Menu Close
నిరుపమానమైన తెలుగు భాష- అక్షర నీరాజనం
రచన, దర్శకత్వం -- మధు బుడమగుంట
telugu-bhasha-natika-2024

ఈ నాటికకు ప్రేరణ:

తెలుగు భాషను కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో పరిధిలో మరింతగా విస్తృత పరచాలనే ఆలోచనలో భాగంగా ఫోల్సోం నగరంలోని గ్రంథాలయం లో తెలుగు పుస్తకాలను కూడా చేర్చడం జరిగింది. ఆ విధాన ప్రక్రియలో భాగంగా వివిధ రచనల పోటీలతో పాటు తెలుగు భాష ప్రాశస్త్యం విశదీకరించి వివరించే రీతిలో ఒక లఘు నాటికను కూడా ప్రదర్శించడం జరిగింది. ఒక భాషాసేవకునిగా ఆ నాటిక బాధ్యతను గ్రంథాలయ కమీషనర్ శ్రీ జొన్నలగడ్డ విజయభాస్కర్ గారు నాకు అప్పగించిన నేపధ్యంలో నాలో ఉప్పొంగిన ఆలోచనలకు అక్షరరూపమే ఈ క్రింది నాటిక. ఈ నాటికను మే నెల 12 వ తేదీన ప్రదర్శించడం జరిగింది.

ముందుమాట:

ఈ నాటికలో పాత్రల ఎంపిక మొదలు వారి వ్యక్తిగత అభిమాన రచయిత గురించిన సమాచారం, వారి సామర్ధ్యానికి అనుగుణంగా ఎంపిక చేసిన తరువాత సంభాషణాత్మక పదాలను వ్రాయడం జరిగింది. అయితే నిర్మొహమాటంగా వారి పాత్ర గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఆ యా పాత్రధారులకు ఇచ్చిన స్వేచ్ఛ ను చక్కగా వినియోగించుకుని సూచనలతో పాటు తమదైన రీతిలో సరైన దారిలో నటించి నాటికను రక్తికట్టించిన పాత్రధారులందరికీ నా ప్రత్యేక కృతఙ్ఞతలు. మనందరి సమిష్టి కృషి మన నాటికను సాహితీ సంద్రంలో సముచిత స్థానంలో నిలబెట్టింది. అలాగే, ఈ నాటిక వ్రాసేటప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు అవసరం. అటువంటి సందర్భంలో సమయోచిత సలహాలను అందించడమే కాకుండా చక్కటి సమాచారాన్ని సేకరించి ఇచ్చిన మిత్రులు వెంకట్ నాగం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాటిక ప్రదర్శన దిగ్విజయంగా జరిగింది. మరోసారి పాత్రదారులందరికీ మీ కృషికి, నిబద్ధతకు నీరాజనం. మనసుపెట్టి మీరు నటించిన విధానం అత్యద్భుతం. ఇక నాటికలోకి వెళదాము.

******

పాత్రలు:

నాగం వెంకట్: తెలుగు అధ్యాపకుడు, శతాధిక పద్య కర్తల శ్రేయోభిలాషి మరియు వీరాభిమాని.

జొన్నలగడ్డ విజయభాస్కర్: జనజీవనాన్ని జాగృతి చేసే జానపదాల అభిమాని.

మందడి మనోహర్: సామాజిక స్రవంతిలో చైతన్యాన్ని నింపే సాహిత్యాభిలాషి, దాశరథి గారి వీరాభిమాని.

ఆళ్ళ శ్రీదేవి: అభ్యదయ కవితా అభిమాని, లలితగేయ అభిలాషి

యనమండ్ర నారాయణ శ్రీకాంత్: సనాతన కవుల రచనల అభిమాని. పద్య గద్య రచనల సాహిత్య పిపాసి.

బొబ్బల జితేందర్: రంగస్థల నాటక అభిలాషి, ఏకపాత్రాభినయ పిపాసి.

నామాల శివ శ్రీరామ కిషోర్: సంఘ సంస్కర్తల భాషాప్రయుక్త చదువరి. సామాజిక మార్పు అనుకరి.

రామాయణం సుదర్శన్: చలన చిత్ర గేయ రచయితల సాహిత్యాభిమాని.

ఉదయగిరి భాను దీప్తి: అభ్యుదయ భావాల విప్లవాత్మక రచనాభిలాషి, శ్రీ శ్రీ అభిమాని.

********

దర్శకుడి ముందుమాటగా, మధు బుడమగుంట వేదికమీదికి వచ్చి,

ఆమ్మ నుడి అంటే అది ఆనందహేల ఒరవడి, తెలుగు భాషా సాహిత్యం అంటే తేనెలొలుకు తన్మయత్వం.

