుడుపొయ్యాలి. ఈ చిన్నది పెరిగి పెద్దది అయ్యేసరికి మీరు ముసలి వాళ్లు అయిపోతారు.

ఆ పిల్ల పెళ్ళి, పురుడు పుణ్యం ఎవరు చేస్తారు అది మీరు ఆలోచించుకోలేదు.” అని వివరంగా చెప్పింది అత్తగారు. అత్తగారి మాటల్లో అంతరార్థాన్ని గ్రహించిన శ్రీజ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. నాటి నుంచి కుక్క మూతి పిందె జాతీయం వాడుకలోకి వచ్చింది.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in November 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!