Menu Close
81. చెమట చుక్కే తేజస్సు

ఎటువంటి చరితైనా
చెమటచుక్క తేజస్సు నుంచి రాలిపడ్డదే...
ఆకలే గర్భాలయము
శ్రమే... సృష్టి చరిత్రకు జన్మనిచ్చే యోని మార్గము...
పేదరికపు మొక్క కొనకు పూసిన పువ్వు
ఈ సృష్టి పరిమళం

82. క్షమించు తల్లి

దయచేసి నను క్షమించవే తల్లి
నేను రాసిన కవిత్వం
నా భుజాలపై
శాలువై వాలింది గాని
నీ కడుపున అన్నమై జారి
ఆకలి తీర్చలేకపోయింది

సిగ్గుతో చచ్చిపోతున్నాను అమ్మ
నీ ఆకలి తీర్చని అక్షరం
నను ఉద్దరించే అతిథని
నలుగురికి చెప్పుకోలేక

అందుకే నా భుజాలపై వాలే
శాలువాలను
నడి రోడ్డుపై నిద్రను కౌగిలించుకున్న
బ్రతుకుల భుజాలపై కప్పుతాను అమ్మ

ప్రస్తుతానికి ఇంతకుమించి
ఏమి చేయలేని అల్పుడిని
అందుకు నను క్షమించు తల్లి
క్షమించు సమాజమా.

84. కూలీ చీమల బాధ

నిజమే కరోనా పురుగు ప్రపంచాన్ని తింటున్నది
అంతకన్నా నిజం ఆకలి పురుగు
కూలీలను నిలువునా కాల్చుతున్నది
అయినా శ్రమచీమల చెమటచుక్కను పిండుకొని
సరుకులెనుకేసుకుని గూడులో కూర్చుని
తమ మృగత్వం కనబడకుండా చేతులు కడుక్కుంటున్న
పాములకేమి అర్థమవుతుందిలే...
కూటికి, గూటికి దూరమై నడిరోడ్డుపైన నలిగిపోతున్న కూలీ చీమల బాధ

ఆ కూలీ చీమల కడుపులో ఎలుకలు పరుగెడుతుంటే
ఆ వేగానికి కళ్ళల్లో చెమటలు కారుతున్నాయి
ఆ గుండెలో పరుగెత్తే రైళ్ళను లాక్డౌన్ చేసేదెవరో....?

85. నగర పునాది పల్లె

పొలాల పొరల్లో పల్లెవాసుల చెమట పరిమళ నాట్లే
నాగరికత నగర నగిషీల గేట్లు

ఎక్కడెక్కడో కొండాకోనల్లోని గుడిసెల సద్దన్నపు మూటలే
ఆకాశానికి ఎగబాకిన నగరాలకు గోరుముద్దలు

నేలకొలిమిలో మండి మండి కనుమరగై పోతున్న కర్షకుల శ్రమకురుక్షేత్ర ఫలితమే నేడు కనిపించే నగరం
మట్టిలో అమృతాన్ని తీసి నగర ఆకలిరోగాన్ని తరిమే
నాగలెట్టిన నల్ల డాక్టరే రైతు

నారుమడే కదా నాగరికత గురువు
సాగుబడే కదా అభివృద్ధికి తరువు
నేలమాటు బిడ్డలు తూర్పారబడితేనే
నగరవాసు ప్రజలు జీవనం మెరుపులతో తొణికిసలాడేది

మనం చూడని పూరణమేమోగానీ
పొలమే అమృతకలశం
పల్లే కామధేనువు
రైతే కల్పవృక్షం
ఇవే సమస్త జనకోటికి జవసత్వాలనిచ్చు కాంతిపుంజాలు

పల్లే నగరానికి నడకలు నేర్పే నాన్న
ఆనంద ఆత్మీయత అభివృద్ధిని ఆశీంచే అమ్మ

పల్లె పాడుబడితే
పొలం బీడుబడితే
రైతు నేలబడితే
నగరమే కూలబడుతుంది
తస్మాత్ జాగ్రత్త …

