మనలో కలుగుచున్న ఆలోచనలను, మనం పెరిగిన, పెరుగుతున్న, జీవిస్తున్న పరిసరాలు ప్రభావితం చేస్తాయి. సమయానుకూలంగా ఆ ఆలోచనల పరిధిని అధికమించి సరికొత్త సృజనాత్మక శైలిని అలవరుచుకొన్న వారిలో ఆ ఆలోచనల విస్తీర్ణత పెరిగి మరింత ఆత్మస్థైర్యం, వారి జీవన విధానాల మీద వారికి నమ్మకం ఏర్పడేటట్టు చేస్తాయి. దానినే మనం సామాజిక స్పృహ అని ఒక కోణంలో అనవచ్చు. మనం అలవర్చుకున్న జీవన విధానాల వలన మన జీవితంలో ఎదుగుదల, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు, తద్వారా మన జీవితాలలో మనకు ఎంతో ఆత్మసంతృప్తి, సంతోషం కలిగినప్పుడు ఆ విధానాల గురించి మనం ఇతరులకు చెప్పి వారు అనుసరించేటట్లు చేయవచ్చు. అయితే మనం చెప్పే ప్రతి మాట, వ్రాసే ప్రతి పదం, మన వ్యక్తిగత అభిప్రాయం లేక ఉచిత సలహా అనే భావన ఎదుటివారికి కలుగకూడదు. కనుక వేరే వారికి సలహా ఇచ్చేముందే ఆ సలహా జనరంజకంగా ఉండేటట్లు మనం తీర్చిదిద్దాలి. అక్కడ మనల్ని మనం సగటు వ్యక్తి యొక్క జీవన విధానాలతో పోల్చుకుని, తదనుగుణంగా మార్పులు చేయవలసి ఉంటుంది. అందుకు నీలోని సామాజిక చైతన్య స్పృహ ఉపయోగపడుతుంది.
మనిషి పుట్టుకకు ఒక సార్థకత ఏర్పడాలంటే, జీవితంలోని అన్ని అంకాలను దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఒక దశను దాటి ముందుకు వస్తే మరల వెనుకకు పోవడానికి కుదరదు. బాల్యం నిజంగా ఎంతో అపురూపమైన సమయం. ఈ వేగవంతమైన జీవన పోరాటంలో ఎప్పుడూ ముందుండాలనే ఆరాటంలో మనం, మన తరువాతి తరం వారి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నాం. అదేమంటే వారి భవిష్యత్తు బంగారు బాట కావాలనే కదా మనం ఇప్పుడు బాల్యం లోనే వారిని శ్రమించేటట్లు చేస్తున్నాం అని మన చర్యలను సమర్ధిస్తూ మాట్లాడటం సహజం. అది కూడా నిజమే. కానీ కొంచెం జాగురూకతతో వ్యవహరించి అన్ని అంశాలను సమతుల్యం చేసుకుంటూ వెళ్ళిన నాడు జీవన సాఫల్యం అనేది సిద్ధిస్తుంది. గతించిన కాలాన్ని మనం తిరిగి తీసుకొని రాలేము. కానీ, మనకంటూ కొన్ని మధురానుభూతులను మిగుల్చుకుంటే అవి ఎప్పుడూ మనతోనే ఉంటూ మనలను ఉత్తేజపరుస్తూ ఉంటాయి. చెడు అనుభవాలు ఏవైనా ఉంటే అవి భవిష్యత్తును మరింత మంచిగా మలుచుకునేందుకు ఉపయోగపడతాయి.
