నేను ప్రజ..నేను జన సమూహం .. నేనొక సమాజం..
ఈ ధరిత్రి సహనం నా సొంతం
ఆ విశాల ఆకాశం నా హృదయం
ఆ నీటి స్వచ్ఛదనం నా ప్రేమ (ప్రణయం)
ఆ వాయువు రూపం నా సహచర్యము (స్నేహం)
ఆ అగ్నిజ్వాల స్వభావం నా రక్షా కవచం
అధికారమదం తలకెక్కితే
ప్రశ్నించే గొంతుకను నిలదీస్తే
భూకంపమై నిన్ను కూలదోస్తా
ధనదాహంతో విర్రవీగితే
ప్రజాశ్రేయస్సు మరుగునపడేస్తే
పిడుగులా పట్టేస్తా, మెరుపులా తరిమేస్తా
ఆశ్రిత పక్షపాతం వీడకపోతే
అవినీతి అక్రమాలు ఆగక పోతే
వరదలా వచ్చేస్తా సునామీలా ముంచేస్తా
రాజకీయ కుటిలత్వం మితిమీరితే
లంచగొండితనం హద్దుమీరితే
సుడిగాలిలా చుట్టేస్తా
ప్రచండవాయువునై ప్రభంజనము (ప్రకంపనము) సృష్టిస్తా
ఆగడాలు ఆగకపోతే పదవీకాంక్ష వీడకపోతే
నిప్పురవ్వ నై మీదపడతా
కార్చిచ్చునై దహించుతా
రాజ్యాలు లేవు (కాదు) రాజులు లేరు
ప్రజాస్వామ్య పరిరక్షణే నా ధ్యేయం
సమసమాజ స్థాపనే నా లక్ష్యం
నేనొక చైతన్యం, నాదొక విప్లవం
కత్తి లేదు తుపాకీ లేదు అరుపుల్లేవు కేకల్లేవు
హెచ్చరికల్లేవు ఉద్యమాల్లేవు
ఇ (నా) దొక యుద్ధం ... నాది నిశ్శబ్దయుద్ధం
నిశ్శబ్ధయుద్ధం కవితలో ఆవేశం, కత్తిలేని విప్లవంలాగా చాలా బాగున్నదండి!!
నిశ్శబ్దయుద్దం లోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.. ప్రజ నిశ్శబ్దయుద్దం లోని ఆవేశం, నిరసన దేదీప్యమానంగా వెలిగిపోయాయి. కవిత చాలా బాగుంది.. అభినందనలు.
ధన్యవాదాలు ఉమా భారతి గారు.
చాల బాగా వ్రాశారు రావుగారు. నిశ్శబ్ద కవిత పేరు బాగుంది. ప్రజలు ప్రకృతిని గొరవిస్తే, అది వారి ఉనికిని కాపాడుతుంది. లేదంటే తిరగబడి నాశనం చేస్తుంది. అదే రాజకీయాల్లో జరగటం లేదు. ప్రజలు తమ ఓటుతో నిశ్శబ్దంగా మార్చవచ్చు. కానీ అలా ఎందుకు జరగటం లేదు! ఎవరు దానికి బాధ్యులు? కారణాలు ఏమిటి? ఆలోచించాల్సిన విషయం.
ధన్యవాదాలు సత్యం గారు.
కవిత లొ ఉన్న తీవ్ర నిరసన, ఆవేశం, బాగున్నాయ్. నిశ్శబ్దం సరైన సమయం లొ బద్దలవుతుంది. కవిత బాగుంది. అభినందనలు 💐👏👍
ధన్యవాదాలు మురళి కృష్ణ గారు.