86. కన్నీటి కంచం

కష్టానికి కొలతలుంటే బాగుండు
ఇంత లోతు ఉన్నామని తెలిసి
కాస్త తేలికపడేవాళ్ళం

వేదనను తూచే పరికరముంటే బాగుండు
ఇంత బరువుందని తెలిసి
కాస్త కుదుటపడే వాళ్ళం

గుండెనిండా వేదనముళ్ళే
ఏదో మూల చిన్న ఆశ
బ్రతుకు రోజాపువ్వైతదని
ఆశ ఆవిరవుతూనే ఉంది
పేదరికం ఆకలి బురదలో కూరుకుపోతూనే ఉంది
పరిష్కారం లేదా...?

ఎందుకు లేదు
కొన్ని మనసులు పరిష్కారం వెతుక్కున్నాయి కనుకే
ఏడు కట్ల మంచంపై హాయిగా పడుకున్నాయి

పరిష్కారం వెతుక్కోలేని మనసులే
కన్నీటి కంచంలో అలజడై ఎగిసిపడుతున్నాయి

ఇంతకీ ఆ పరిష్కారం సరైనదేనా...?

అది తప్పని ఆకలికి కూడా తెలుసు కానీ...
ఆకలి మారం చేయడం మానదే...

87. ఆ అమ్మకు పాదాభివందనం

ఆకలి అప్పుడప్పుడు నవ్వులపాలవుతుంటది
పేగుబంధం ముందు
ఇదిగో నిదర్శనం

అమ్మకు కష్టానికి జరిగే యుద్ధంలో ఎప్పుడూ అమ్మతనమే గెలుస్తుంటుంది
కష్టం ఎంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందో
అమ్మ నాకు లేదని...
అమ్మ ఉంటే ఇతరులను కష్టపెట్టే కసాయిబుద్ధి నాకు వచ్చి ఉండేది కాదని...

బ్రతుకు పద్మవ్యూహంలో
అమ్మ ఎన్ని యుద్ధాలు చేసిందో...
ఎన్ని యుద్ధాలు చేసినా
కన్నపేగును చూడగానే
పద్మంలా నవ్వడమే అమ్మ ప్రత్యేకత..

ఆ అమ్మకు సదా పాదాభివందనం

88. ఆదర్శ పుష్పమిది

పొట్టపోసుకోవడానికి
తను పడిన అనుభవాలను
పళ్ళను చేసి
బ్రతుకు పండించుకుంటున్న
ఈ పండిన పండునుచూస్తే
ఎవరి జీవితంలోనైనా
చైతన్యం పండిపోర్లుతుంది
ఆదర్శ పుష్పపరిమళ భావ అలై....

89. కదిలే పునాదది

కొనలేని స్థితి ఎనలేని చైతన్యానికి పురుడుపోసింది
దీనమైన స్థితి ధైర్యాన్ని దానంగా ఇచ్చింది

బుద్ధి చేసిన పని పేగుబంధానికి
ఊయలైంది
చేయి చేసేపని ఆకలిని మింగే అమృతమైంది

టెక్నాలజీకే కాదు...
ముష్టిగా చూసే ఈ సృష్టి సమస్తానికి
కదిలే పునాది పేదరికమే
అది కదలపోతే ఈ సృష్టే కదలదు
అందుకేనేమో...
ఆ పేదరికపు కథలన్ని కదిలిస్తుంటాయి మనసును

అందులోనే ఇదొకటి...

90. ప్రకృతి పుట్టిల్లు పేదరికం

ముందుకొచ్చిన అహంకార కొమ్ములతో
వెనకబడిన వారని వెక్కిరించే వెర్రికోతులకు
వాత పెట్టావు తల్లి

పైపై మెచ్చులతో
ముచ్చు మనసుతో
ముక్కు మూసుకోకుండా
సమజాన్ని పుచ్చుపట్టిస్తున్నా
ఆ ప్రతిభావంతులకు
అర్థం అవదులే తల్లి
పకృతికి పేదరికమే పుట్టిల్లని...

ఆ ప్రకృతిని సైతం రక్షించేది పేదరికమేనని...

... సశేషం ....

Posted in September 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!