Menu Close
ముసలి కష్టం

వేళగానీ వేళలోన మండుతున్న ఎండమధ్య
మేఘమొకటి దూసుకొచ్చే
పాడుగాలి వీయబట్టే
చిన్నగుడిసె ఊగబట్టే
గుండెగుబులు ఉరకబట్టే
చినుకులు వడి పెరగబట్టే
గుడిసెనిండా కన్నులే ఉండబట్టే
ప్రతి కన్ను ఏడ్వబట్టే
ముసలిదాని గుండె తడిసిముద్దాయే...
వణుకుడు సురువాయే
ముడతల చేతుల్లో మనవలను ఇరుపక్కల పట్టుకుని
కంటతడిని ఆపుకుని
ఎముకే బలవని పిల్లల వీపుకొట్టి ధైర్యాన్ని నింపుకుంటూ
వలససెళ్ళిన కొడుకును తలుచుకుంటూ
రేకులొదిలిన జంకునీళ్ళను ఆరుబయటకు ఎత్తుకుంటూ
తడి గుడ్డలను ఆరబెట్టుకుంటూ
తడిసిన ఎద్దులను తుడుసుకుంటూ
బురదలో కాలుతీసి కాలువేసుకుంటూ
రేపటికై ఆశకు గుండెల్లో నీరేసుకుంటూ
బ్రతుకుబండిని లాగుకుంటూ
కాలం దాటుకుంటూ కొవ్వత్తిలా 
మనమలకు వెలుగవుతూ కరిగిపోతూ అడుగులేయబట్టే ఆ ముసలి....!

కూలి తల్లి

కొండచరియ మంత్రసానై తూరుపమ్మకు పురుడుపోయగానే
దినచరియ మంత్రసానై పొయ్యిలోన నిప్పుబోసి
కుండలోన నీరుబోసి
గుండాళ్ళలో కూడుజేసి
సిన్నటిఫనులో సద్ది కట్టి
ముళ్ళుమాకులు తగలాకుండా తన సంపాదైన చెప్పులేసి
నారుమడి ఒడ్డుపైన అడుగులేసి
మోకలిలోతు బురదలోన నాటువేసి
మూతిమీద నవ్వుతోటి
నడుముమీద కొంగుతోటి
అవనిని వెక్కిరించే ఆకలి బెంగను కత్తిరించే
కష్టాల కొలిమిలో సానబెట్టబడ్డ కత్తిరూపమ్మో
ఈ కూలి తల్లి....

సమాజానికి తిండినిచ్చే కల్పవల్లమ్మో ఈ కూలీ తల్లి....
కొడవలే ఈమెకున్న కోట్ల ఆస్తిమ్మో
సద్దిగిన్నే ఈమెకున్న సంపాదనమ్మో
కలలెన్నో దారబోసి కొనుక్కున్న పాదరక్షలే ఈ కూలి తల్లికి పది ఎకరాలపొలమ్మో....

ప్రతి పొలానికి ఈమె పోలేరమ్మా...
ఈమె గుడిసెకు ఎపుడూ కరువేనమ్మా...
తనవాళ్ళకు ఎపుడూ బరువేనమ్మా
తనకు తాను గురువై..,చిరునవ్వే ఎరువై …

అవ్వలేవే...పొయ్యికాడుండే...

అవ్వలేవే...పొయ్యికాడుండే...
పత్తికట్లు ఆరకుండా చూస్తాఉండే...
పొయ్యిలోన నిప్పుబోసి నిప్పుపైన కుండపెట్టి
కుండలోన నీరుబోసి నీరులోన కడిగినా బియమేసి
ఉడకబెట్టినాను
అవ్వలేవే...పొయ్యికాడుండే...
పత్తికట్లు ఆరకుండా చూస్తాఉండే...

తూరుపమ్మ పురిటినొప్పులు పడనెలేదు
ఆ నొమ్ములో గువ్వులగొంతై వినబడనెలేదు
కోడికూత చెవులకాటికి రానెలేదు
చీకటేమో చావలేదు వెలుగేమో పుట్టలేదు
గింతపెద్దలాడనే నువ్వుయాడికెళ్తవే
కునుకునేమో చీకటికి కుదువబెట్టి ఎందుకీ గోల చేస్తావే...
పొద్దుపొడిచాక వంటొండుచ్చు పడుకోరాదా...
ఓ నా సిన్నీ...