అమెరికా అయినా, అంటార్కిటికా అయినా, అంగారక గ్రహం అయినా అమ్మ ఒడిని మించిన హాయి లేదు, అమ్మ నుడిని మించిన అమృతం లేదు. మాతృభాష ను మించిన మమకారం మరోచోట లేదు.

తెలుగు పలుకు ఒక మాధుర్యం, తెలుగు సాహిత్యం ఒక సుఖజీవన సాన్నిత్యం. మన తెలుగు వెలుగు భాష, భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను అందించే చక్కటి సునిశిత మాధ్యమం.

ఆదికవి నన్నయ్య నుండి అభ్యుదయ భావజాల కవుల వరకు అత్యంత సనాతనమైన మన మాతృభాష తెలుగు యొక్క ప్రాభవం అనిర్వచనీయం. సామాజిక జీవన శైలికి తగిన విధంగా ఎన్నో మార్పులు చేర్పులతో వివిధ రూపాంతరాలను సంతరించుకున్న మన తెలుగు, నేటికీ ఒక సజీవ జీవన స్రవంతి. వ్యావహారిక తెలుగు, జానపద మిళిత తెలుగు సౌరభాల సువాసనలు అత్యంత ఆసక్తికరం. అణువణువున మదిని పులకింపజేసే మధుర భావనల భావోద్వేగం.

అనిర్వచనీయ ఘనత కలిగిన మన మాతృభాషను గుర్తుచేసుకుంటూ, ఆశాపూరిత స్ఫూర్తితో భావితరాల మధ్యన తెలుగు భవితవ్యాన్ని పదిలంగా ఉంచాలనే భావన కూడా తోడై, తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో,

అమెరికాలో వయోజన తెలుగు బడిని వేదికగా మలిచి ఒక చక్కటి నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. మీ చప్పట్లతో ఆశీర్వదించ మనవి.

*****

నాటిక మొదలౌతుంది. తెర తీసిన వెంటనే

అధ్యాపకుడు వేదిక మీద ఒక కుర్చీ మీద కూర్చుని ఉంటారు. ఆ పిమ్మట నెమ్మదిగా విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు వస్తుంటారు. పలకరింపుల ప్రహసనం ఇలా జరుగుతుంది.

జొన్నలగడ్డ విజయభాస్కర్: ఏం టీచరూ బాగుండారా?

మందడి మనోహర్: హలో రావచ్చాండి? అయినా నీవు వద్దన్నా నేను రాకుండా ఉంటానా ఏంటి? నా దోస్త్ ఇక్కడ ఉళ్ళా?

బొబ్బల జితేందర్: హే బ్రో వ్హట్స్ అప్? ఓహ్ అయ్యోరు మీరు ఇక్కడే ఉన్నారా? గుడ్ మార్నింగ్ అయినా ఇది మధ్యాహ్నం కదూ.

యనమండ్ర నారాయణ శ్రీకాంత్: ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అహా ఆంధ్రభోజా!! హాయి ఫ్రెండ్స్ అంతా మంచిగుందా? నమస్కారం దొరా?

నామాల శివ శ్రీరామ కిషోర్: Hello Friends, Good Afternoon Teacher

రామాయణం సుదర్శన్: bhaayo aur bahano my hindi se baath khaanaa hai sabhee log login karo

ఉదయగిరి భాను దీప్తి: (YNS: రాములమ్మా! రాములమ్మా!) ఎహ్ నువ్ ఉండహే! లాల్ సలాం!

ఆళ్ళ శ్రీదేవి: ఏం అన్నా బాగుండావా? అదేంటే పుసుక్కున అంత మాట అన్నావు. ఎంతైనా నీ పెనిమిటే! నమస్కారం మాస్టారు.

ఇలా చిత్ర విచిత్ర సంభాషణలతో ప్రవేశిస్తారు. అది చూసిన అధ్యాపకుడు విచిత్రమైన హావభావంతో

నాగం వెంకట్: ఇంక అందరూ ఆసీనులైతే నేను మాట్లాడతా.

తెలుగు భాషపై మమకారంతో కొంత పట్టు సాధించి అంతటితో ఆగక, మీ భాషా పటిమను మరింతగా పెంచుకుని సాహిత్య రచనలు చేయాలనే మీ అందరి సంకల్పం గొప్పది.

ఇక మన తెలుగు గురించి చెప్పాలంటే;

  • దేశభాషల్లో గానీ, దేవభాషలో గానీ లేని ఒక విశిష్టమైన అలంకారం తెలుగు భాషకు ఉంది... అదే శ్రీ కారం.
  • తెలుగు లోని ప్రతిపదం “అచ్చుతో”(Vowel) అంతమౌతుంది. అలా అచ్చులతో అంతమయ్యే భాషలను

“అజంతా” భాష అని అంటారు. ఇలా కొద్ది భాషలు మాత్రమే అచ్చుతో అంతమౌతాయి. వాటిలో ఇటాలియన్ భాష ఒకటి. అందుకని ఇటలీ యాత్రికుడు “నికోలొ” మన భాషను “ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” గా అభివర్ణించాడు.

