ఒక సిరియా కొన్ని దుఃఖ ప్రవాహాలు
- గవిడి శ్రీనివాస్
రేపటి తరం
ఎర్రని అలలు అలలుగా రాలిపోతోంది.
కొన్ని దుఃఖపు కెరటాల మధ్య
సూర్యులు అస్తమిస్తున్నారు.
ఆక్రమిత ప్రాంతవాదులు
స్థానిక రోదనవుతుంటే
రాజ్య పాలకులు
యుద్ధ మేఘాలను సృష్టిస్తుంటే
సగటు బడుగుజీవి
జీవితం ముక్కలవుతోంది.
దేశమేదైనా
హృదయాన్ని బాధిస్తున్న వ్యధ ఒక్కటే
సమయమంతా బ్రతుకు చీకట్లను
చీల్చడంలో మునిగిపోతోంది.
తగలబడుతున్న సిరియా సాక్షిగా
వొరిగి పోతున్న, నలిగి పోతున్న
కాలం సాక్షిగా
చిన్నారుల్ని, భావి వెలుగులను అడిగిచూడు
తెగని సమస్యలు
చావుని ఎత్తుకునే తలపులు
నెత్తురోడుతున్న
ఒక సిరియా కొన్ని దుఃఖాలు
అణువణువునా తల్లడిల్లుతున్నాయి.