మనలో ప్రతి ఒక్కరికీ స్వీయ అభిమానం అనేది ఉంటుంది. దానినే మనం అహం అని కూడా అనవచ్చు. అయితే మనిషి యొక్క వ్యక్తిత్వ ధర్మాలను అనుసరించి దాని శాతం మారుతూ ఉంటుంది. కాకుంటే అదే అహం మన మెదడును నియంత్రించే దశకు రాకూడదు. అది వచ్చినట్లయితే మనిషి కనీస విచక్షతను కూడా కోల్పోయి నేను, నాకు, నాది అనే భావనే మనసులో సదా నిండుకుంటుంది. కనుకనే ఆ అహం అనేది మన నియంత్రణలో ఉండాలి. అప్పుడే అనవసరమైన మానసిక సంఘర్షణలను అతి సులువుగా అధికమించి రక్తపోటును తగ్గించవచ్చు. అంతేకాదు. మనం అనుకున్నదే సరైనది అనే భావన మనలో మెండుగా ఉంటుంది. మన ఆత్మసాక్షిగా అది ఎంతవరకు నిజమో మనం బేరీజు వేసుకుని తదనుగుణంగా ఇతరులకు సలహాలు ఇవ్వాలి. అంతేకానీ తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన వాదనకు దిగకూడదు. నీ మాటలను విన్నట్టు, ఆచరించినట్టు నటించే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం వేరు, నటించడం వేరు. ఇక ఇతరులు చెప్పిన విషయాలు, సూచనలు నీ వ్యక్తిగత జీవితానికి ఎంత వరకు సరిపోతాయో నీవే అంచనా వేసుకొని తదనుగుణంగా నీ ఆలోచనా విధానాన్ని మార్చుకుని నీ జీవితంలో వెలుగులు నింపాలి.
యాంత్రిక జీవన విధానంలో కొట్టుకుపోతూ, పోటీ విధానాన్ని అలవారుచుకొని, బాధలకు కృంగిపోయి, ఆనందాలకు పొంగిపోయి, ఆధునికత అనే మూసలో ఒక ముసుగువేసుకొని మసలడం మనందరం చేస్తున్నదే. ఇది అందరం ఒప్పుకోవాలి. మన మనసాక్షిని కూడా మలినం చేసుకునే పరిస్థితిని మనమే కల్పించుకొంటున్నాము.
ఈ రోజు ఇక్కడి రేడియో లో ‘ఈ కారోనా కాలంలో అందరి జీవితాలు ఏవిధంగా మలుపు తిరుగుతున్నా’యనే అంశం లో ‘వ్యసనానికి బానిస అవడం ఎందుకు జరుగుతున్నది’ అనే ప్రశ్న మీద ఒక క్లినికల్ సైకాలజిస్ట్ మరియు ఒక పుస్తక రచయిత తో కూడిన చర్చ వినడం జరిగింది. వారి విశ్లేషణ ప్రకారం ఈ కరోనా కాలంలో ఆడువారు అంటే మహిళలు మద్యానికి బానిసలుగా మారిన శాతం ఎక్కువైంది. దానికి కారణం మగవారి కంటే ఆడవారికి మానసిక వత్తిడి ఎక్కువై దానిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా మద్యం సేవించడం అలవాటు చేసుకొన్నారట. అంతేకాదు, మగవారి నుండి సహాయం ఆశించకూడదు, మేము ఎందులోనూ తక్కువ కాదు అనే భావన కూడా ఉందట. నేటి సమాజంలో ఆడ, మగ అనే బేధాలు లేవు. అందరూ సమానమే మరియు అందరికీ కుటుంబ నిర్వహణ విషయంలో సమాన బాధ్యత ఉంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ఆలోచన రాకూడదు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు సమిష్టిగా కృషి చేస్తే ఎటువంటి పనులనైనను అవలీలగా నిర్వర్తించి, శారీరకంగా మరియు మానసికంగా కూడా దృఢంగా ఉండగలరు. వివాహమనే బంధం యొక్క సరైన నిర్వచనాన్ని ఆ కార్యక్రమంలో జరిగే తంతు యొక్క పూర్తి సారాన్ని అవగతం చేసుకుని, మనసా వాచా కర్మణా మనం ఆచరణలో ఉంచగలిగితే ఆ మహోత్తరమైన మానవ సంబంధం మనలను రక్షిస్తుంది. ఇక్కడ కూడా స్వాభిమానం, నేను అనే అహాన్ని పక్కన పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’