ఇప్పుడు,మీ భాషా పాండిత్యాని తెలుసుకునేందుకు మీ అభిమాన కవి/కవయిత్రి గురించి వ్రాయమని చెప్పాను మరి మీరు ఎంతవరకు ఆ పనిని పూర్తిచేశారో చూడాలి. అలాగే మీరు వారిపై ఎలా మీ అభిమానాన్ని చూపగలరో కూడా చూసి ఆ పిమ్మట మీ భాషా సామర్ధ్యం అనుగుణంగా మీరు సాహిత్య రచనలు చేసే స్థాయికి ఎదగడానికి నా వంతు కృషి చేస్తాను. అందుకు మీరు సిద్ధమేనా?

శ్రీకాంత్: అడుక్కో సామి. మేమే ఈడనే ఉళ్ళా?

సుదర్శన్: అంతటి మహద్భాగ్యంబు మాకు కలుగజేయుడు

*******

నాగం వెంకట్: మొదటగా జొన్నలగడ్డ విజయభాస్కర్, మీకు ఎటువంటి రచనలు అంటే ఇష్టం? మీరు అభిమానించే కవి అతని రచనలు ఏవైనా తెలుపుతారా?

జొన్నలగడ్డ విజయభాస్కర్...తప్పకుండా అయ్యవారు. పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె ప్రజల మధ్యన ఉన్న ఆ పలకరింపులు, సహజమైన ప్రేమను జానపదుల రూపంలో అందించిన నండూరి సుబ్బారావు గారు నాకు స్ఫూర్తి. ఆయన వ్రాసిన ఎంకి పాటను ఇప్పుడు లెక్కకు మీ కోసం పాడతాను.

లేపకే నా ఎంకి లేపకే నిదరా!....ఈ పాటి సుకము నే నింతవరకెరుగనే! …లేపకే నా ఎంకి ..

కలలోన నా ఎంకి ..కతలు సెపుతున్నాది..వులుకులికి పడుకొంట ..’ఊ’ కొట్టుతున్నాను! లేపకే…
కతలోని మనిసల్లె …కాసింతలో మారి…కనికట్టు పనులతో..కతనడుపుతున్నాది!..లేపకే..
రెక్కలతో పైకెగిరి…సుక్కల్లె దిగుతాది..కొత్త నవ్వుల కులుకు…కొత్తమెరుపుల తళుకు! లేపకే…
తెలివి రానీయకే…కలకరిగిపోతాది..ఒక్క నేనే నీకు…పెక్కునీవులు నాకు!
లేపకే నా ఎంకి లేపకే నిదరా!....ఈ పాటి సుకము నే నింతవరకెరుగనే! …లేపకే నా ఎంకి ..
(ఒక విధమైన సుప్తావస్థ లోకి పోయినట్లు నటిస్తారు విజయ భాస్కర్ గారు)

నాగం వెంకట్... బాగు బాగు. అన్నట్లు ఈ ఎంకి పాటల నండూరి గారి మనవరాలు శృతి నండూరి మన అమెరికా వాసే! ఆమెకు బహుశా 25 ఏండ్లు ఉంటాయేమో! ఒక డాక్టర్ అయిఉండి కూడా ఆమె తాత గారి ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంకి పాటలు, సినిమా పాటలు పాడుతూ తెలుగు వారిని అలరిస్తున్నారు.

తరువాత, మందడి మనోహర్ గారు, ఏ కవి పద్యాలు ఎల్లప్పుడూ మీలో రచనా స్ఫూర్తిని నింపుతాయి.

మందడి మనోహర్: నమస్కారం గురువుగారు
ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు నాకు సదా స్ఫూర్తి.

కత్తి కంటే కలం గొప్పది అని నిరూపిస్తూ, తన రచనా కౌశలంతో నిజాం నిరంకుశ ధోరణిని నిలదీస్తూ సామాజిక చైతన్యానికి ఊపిరిపోసిన మహా కవి దాశరథి గారు. అన్ని సాహిత్య రంగాలలో అవలీలగా రచనలు సాగించిన సాహితీ శిరోమణి ని ఎంత స్తుతించిననూ తక్కువే. ఆయన రచనా సామర్ధ్యం అనన్య సామాన్యం. ‘అగ్నిధార’, ‘మహాంద్రోదయం’, ‘రుద్రవీణ’ ఇలా ఆయన వ్రాసిన కవితాసంపుటాలు కోకొల్లలు. ఆయన రచనలలో నేను మెచ్చిన, నాలో సాహిత్య ఉత్తేజాన్ని కలిగించిన దాశరథి గారి ‘తామసి కవితా ఖండిక’ లోని పద్య పరిమళాలు మీకు ఇప్పుడు వినిపిస్తాను....

ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందు బింబాననా
ముఖముపై కస్తూరి బొట్టుపెట్టి
ఇటుదూకి అటుదూకి కుటిల నీలాలకా
భ్రకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటుసాగి అటుసాగి ఇందీవరేక్షణా
పక్ష్మభాగములపై వచ్చి వ్రాలి
ఇటువీగి అటువీగి మృగనేత్రి బంగారు
చెక్కిలిపై అగర్ చుక్క నునిచి
వెండి కొండపయిన్ మబ్బువిధము దోచి
చంద్రకేదారమున లేదిచాయ తిరిగి
ఆదిశేషునిపై విష్ణువై శయించి
చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు!!!
చీకటిని కూడా ఇంత మధురంగా వర్ణించిన మహాకవి మన దాశరథి గారు.

అలాగే, ఆయన ఎన్నో మధురమైన పాటలను మన తెలుగు చలన చిత్ర రంగానికి అందించారు. 1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి ఎనలేని సేవచేశారు. మచ్చుకి;

1964 లో విడుదల అయిన మూగ మనసులు చిత్రం నుండి మనందరికీ సుపరిచితమైన “గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది...”

ఇక చివరగా, అభ్యుదయ కవితా వాహినిలో తాత్విక దృష్టిని నింపి వ్రాసిన ఈ గేయం మీకోసం:

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||

ఇంతటి మహానుభావుని మరోసారి గుర్తుచేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు గురువు గారు.

నాగం వెంకట్: ఆహా అద్భుతం...మహాద్భుతం....చప్పట్లు...
“నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అని మహాకవి దాశరధి రాశారని మనలో చాలా మందికి తెలుసు. కానీ ఆయన రాసిన పూర్తి కవిత మాత్రం చాలామందికి తెలియదు. అప్పట్లో తెలంగాణ ప్రాంతం నుండి వెలువడే పత్రిక “సుజాత”లో ఈ కవిత రాశారాయన. ఆగస్ట్ 15, 1951 నాటి సుజాతలో ప్రచురితమైన “నా తెలంగాణ” అనే కవిత నా దగ్గరే ఎప్పుడూ ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి అది మీ అందరికీ ఇప్పుడు వినిపిస్తాను :

కోటి తెలుగుల బంగారు కొండక్రింద
పరచుకొన్నట్టి సరసులోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలుపూయు
నా తెలంగాణ తల్లి; కంజాత వల్లి
వేయిస్తంభాల గుడినుండి చేయిసాచి
ఎల్లొరా గుహ లందున పల్లవించి
శిల్పిఉలి ముక్కులో వికసించినట్టి
నా తెలంగాణ, కోటి పుణ్యాల జాణ
మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ, కోటి రత్నాల వీణ
(మనసులో..నేను అనుకున్న విధంగా ఇక్కడ లేదు. నా పని సులభం అయ్యేట్టుంది. చూద్దాం.)

ఇప్పుడు, అమ్మా శ్రీదేవి మీకు తెలుగు సాహిత్యంలో ఏ రంగంలో ఆసక్తి ఉంది. మీరు ఎవరి అభిమాని.

ఆళ్ళ శ్రీదేవి: నేను అభ్యుదయ తెలుగు భావజాలంతో, సరళమైన తెలుగు పదాలతో అనేక లలిత గీతాలను రచించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అభిమానిని గురువుగారు. వారూ మా గుంటూరు జిల్లా వాసి మరియు మా ప్రక్క ప్రాంతం పట్టాభిపురం లోనే నివసించారు.

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎన్నో కవితా ఖండికలను రచించారు. అందులోని ఒక కవితా ఖండం మనందరికీ సుపరిచితమైన ‘పుష్పవిలాపము’. సుమధుర గాయకుడు శ్రీ ఘంటసాల గారు ఎంతో లలితంగా ఆ గేయాన్నిఆలపించి తెలుగువారందరిలో ఎంతో స్ఫూర్తిని నింపారు.

ఆ గేయాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను.

“నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోట లోకి వెళ్ళాను ప్రభు”

ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది, పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి.

అప్పుడు …

నేనొక పూలమొక్క కడనిల్చి చివాలున కొమ్మ వంచి గోరానేడు నంతలోన విరులన్నియు జాలిగా నోళ్లు విప్పి

“మా ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి , క్రుంగిపోతి–
నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు
ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కర్మములలోన స్వేఛ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము ; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డువస్తావు మేం మీకేం అపకారం చేసాం

గాలిని గౌరవింతుము సుగంధము పూసి ; సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు ; మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము ; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డను వేరు సేతువే !!

