Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మనిషి జన్మకు ఒక సార్ధకత ఉంటుంది. అలాగే మనందరికి లేక మనలో చాలామందికి సాధారణ మానవులలాగే మన ఉనికి ఉంటుంది. మనం ఈ భూమిమీదకు వచ్చింది ఒక నిర్దిష్టమైన కార్యం నిర్వర్తించడానికి అని చెబితే అది కొంచెం వేదాంతం అవుతుంది. దానిని అంత నిగూఢమైన దృష్టితో పరికించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కానీ అది వాస్తవం అనే విషయం ఒక్కో వ్యక్తికి (లింగబేధం లేకుండా) ఒక్కో జీవన స్థితిలో కలుగుతుంది.

నా జీవితంలో ఆ ఆలోచనా స్రవంతి పదిహేను సంవత్సరాల క్రితం జనించింది. అప్పటినుండి నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నో వాస్తవ కోణాలను చవిచూశాను. అప్పటినుండే ఆత్మపరిశీలనతో నన్ను నేను విశ్లేషించుకుంటూ నా ఉనికికి ఉద్దేశించిన కార్యాన్ని అన్వేషిస్తూ అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కటి మాత్రం నాకు బోధపడింది. మనుషులుగా ఇక్కడ మనం పాత్రధారులమే. మనసు పెట్టి మనం చేసే ప్రతి కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం వరకే మన పని. అంతేకానీ మనం చేసే ప్రతి పనినీ మనం సొంతం చేసుకోకూడదు. అలాగే అదే పనిని లేక జీవన సూత్రాన్ని అందరూ పాటించాలనే ఆశయంతో ఉండకూడదు. ప్రతి ఒక్కరికీ చక్కటి ఆలోచనలను సృష్టించే శక్తివంతమైన మెదడు ఉంది. అందులో ఎన్నో అద్భుతమైన సృజనాత్మక ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. కనుక ఎదుటివారి జీవితం మనకన్నా మెరుగుగానే ఉండవచ్చు. ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి అలాగే నిజంగా మన అవసరం ఉన్నవారికి సలహాలు సూచనలు ఇవ్వడం అత్యంత ఆమోదయోగ్యమైన ప్రక్రియ. సహాయం చేసేందుకు నీకు ఉండవలసిన అర్హతను, విజ్ఞానాన్ని, అనుభవాన్ని పొందేందుకు ఒక నిర్దిష్టమైన ప్రదేశం అంటూ ఏమీ ఉండదు. నీ చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా నీ ఆలోచనల పరిధి ఉండాలి. ఆ విధంగా నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషంగా ఉండేవిధంగా మార్చడం జరుగుతుంది.

సమాజంలో ఆర్థికంగా అందరి స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బీదరికం తగ్గుతూ వస్తున్నది. అయితే దానికి తీసుకుంటున్న ప్రామాణికం వలన అది పెరిగినట్టు కనపడుతున్నది. ఉదాహరణకు నాటి ఒక ఆహార పదార్ధం యొక్క ఖరీదు నేడు పదింతలు పెరిగి ఉండవచ్చు. ప్రపంచ జనాభా కూడా పెరుగుతూ వస్తున్నది. అలాగే సంపాదన కూడా ఏభై శాతం పెరిగింది. జీవన ప్రామాణికం కూడా పెరిగింది. మనిషి సుఖంగా జీవించడానికి తగిన వనరులు, సదుపాయాలు కూడా అందుతున్నాయి. ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు కూడా నిమిషాలలో చేరుకోగల సాంకేతిక వ్యవస్థ ఏర్పడింది. మరి బీదరికం ఇంకా ఎందుకు వుంది. ఎందుకంటే మనిషి జీవనశైలి ఆశాపూరితమై సుఖసౌఖ్యాలతో పాటుగా సమాజంలో కీర్తి ప్రతిష్టల కొరకు వెంపర్లాడటం ఎక్కువైంది. చిన్నప్పుడు చెప్పులు లేకుండా తిరిగాను కనుక నేను ఇప్పుడు కేవలం అత్యంత ఖరీదైన చెప్పులను మాత్రమె వాడి ఆ విధంగా నన్ను నేను సంతోష పెట్టుకుంటాను అనే వాదనలో పసలేదు. అట్లని అది తప్పేమీ కాదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగత అభీష్టం. అయితే కొంచెం సామాజిక స్పృహతో ఆలోచిస్తే ఏ విధంగా మనందరం నేటి వ్యాపార ఊబిలో ఇర్రుక్కుపోతున్నామో అర్థమౌతుంది. ఐహిక వాంఛల మోజులో మన మనసు మీద నియంత్రణ కోల్పోయి ఇతరులను నిందించడం ఎంతవరకు సబబు.

