Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
-- కాశీ విశ్వనాథం పట్రాయుడు --
రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి

ప్రహ్లాద పురం అనే గ్రామం లో శ్రీకాంత్, అతని భార్య పల్లవి నాయనమ్మ రాజేశ్వరమ్మ తో కలసి ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. వారి ముద్దుల కొడుకు అయాన్ష్.

అయాన్ష్ కి తొమ్మిదో నెల వచ్చింది లేచి నిలబడుతున్నాడు. గోడనో, మంచాన్నో పట్టుకుని బుడి బుడి అడుగులు వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కోసారి అడుగు వెయ్యబోయి తూగిపోయి ముందుకు పడిపోతున్నాడు.

మునిమనవని విద్యలు చూసి రాజేశ్వరమ్మగారు మురిసిపోయే వారు. దూరంగా నిలబడి "విద్ది చెయ్య్, విద్ధి చెయ్య్ హాయ్ విద్ధి హాయ్ విద్ధి" అని మునిమామ్మ పాడ గానే బుడి బుడి అడుగులేసేవాడు ఆయాన్ష్. కొద్దిరోజులకు నెమ్మది నెమ్మదిగా అడుగులు వెయ్యడం మొదలు పెట్టాడు.

మునిమనవడు నడచి వస్తూ ఉంటే "రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి, రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి" అని గట్టిగా అన్నారు మునిమామ్మ గారు. ఎవరికీ ఏమీ అర్ధం కాక నిలబడి చూసారు.

అయాన్ష్ ఊగుతూ, తూగుతూ, బుడి బుడి అడుగులేస్తూ, నడుస్తూ దారిలో ఉన్న సామాన్లు తన్నుకుని బోర్లా పడిపోయాడు. ఇంకేముంది ఆరున్నొక్క రాగం తీశాడు. ముని మామ్మకి కోపం వచ్చింది. “నేను చెప్పినా మీరు అర్ధం చేసుకోలేదు” అని చివాట్లు పెట్టారు ముని మామ్మ గారు.

“రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి అంటే మాకేం అర్ధం అవుతుంది? దారిలో ఉన్న సామాన్లు తియ్యమని చెప్పవచ్చుగా... అయినా రోజూ ఏదో ఒకటి ఆయాన్ష్ కి చెప్తారు కదా అలాగే అనుకున్నాం. అందుకే మేము చూస్తూ నిలబడ్డాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాకు అర్ధమయ్యేటట్లు చెప్పండి.” అన్నారు శ్రీకాంత్, పల్లవి.

చెప్పడం ప్రారంభించారు రాజేశ్వరమ్మ గారు.

"స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు నిచ్చారు. ఖాదీ వస్త్రాలు ధరించాలని చెప్పడంతో ప్రతీ ఒక్కరూ రాట్నం మీద నూలు వడికి బట్టలు నేసేవారు. ఇది ఒక ఉద్యమంలా సాగింది. ఆ సమయంలో గాంధీ గారు వస్తున్నారని తెలిసి అందరూ రాట్నాలతో స్వాగతమిచ్చారు.

రాట్నాలు పట్టుకుని వచ్చేవారి గౌరవార్థం దారిలో ఉన్న వస్తువులు, వాహనాలను (బళ్లను) పక్కకు తీసేవారు. రాట్నం చిన్నదే అయినా దానికి ఇచ్చే గౌరవం అటువంటిది. నాటి నుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.

చిన్న పిల్లలు బుడి బుడి అడుగులేసేటప్పుడు దారిలో ఉన్న వస్తువులను పక్కకు తియ్యమని చెప్పే సందర్భంలో వాడే జాతీయం “రాట్నాలు వస్తున్నాయి బళ్ళు తియ్యండి." అని కథ ముగించింది రాజేశ్వరమ్మ.

"అబ్బా దీని వెనుక ఇంత కథ ఉందా!" అని నోరెళ్ళబెట్టారు పల్లవి శ్రీకాంత్ లు.

సందట్లో సడేమియా అన్నట్లు ఆయాన్ష్ పెరట్లోకి వెళ్ళిపోయాడు.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in September 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!