ఇంతలో ఒక గులాబిబాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు…

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకటా దయలేని వారు మీ ఆడవారు….

ఇలా ఎంతో హృద్యంగా కొనసాగుతుంది ఆ కవితా స్రవంతి.

అది ఘంటసాల వారి గాత్రంతో మరింత మనసును హత్తుకునే మాధుర్యాన్ని నింపింది.

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు లలిత సుగుణ జాల తెలుగు బాల....అనే మకుటంతో రచించిన మరో కవితా ఖండిక లోని పద్యాలు మీ కోసం వినిపిస్తాను.

తెలుగుదనమువంటి తీయందనము లేదు
తెలుగు కవులవంటి ఘనులు లేరు
తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!

కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!

దేశసేవకంటె దేవతార్జన లేదు
స్సార్ధపరతకంటె చావు లేదు
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల! తెలుగుబాల

ఇలా, తెలుగు సాహిత్యంలో లలిత గేయాల ఒరవడిని సృష్టించిన ఎందఱో కవుల పరంపరలో ముందుగా నిలిచి కరుణ రసాల సాహిత్య ఒరవడిని సృష్టించి ‘కరుణశ్రీ’ గా పేరుగాంచిన పాపయ్య శాస్త్రి గారు నాకు సదా స్మరణీయులు.

నమస్కారం !!!!

నాగం వెంకట్: భేష్, బాగుందండి. చక్కటి సాహిత్యాభిరుచి. . కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయనకు స్వయానా అల్లుడు అయిన శ్రీ నాగేశ్వరరావు గారు నాకు పదవతరగతిలో తెలుగు బోధించారు. అప్పట్లో ఆయన్ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా భారత ప్రభుత్వం గుర్తించి, సత్కరించింది. నా తెలుగు ఉపాధ్యాయుడైన శ్రీ నాగేశ్వరరావు గారిని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ద్వారా నాకు గుర్తు చేసారు.

ఆ తరువాత, యనమండ్ర నారాయణ శ్రీకాంత్, మీలో సాహిత్యాభిలాషను కలిగించిన ఆ మధుర కవి ఎవరు?

యనమండ్ర నారాయణ శ్రీకాంత్....

‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’

భారతీయులందరికీ సామాజిక ధార్మిక వైదాంతిక విషయాలను బోధించిన సంస్కృతాంధ్ర కవి శ్రీ పోతనా మాత్యులు. నా ఆరాధ్యుడు.

'పలికెడిది భాగవతం అట, పలికించు విభుండు రామభద్రుండు అట....పలుకగనేల '

అని వినయంతో చెప్పి తన గ్రంధాన్ని పురుషోత్తముడైన శ్రీరామచంద్రునికి అంకితం చేసిన మహానుభావుడు నా పోతన.

'శ్రీ కైవల్య పదంబు చేరుటకునై....మహా నందంగాన డింభకున్'

అంటూ భాగవత మహాగ్రంధాన్ని రచించడం ప్రారంభించి, తనదైన శైలిలో కృష్ణ లీలలు, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర వంటి ఘట్టాలను మనకు కళ్ళకి కట్టినట్టు వర్ణించిన మహాకవి నా పోతన.

'గజేంద్ర మోక్షము లో అతను వైకుంఠాన్ని వర్ణించిన విధానం వర్ణనాతీతం 'అల వైకుంఠ పురంబు లో నగరిలో .....సంరంభి అయి'

ఎంత ఎదిగిన, ఒదిగే స్వభావం కలిగిన వ్యక్తిత్వం కి సాక్షం ఈ పద్యం: 'శారద నీరదేందు......నిన్ను మది గానగ ఎన్నడు గల్గు భారతి'

'మెరుగు చెంగట ....నా కన్నుగవకు నెదరు గానబడియె' అని శ్రీరామ చంద్రుడిని తన భక్తితో చుసిన పోతన గారు మన తెలుగు ప్రజల మదిలో చిరస్మరణీయుడు.

‘నిధి సుఖమా రాముని సేవాసన్నిధి సుఖమా’ అంటూ తర్కించుకుని ఆ భగవంతుని కొరకు ఐహిక సౌఖ్యాలను త్యజించిన మహాకవి.

ఆయన వ్రాసిన శ్రీమత్ భాగవతం లోని పద్యాలు మీకోసం....

