Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అన్ని విషయాలూ మనకు అనుగుణంగా మనం ఆలోచించే విధానంలోనే సాగుతాయని ఒక భ్రమలో మనం బతకకూడదు. అసలు మనం జీవించే విధానం మాత్రమె సరైనది అనే ప్రామాణిక ఆలోచన మనకు రాకూడదు. దైనందిన యాంత్రిక జీవన విధానంలో మనిషి కూడా ఒక పాత్రధారి మాత్రమె. మన జీవన విధానాన్ని మనకనుగుణంగా మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ అలవరుచుకున్నాము. కనుకనే తినే ఆహారపు అలవాట్ల మొదలు జీవించే సుఖసౌఖ్యాల నిర్మాణం వరకు అన్నింటా మన ఆలోచనలన్నీ మన చిన్నప్పటి విధివిధానాల ఆధారంగా ఉంటాయి. కాకుంటే మనం ప్రస్తుతం ఉన్న, ఉంటున్న సమాజ పోకడలను అర్థం చేసుకుని సమతుల్య విధానంలో మన జీవన పథాన్ని సాగించిన రోజు అంతా సవ్యంగానే ఉంటుంది. ఇక్కడ సామాజిక స్పృహ అనే అంశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఒకప్పుడు సామాజిక మాధ్యమాల ఉధృతి అంతగా లేనప్పుడు వ్యక్తిత్వ వికాసం అనేది వివిధ ప్రాంతాలను సందర్శించి, సంస్కృతులను ప్రత్యక్షంగా అనుభవించి అర్థం చేసుకున్నప్పుడు కలగడం జరిగేది. అందుకే పూర్వకాలంలో కూడా దూతలు మరియు యాత్రికులు అనేవారు వివిధ రాజ్యాలను సందర్శించి అక్కడ సామాజిక స్థితిగతులను అవగతం చేసుకొని వాటి గురించి వ్రాస్తుండేవారు. ఆ విధంగా కూడా మనకు గత చరిత్ర సంస్క్రతి, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. ఆ విధంగా వివిధ ప్రాంతాలను, రాజ్యాలను సందర్శించినందున వారికి కలిగిన సామాజిక స్పృహ ఆధారంగా వారు చెప్పిన విషయాలలో మనం మంచిని మాత్రమె ఎంచుకోవడం జరుగుతుంది.

ఎటువంటి ప్రదేశాలు సందర్శించకుండానే నేడు మనకు లభిస్తున్న సమాచారం ఎంతో వుంది. ఆ సమాచారాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మన ఆలోచనల వికాసం మరింత విస్తృతంగా విస్తరించి వుండాలి. అందుకు ఎంతో సాధన అవసరం. మన చుట్టుప్రక్కల జరిగే మంచి విషయాలు, సమాజసేవా కార్యక్రమాల మీద మరింత దృష్టిని కలిగి ఉండాలి. అంతేకానీ మాట్లాడేది ఎక్కువ, ఆచరించేది తక్కువ అనే ధోరణిలో మన ప్రవర్తన ఉండకూడదు. మనం పాటించే విధివిధానాలు మన జీవన సరళికి అనుగుణంగా ఉండి మనకు ఎంతో సంతృప్తిని అందించవచ్చు. మంకు నచ్చిన మనం మెచ్చిన జీవన ప్రామాణికం అందరూ పాటించాలి అనే ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దైనందిన జీవన ప్రక్రియలు ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహరణకు ప్రొద్దునే ఒక అరగంట ఖచ్చితంగా ఎండలో నిలబడితే ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ పాటించాలి. అక్షరాలా నిజం. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులతో, లేక ఆధునిక సుఖసౌఖ్యాలను తన కుటుంబానికి అందించాలనే తపనతో ఉన్నప్పుడు లేక అత్యవసర సేవలలో నిమగ్నమైన వారికి, ప్రొద్దునే లేచి కొలువుకు పోయి ఉద్యోగధర్మాన్ని నిర్వర్తించే వ్యక్తులకు అది ఎంత వరకు సాధ్యమౌతుంది. అలాగే భౌగోళికంగా చలి దేశాలలో సూర్యుడు ప్రతి రోజు కనపడడు కదా. మరి అటువంటప్పుడు పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. మన శరీరం అందుకు అనుగుణంగా మార్పులు చేసుకుని తయారు అవుతుంది. అదేమానవ  శరీరానికి ఉన్న గొప్ప మంచి గుణం. మనలోని జీవకణాలు తదనుగుణంగా తమ ధర్మాలను మార్చుకుని మనకు ఎంతగానో సహాయపడతాయి. మనం చేయవలసినది మాత్రం అనవసరమైన వ్యర్ధపదార్థాలతో మన కడుపును నింపి మన ఇంద్రియాల మీద విపరీతమైన వత్తిడిని కలిగించి వాటి పనిని రెట్టింపు చేసి తద్వారా వాటిని చెడిపోయే విధంగా మార్చడం చేయకూడదు. ఇది మన మెదడు మొదలు అన్ని ఇంద్రియాలకు వర్తిస్తుంది.

సాధారణంగా మనం దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు “Less Luggage More Comfortable” అనే సూత్రాన్ని పాటించడం జరుగుతుంది. అనవసరమైన బరువుని మోసుకుని తిరుగుతూ త్వరగానే అలసిపోయి, విసుగు చెంది విరామం ఎక్కువ తీసుకొనడం జరుగుతుంది. అలాగని తప్పనిసరిగా అవసరమైన వాటిని కూడా లేకుండా ప్రయాణించకూడదు. ఎందుకంటే గమ్యస్థానంలో ఆ అవసరమైన వస్తువుల కోసం వెదకడంతోనే మనకు సగం సమయం గడిచిపోతుంది. అప్పుడు ఆ ప్రయాణం యొక్క ముఖ్యోద్దేశం కుంటుపడే అవకాశం ఉంది. అలాగే, మన వాస్తవిక జీవన ప్రయాణంలో కూడా మన శరీరానికి అనవసరమైన బరువును ఆపాదించకూడదు. అంటే శరీరం యొక్క బరువును ఎక్కువా, తక్కువా కాకుండా సమతుల్యంతో ఉంచాలి. భౌతిక శరీరం అంటే మన శరీరంలోని ఇంద్రియాలకు కూడా ఎక్కువ బరువును, వత్తిడిని ఇవ్వకూడదు. అది ఆలోచనల పరంగా లేక ఆహార పరంగానూ కావచ్చు. ఆలోచనలు ఎక్కువైతే మానసిక వత్తిడి ఎక్కువై మనసు అశాంతికి లోనౌతుంది. అలాగే ఆహారం ఎక్కువైతే శరీరంలో క్రొవ్వు పేరుకునే అవకాశం ఉంది. అది మన గుండె మీద, కాలేయం మీద, మూత్రపిండాల మీదా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అట్లని అసలు ఆహారం తీసుకోకుండా మరీ బరువు తగ్గాలనే తపనతో ప్రవర్తించకూడదు. అది కూడా మంచిది కాదు. ఏదైనా సమతుల్యం పాటిస్తే అంతా సవ్యంగానే ఉండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in May 2024, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!