అదిగాదె అవ్వ పొయ్యికాడ నువ్వుంటే ఉన్నబట్టలు ఉతికేస్తానే
బడిగెట్లో లేదుగనుకా నీతోపాటే కూలికొస్తానే
గా డబ్బుతో నా మెడకు దండ కొంటానే అవ్వా...
అవ్వలేవే...పొయ్యికాడుండే...
పత్తికట్లు ఆరకుండా చూస్తాఉండే...

నందీశ్వర నీకు నమస్కారం

సాళ్ళలో పంటకు
ప్రాణం పోసే ఘనత నీదే...
కాడిని మోసుకుంటూ
మేడి పట్టిన రైతన్నకు తోడునిలిచే సరైన జోడు నీవే...

బరువులు మోస్తవు
భారాలను తీస్తవు
నీ గిట్టకున్న లాలాలే నీ అభరణాలు
నీ మెడలోని గంటలే నీ వైడుర్యాలు
నెమరువేయ బడే గడ్డే నీకు పంచభక్ష పరమాన్నాలు
నీ సహనమే సమాజానికి సత్తువిచ్చు చైతన్య కొలమానాలు

ఏరువాక రాకతోటి ఏపుగా పెరిగే పంటకు ప్రాణంపోసే నిన్ను
నీరుదెచ్చి నిన్ను కడిగి
మన్నులోన అన్నమును తీసే యాగానికి కర్తైన నీకు రంగులద్ది
పూమాలతో పూజించి వేడుకుంటున్నం
మా బ్రతుకుకు వెలుగునివ్వు నందీశ్వరా...

పేగు పరిమళం

పేదరికమనే రోగం
ఆవిరైపోయింది
పేగై అల్లుకున్న ఆత్మీయతకు...

ఆకలి రోగం
ఆవిరైపోయింది
చిరునవ్వై అల్లుకున్న మమకారానికి...

పని ప్రాణం పోయింది

కడుపు బావిలో ఆకలి కప్ప పుట్టింది
దాని బెకబెకలు వర్ణణాతీతం
మెతుకు మట్టితో ఆ కప్పను చంపుదామంటే
బ్రతుకు కంచంలో పనిలేకపోయే...

కష్టజీవుల కాయం
కరోనా కరువుకు కందిపోయింది
ఎముకలను సమాజానికి ప్రదర్శిస్తూ...!
పస్తులు కడుపులో ఉంది
పని యాడుంది...?
ఏమో... కనుచూపు మేరల్లో
ఎవరి కాళ్ళు దీనచూపులతో  పట్టుకున్నను
కూలోడికి పని కనబడదాయే...!

బ్రతుకు కునుకు మరిచింది

కనిపించని గాలి చలించిపోయిందేమో
తడిపేసే వాన తడిసిపోయిందేమో
నోరు లేని గోడ ఆ గోడుచూడలేక నిర్ఘాంతపోయిందేమో
మూడు కలిసి జాలిచూపుతో...
ఆకలి మంటతో అల్లాడుతూ తాగిన నీరు తాగలేక
తలతిరిగి బలమే సొరిగి కలతకు కళ్ళనీరే కరిగి
కునుకుకై కన్నులు మూసిన కర్మదేహాలను మన్నులో కలిపాయి
శాశ్వతంగా నిద్దురపుచ్చాయి...
ఈ నిజము తెలియక చిమ్మచీకటి చిందులేసేయాళ
పాయకానకై బయటకొచ్చిన చంటోడిని ఒంటరిని చేసి...
గాలి వాన గోడ కలసి చేతులు దులుపుకున్నాయి...