'కమలాక్షు నర్చించు ....తండ్రి తండ్రి'
'ఎవ్వనిచే జనించు ....శరణంబు వేడెదన్'
'లోకంబులు లోకేసులు .....అతనినే సేవింతున్'

పోతానామత్యుని మరోసారి స్మరించుకునే భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదాలు గురువు గారు

నాగం వెంకట్: చాలా ఆనందంగా ఉంది. మీ గాత్రంలో చదువుల తల్లి సాక్షాత్తు ఆ సరస్వతి దేవి నాకు కనులముందు కనిపించింది. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుచేసుకోవాలి. పాడుతా తీయగా పోటీలో మొట్ట మొదటి విజేత పార్థు నేమాని గారు "పలికెద భాగవతం" పేరిట ఒక టీవీ కార్యక్రమం నిర్వహించారు. తద్వారా ఆ పోతనా మాత్యునిచే విరచింపబడిన భాగవతం పద్యాల తేనెల ధారలు ఆయన మనందరిపై చిలికించారు. ఆ మహానుభావుడు పోతన రచించిన భాగవతం ను సందర్భోచితంగా గుర్తుచేశారు. అయ్యా నారాయణ మీకు ధన్యవాదాలు.

ఇక బొబ్బల జితేందర్ మీ పరిస్థితి ఏంటి? ఏదైనా వీనులకు విందైన మరో సాహిత్య రంగం మీద నీకు అభిరుచి ఉందా?

బొబ్బల జితేందర్...చక్కటి ప్రశ్నను సంధించారు మాస్టారు.
అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకు అత్యంత చేరువై, వారికి ఆనందంతో పాటు, సామాజిక బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించేటట్లు చేసిన పౌరాణిక నాటకాలలోని ఏకపాత్రాభినయం నన్ను ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఆది కవి నన్నయ కాలం నుండి ఈ నాటివరకు ఎంతోమంది నటులు తమ నటన, అభినయం ద్వారా ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని పంచుతూ సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని సదా కాపాడుతున్నారు. దానవీర శూర కర్ణ చిత్రంలో మన అన్న ఎన్టీఆర్ చేసిన ఏకపాత్రాభినయం మనందరికీ పరిచయమే. అదే నేను ఇప్పుడు చేస్తున్నాను.

ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి?...జాతి నెపమున.......
ఈ ఏకపాత్రాభినయం ఇలా వెళుతూనే ఉంటుంది. దాని మీద నాకున్న పిచ్చి ప్రేమ అటువంటిది. కానీ ఇప్పుడు సమయం లేనందున ముగిస్తున్నాను. నమస్కారం గురువు గారు

వెంకట్ నాగం: వహ్వా వహ్వా ఏమి గాత్ర గాంభీర్యం. అద్భుతమైన ఏకపాత్రాభినయం, దాన వీర శూర కర్ణ … ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. 1977లో కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో ఈ సినిమా రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.

ఆ తరువాత, మీ పేరు శివ శ్రీరామ కిషోర్ (అనుకుంటూ మీ చేతిలో ఉన్న హాజరు పట్టీని పరికిస్తారు) చెప్పండి. మీ సాహిత్యాభిరుచి ఏ విషయం మీద ఉంది. మీ అభిమాన రచయిత ఎవరు?

నామాల శివ శ్రీరామ కిషోర్: (సభికులను చూస్తూ మీరు మాట్లాడాలి)

‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’......(ఒక 10 సెకన్లు ఆగి పిమ్మట)

సమసమాజ నిర్మాణం కోసం పరితపిస్తూ దేశ స్వాతంత్ర్యం తో పాటు వ్యావహారిక భాషాఉద్యమాన్ని తన రచనల ద్వారా నడుపుతూ, సమాజంలోని సాంఘీక దురాచారాలను రూపుమాపేందుకు వాడుక భాషలోనే రచనలను చేసిన గొప్ప సంఘసంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు నా ఆరాధ్య దేవుడు. ఆయన రచనల లోని ఒక దేశభక్తి గేయం నాకెంతో ఇష్టం. ఆ గేయాన్ని మీకోసం;

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌
పాడి పంటలు పొంగిపొరలే దారిలో
నువ్వు పాటు పడవోయ్
తిండి కలిగితే కండకలదోయ్
కండకలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ !!!

సమాజంలో మానవత్వాన్ని మేలుకొలిపి వాడుక భాషను మరింతగా ప్రోత్సహించిన గురజాడ నాకు ఇష్టమైన కవి గురువుగారు.

వెంకట్ నాగం: సంతోషం. మీలో మంచి భాషా వితరణ శైలి కనపడుతున్నది. తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి: డామిట్! కథ అడ్డంగా తిరిగింది: పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌ - కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు రాసిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

ఇప్పడు, మీరు ఒక మంచి గేయరచయిత గురించి చెప్పగలరా రామాయణం సుదర్శన్ గారు. అప్పుడు తెలుగు భాష విస్తరించిన అన్ని రంగాలు మనకు గోచరిస్తాయి.

