‘ఎంత చెట్టుకు అంత గాలి’ అనే నానుడి మనకందరికీ తెలిసిందే. దానిని మన జీవితానికి అన్వయిస్తూ విశదీకరిస్తే అందులోని నిగూఢమైన అర్థం మనకు స్ఫురిస్తుంది. మన జీవితంలో ముఖ్యంగా భావితరాలను ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న మన పిల్లలకు ఈ విషయంలో వివరణ ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉంది.
పులిగాడి కంటే గిలిగాడు శక్తిమంతుడు – మనలోని ఆలోచనా నియంత్రణ విషయంలో కలిగే హెచ్చుతగ్గుల విధానానికి ఈ నానుడి ఒక కొలమానం. మన జీవితంలో ప్రతినిత్యం ఏదో ఒక సమస్య మనలను విసిగిస్తూనే ఉంటుంది. దానికి పరిష్కారం దొరికే వరకు ఆ సమస్య తాలూకు ఆలోచనలు మనలను వీడవు. సమస్య కన్నా దాని పర్యవసానము మీదే మన దృష్టి లగ్నమౌతుంది. ఉదాహరణకు;
ప్రస్తుత పరిస్థితులలో మనందరికీ అత్యంత సుపరిచితమైన జూమ్ మీటింగ్ ల విషయానికొస్తే మనమే ఆ మీటింగ్ హోస్ట్ చేస్తున్నామనుకో ఇక అది సవ్యంగా లాంచ్ అవుతుందా అనే గిలి మొదలౌతుంది. ఆ తరువాత మనం మాట్లాడే విషయాలు అన్నీ అందరికీ అర్థమౌతున్నాయా ఎందుకంటే అది ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం లేదు కదా ఇలా ఒకటేమిటి ప్రపంచంలోని పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి. కారణం మనకు తెలియకుండానే మన బుర్రలో ఆ మీటింగ్ కు ఎక్కువ ప్రాముఖ్యత ను ఇచ్చి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాము. అదేమీ జీవన్మరణ సమస్య కాదు కదా. మనమేమి నీటిలో మునిగిపోము కదా అని కొంచెం గట్టిగానే మొట్టికాయ వేసుకుంటే మన ఆలోచనలను నియంత్రించుకుంటే అంతా ప్రశాంతం. అలాగే మన పిల్లలకు వారికి నచ్చిన కాలేజీ లో సీటు వస్తే అందరికీ ఆనందం అంతే కాని మనం మెచ్చి, మనకు (ఇతరుల కోసం) నచ్చిన కాలేజీ లోనే సీట్ రావాలని కోరుకోవడం అవివేకం. అంత నమ్మకం ఉన్నప్పుడు మరి పదులకొద్దీ కాలేజీలకు అప్లికేషన్స్ వెయ్యడం ఎందుకు? ఎందుకంటే మన నమ్మకం మీద మనకే సందేహం ఉంది.
మన అవసరాలను, మనలోని గిలిని గమనించి వాటిని తమ వ్యాపారానికి వాడుకునే అనేకమంది చేతిలోకి మనం వెళ్లిపోతున్నాము. సరైన సలహాలను అందించే వారెవ్వరూ వాటిని వ్యాపారదృష్టితో చూడరు. మనలోని భయం, తెలియనితనం, అంతా తెలుసు అనే అహంభావం ఎదుటి వారి వ్యాపారానికి ముడి సరుకులుగా మారుతున్నాయి. కష్టమైనా, నష్టమైనా, లాభామైనా, ఆనందమైన అది మీకు మాత్రమే వర్తిస్తుంది. సరైన సమయంలో సముచితమైన నిర్ణయం ప్రతి మనిషికి ఎంతో అవసరం. అయితే అది అప్పటికప్పుడు లభించేది కాదు. మన జీవితకాలంలో మనతో పాటు ప్రయాణించే ఒక ధర్మం. అందుకొరకు మనం ప్రత్యేకంగా మిగిలిన పనులను ప్రక్కన పెట్టి చేయవలసిన అవసరం లేదు. శ్రమకు తగ్గ ఫలితం ఏదో రూపంలో మనకు లభిస్తూనే ఉంటుంది. మనలోని సేవాభావం, స్వార్థరహిత విధానం మన వెన్నంటే ఉండి మనలను కాపాడుతుంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’
చిన్న వ్యాసంలో గొప్ప సందేశం.అదుపులేని ఆలోచనలే అనారోగ్యానికి కారణం.పాత్రను పరమాన్నంతో నింపండి.పనికిరాని పదార్ధాలతో కాదు.అభినందనలు మధుగారు