ఇక ఆర్ధిక స్థితిగతుల పరంగా చూస్తె చిన్న వయసులో ఉన్న వారు ఇళ్ళు బాడుగకు తీసుకోవడానికి లేక క్రొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే వయసు మళ్ళిన వారు లేక విశ్రాంత పెద్దవారు ఇంటి మీది అప్పును కూడా తీర్చేసి చక్కటి బ్యాంకు బాలన్స్ తో హాయిగా ఉంటున్నారు. చిన్న వాళ్లకు కొనడానికి/ఉండటానికి ఇళ్ళు లేవు రోజువారీ ఇబ్బందులతో సతమతమౌతున్నారు. పెద్దవాళ్ళు ఇబ్బందులు లేకున్ననూ మానసిక ఒడిదుడుకు ఆరోగ్య సమస్యలతో అవస్థ పడుతున్నారు. ఈ అసమానత రోజు రోజుకీ ఎక్కువౌతున్నది. ఒకప్పుడు ధనవంతులు బీదవారు అనేవారు ఇప్పుడు ఆర్ధిక సంపదల పరంగా కుర్ర వాళ్ళు, ముసలి వాళ్ళు అని అనవలసి వస్తున్నది. ఇది ఈ మధ్యకాలంలో ఒక వ్యాపార దిగ్గజం చేసిన విశ్లేషణ ఇది. చదువుతున్నప్పుడు అందులోని నిజానిజాలను పోల్చి చూసుకుంటే నాకు చక్కగా అర్థమైనది. మరి దీనికి పరిష్కారం అంటే....

పిల్లలకు వారు ఊహించంత ఆస్తిని, సంపదలను ఇచ్చితే వారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారనే అపోహల నుండి మనం బయటపడాలి. అందుకు బదులుగా పెద్దవారు ఈ భూమిమీద మనుగడ సాగిస్తున్నప్పుడే పిల్లలకు తగిన చేయూతనందించి సమాజాన్ని అర్థం చేసుకుని, స్వతంత్రంగా బతకగలమనే భరోసాని వారిలో మనం కలిగించాలి. మన ఎదుగుదలలో ఎదురైనా ఇబ్బందులు, పరిధులు, మనలోని అసమర్థత తదితర అంశాలను అన్నింటినీ నిరంతరం వారికి చెబుతూ ఒక మంచి స్నేహితులుగా మన తరం వారు మెలగాలి. అలాగే వారి ఆలోచనల ఉధృతిని, ఆశల ఒరవడిని గమనించి మన అనుభవాన్ని ఉపయోగించి వారికి దిశానిర్దేశం చేయగలగాలి. అందుకు ప్రతినిత్యం పెద్దలు, పిన్నల మధ్యన నిరంతరం మంచి అవగాహనతో తరాల అంతరాలను మరిచి మాట్లాడుకోవడం జరగాలి. మరి ఈ ప్రహసనం అంతా సజావుగా సాగాలంటే ముందుగా అందరిలో ఆసక్తితో పాటు, సామాజిక బాధ్యత, తగినంత సమయం, ఓపిక కూడా ఉండాలి. అంతేకాదు పెద్దవారు మనకు అంతా తెలుసు వారికి (పిల్లలు) ఏమీ తెలియదు అనే మిధ్య నుండి మనకు తెలియని చాలా విషయాల మీద వారికి చక్కటి పట్టు ఉన్నదనే స్ఫురణ కలగాలి. ఇది మా కుటుంబంలో నిరంతరం జరుగుతున్నందున స్వానుభవంతో ఈ మాటలను వ్రాసే ధైర్యం కలిగింది. ఇది మంచో చెడో అనే భావన నాకు ఏనాడు కలగడం లేదు. నా పనిని మంచి సంకల్పంతో చేస్తున్నాను అంతేగాని దాని ప్రామాణికతను నిర్దేశించే ఆలోచన గానీ, హక్కు గానీ నాకు లేదు. కాకుంటే ఇటువంటి ప్రక్రియ జీవితంలో మనలను ముందుకు నడిపిస్తూ బంధ అనుబంధాల నిర్దిష్ట ప్రయోజనాన్ని గుర్తుచేస్తుంది. మన ఆచరణ పద్ధతులు మన తరువాతి తరం కూడా అర్థం చేసుకునే వీలుంటుంది అని గట్టిగా నమ్ముతున్నాను.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in June 2024, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!