రామాయణం సుదర్శన్: తప్పకుండా గురువు గారు.

  1. ‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’ అంటూ నేటి జీవనశైలిలో ఒక్క వాక్యంతో స్ఫూర్తిని నింపినా,
  2. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం’ అంటూ ఓంకారాన్ని అద్భుతంగా వర్ణించిననూ,
  3. ‘ఆది భిక్షువు వాడి నేమి కోరేది, బూడిదిచ్చే వాడినేమి అడిగేది’ అని ఆ బోళా శంకరుడిని ప్రస్తుతించినా

ఆయనకు ఆయనే సాటి. ఆయనే ‘సిరివెన్నెల’ ను ఇంటిపేరుగా చేసుకొన్న శ్రీ సీతారామ శాస్త్రి గారు నా అభిమాన గేయ రచయిత. ఆయన పాటలన్నీ నాకు ఎంతో ప్రియమైనవి. ఆయన రచించిన గేయాలలో సజీవ భావజాల సాహిత్యం ఎల్లప్పుడూ గోచరిస్తుంది. 1992 లో విడుదల అయిన ‘పట్టుదల’ అనే చిత్రంలో ఆయన వ్రాసిన, నాకెంతో ఇష్టమైన పాట మీ కోసం వినిపిస్తాను.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి....పాట రెండు చరణాలు

ఆశావహ దృక్పథం తో తన ఉనికి కోసం మనిషి నిత్యం శ్రమిస్తూనే ఉండాలి అదే అందరి జీవితాలలో వెలుగును నింపుతుంది అని చెప్పిన ఈ పాట నాలో సదా స్ఫూర్తిని నింపుతుంది.

ధన్యవాదాలు.

వెంకట్ నాగం: ఆహా! ఎంతటి భావుకత. సిరివెన్నెల గారిని ఆ దివి నుండి ఈ భువికి మరోసారి రప్పించారు. మీకు ధన్యవాదాలు. ఇక చివరగా మిగిలిన ఆ ఒక్క రంగం గురించి, అక్కడికే వస్తున్నా ! అమ్మా దీప్తి నీకు అభ్యుదయ విప్లవ కవుల రచనల గురించి ఏమైనా అవగాహన ఉందా?

ఉదయగిరి భాను దీప్తి: ఉందండి. నేటి సమాజంలో నారీ పాత్ర మొదలు సమ సమాజంలో వస్తున్న ఎన్నో విప్లవాత్మక విషయాలను అర్థం చేసుకొని ఒక మహిళగా అభ్యుదయ కవితా పఠనం వైపు ఆసక్తి కలిగిన నాకు,

‘పదండి ముందుకు పదండి త్రోసుకు’ అంటూ రాస్తున్న యుగం తనదని రాబోవు జగం మీదని, పోరాటం మీ చిరునామా అని శ్రమజీవన అవసరం అంటూ,'ఏ దేశ చరిత్ర చుసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం' అంటూ నేటి ప్రపంచ పరిస్థితిని నిర్మొహమాటంగా నిలదీస్తూ, ‘తాను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం’ అని చెబుతూ ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను…….మ్రోశాను ’

అని ధైర్యంగా సమాజాన్ని తన కలంతో నిలదీసిన అభ్యుదయ నిరాడంబర సాహిత్య పండితుడు, అందరికీ ‘శ్రీ శ్రీ’ గ సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాస రావు గారంటే నాకు వల్లమాలిన అభిమానం. ఆయన వ్రాసిన ప్రతి సాహిత్య రచన ఒక యుద్ధభేరి మోగించే శంఖారావం. నవయుగం కవితకు శ్రీకారం చుట్టిన విప్లవ కవి శ్రీశ్రీ. అతను రచించిన ఉత్తమ గ్రంధం మహా ప్రస్థానం.

భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా అని వాగ్దానం చేసి సామజిక రుగ్మతలపై సమరభేరి మ్రోగించి విప్లవీకరించిన అక్షర లక్షల రాత శ్రీశ్రీ గారి మహాప్రస్థానం. ఆయన రచనలలో నాకిష్టమైన రెండు కవితలను మీకు వినిపిస్తాను.

  1. మరో ప్రపంచం ....రా రండి
  2. కుక్క పిల్ల, అగ్గి పుల్ల.......కాదేది కవితకు అనర్హం.
  3. పోతే పోనీ ...శాపాల్ రాని !
    శ్రీ శ్రీ గారు అభ్యుదయ వచన కవిత్వంతో పాటు సినీ గేయ రచయిత గా కూడా పేరు సంపాదించారు. ఆకలిరాజ్యం చిత్రంలో నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపుతూ, సమాజంలో యువత పడుతున్న ఇబ్బందులను ఎంతో హృద్యంగా తన గేయంలో స్పృశించారు. ఆయన వ్రాసిన 'కూటికోసం కూలికోసం..................ఎంత కష్టం' పాటను మీ కోసం వినిపిస్తాను.