చెప్పలేని బాధ
ఏమైందో అర్థమవని బాధ
మట్టి పెడ్లపై అమ్మ నాన్నని వెతుకున్న బాధ
చూసే గుండెను గుచ్చేస్తూ...
కన్నుల వర్షం కురిపిస్తూ...
చీమలదండులా మూగిన మనుషుల మధ్య
ఒంటరితనానికి ఊపిరైనా ఆ చంటోడి బాధ
గోడ కూలి కూలీన బ్రతుకులను చూసి

నేల నీళ్ళోసుకుంది

నేలే తడిచింది
కాడెద్దు కదిలింది
మెడలో గంటే మోగింది
ఘొర్రై నడిచొచ్చిన నల్లతుమ్మే పూజలందింది

కూలమ్మ దండే కదిలింది
గోసే కట్టింది
నడిమొంచి నల్లరేగడి భూమికి పచ్చదనముకు పురుడేయసాగింది

మేఘం కదిలింది
ఉరుమే ఉరిమింది మెరుపే మెరిసింది
చినుకే కురిసింది
రైతన్నల గుండెల్లో ఆశే విత్తనమై సాళ్ళకు చేరింది

మట్టే మురిసింది
పరిమళమై సాగింది
పల్లె ప్రజల మనసే...! పండిన పంటై మోములో నిలిచింది 

పేదింటి పందిరామె

పొద్దుగాలుగా లేసి
పొయ్యిలో మంటను పోసి
కడుపుకు ముద్దనీళ్ళను పోసి
చుట్ట బుట్టను తీసి
సంత దారికి నడిచి
బేరాలాటలో భారాలు మోసి
దళారీ దర్పముకు అయ్యా అయ్యానని దండాలెట్టి
బుట్టనింపుకుని సత్తువంతా ఒడిచిపట్టుకుని
వీధి వీధికి తిరిగి విసుగును విడిచి
వెన్నులో నొప్పిని లోపలదుముకుని
ఇల్లు ఇల్లు తిరిగి ఇల్లుగడుపుకుంటూ
ఊరు ఊరు తిరిగి బ్రతుకుకు ఊతమిచ్చుకుంటూ
కాళ్ళ తీపులను తీయగా దాచుకుంటూ
తీయటి నవ్వుతో పిల్లగాండ్లకు చక్కని అవ్వై..,
పెద్దవాళ్ళకు తల్లో నాలుకై
ఊరి కట్టపై ఊపిరి తీస్తూ
చేతి సంచిలో చిల్లరేసుకుని
తన చిల్లుల గుడిసే చేరి
సహన గుడ్డతో ఆకలిని తుడుచుకునే పేదింటి నవ్వుల పందిరి ఈ ముసలి

చల్లగుండూ నాన్నా...

ఉన్నచోట ఉండమంటే ఉండనని అన్నావు నాన్నా...
సరిహద్దుల్లో గన్ అయ్ దేశానికి వెన్నుదన్నుగా ఉంటానని వెళ్ళావు నాన్నా...

నువ్వు తోడులేని చింతతో చిన్నబోయేదాన్నిరా నాన్నా...
దేశానికి తోడున్నావని నాగోడు నేనే మింగాను నాన్నా...

పూట పూటకు తిండిపోక నువ్వు యాదొచ్చి యేడ్చేదాన్ని నాన్నా...
నా కొడుకు దేశాన్ని కాచే వీరుడని నన్ను నేను సదురుకునేదాన్ని నాన్నా...

నువ్వు యాడున్నా చల్లగుండాలని కనబడ్డ దేవుళ్ళకు మొక్కానురా నాన్నా...
నిన్ను ఒడుపుగా చూడమని ముడుపులెన్నో కట్టానురా నాన్నా...

యాళగాని యాళలోన పరాయి పాము కోరలతో పోరావురా నాన్నా...
పోరాడి పోరాడి అలిసావురా నాన్నా....

ఒక్కగానొక్క క్వాళ్ళీ సూత్రమే తెగిపోయేను నాన్నా...
నిను కన్నా ఈ పేగు ఒంటరై యేడుస్తున్నదని నాన్నా...

నీ పిల్లలు అయ్యాడని అడుగుతుండ్రు నాన్నా...
ఆ పిల్లలను ఓదార్చ…

... సశేషం ....

Posted in January 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!