చివరగా ‘నువ్వు నడిచే దారిలో కనపడిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్తూ పోతే ఎప్పటికీ గమ్యం చేరలేవు’ అంటూ ‘ఏ పని చేసిన దృఢనిశ్చయంతో, మనోబలంతో ముందుకు సాగమని’

శ్రీశ్రీ తన కలంద్వారా జాలువారే అక్షరమాలతో అందరిలోనూ చైతన్యాన్ని నింపారు.

స్వస్తి. నమస్కారం.

వెంకట్ నాగం: "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" అని శ్రీ శ్రీ గూర్చి మరో కవి అన్నారు . మన జాతీయ భాష గా హిందీ కంటే తెలుగు అయితేనే బాగుంటుంది శ్రీ శ్రీ అభిమతం. తెలుగు భాషలో సంస్కృత పదాలు ఉన్న కారణంచేత అటు ఉత్తరాది వారు, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది వారికీ కూడా తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని శ్రీ శ్రీ వాదన. పైగా తెలుగువారు దేశమంతటా, అన్ని రాష్ట్రాలలోనూ వ్యాపించి ఉన్నారు అని ఆయన చెప్పారు.

అటువంటి మహాకవి శ్రీ శ్రీ కవితలను ఏరి కూర్చి దీప్తి గారు చక్కాగా మనకు చదివి వినిపించారు. ధన్యవాదాలు దీప్తి గారు.

******

అందరి సమాధానాలను సాహిత్య ఒరవడిలో వినిపించిన తరువాత అధ్యాపకుల వారు భావోద్వేగంతో

నాగం వెంకట్... మీ అందరిలో ఇంతటి సాహిత్య అభిలాషను చూసి, వినిన తరువాత నాకు ఎంతో ఆనందం కలుగుతున్నది. ఒక అధ్యాపకునిగా తప్పక మీకందరికీ మన తెలుగు సాహిత్యంలోని మెళుకువలు, ధర్మాలను, రచనా శైలిని నేర్పిస్తాను.

అయితే ఇప్పుడు నాకు నచ్చిన, నేను మెచ్చిన, నన్ను సన్మార్గంలో నడిపించిన శతకాల గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలనే భావన నాకు కలుగుతున్నది.

మన సాహిత్య శతకాలు ఎన్నో సన్మార్గ నీతి సూత్రాలను బోధిస్తూ సరైన జీవన మార్గాన్ని ఎంచుకునే విధంగా మనకు దిశానిర్దేశం చేస్తాయి.

నేను ఇప్పుడు శతక సాహిత్యానికి ఆద్యుడైన శ్రీ బద్దెన కవి వ్రాసిన సుమతి శతకంలోని పద్యం ఒకటి వినిపిస్తాను.

ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ!!!

భావం: ఈ భూమి పైన పచ్చికాయలు ఏరి తినకుము, బంధువులను ధూషింపకుము, యుధ్ధమునుండి వెనుదిరిగి పారిపోకుము, పెద్దల మాటను జవదాటకుము.

నాటి, నేటి సామాజిక స్థితిగతులకు ఈ శతక సాహిత్యాలు చక్కటి ప్రతిబింబాలు, మార్గదర్శకాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇక ముక్తాయింపుగా :

తెలుగు నేలపై జన్మించి, సాహిత్య పిపాసినై
తెలుగు భాషామతల్లి సేవలో తరిస్తూ
నేడు ఒక తెలుగు అధ్యాపకునిగా
ఇంతటి వైభోవోపేత వాతావరణం చూసి
ఆనందంతో తన్మయత్వం చెందుతూ గర్వపడుతున్నాను.

చివరగా, మీరందరూ కూడా తెలుగు ప్రాభవాన్ని ఇనుమడించే ఒక మంచి వాక్యాన్ని తెలుపవలసింది గా నేను హ్రదయపూర్వకంగా కోరుతున్నాను.

అధ్యాపకుల వారి భావోద్వేగానికి పులకించిపోయి విద్యార్థులు కూడా ఒక విధమైన తన్మయత్వంతో అధ్యాపకుల వారి మాటను గౌరవించి ఒకరి తరువాత ఒకరు క్రింది వాక్యాలను ప్రేక్షకులను చూస్తూ చెబుతారు.

జొన్నలగడ్డ విజయభాస్కర్: తెలుగు భాష పండితులకి, పామరులకి కూడా ఇష్టమైన భాష!

మందడి మనోహర్: మనసెరిగిన మన భాష, మన మెరిగిన జన భాష, మనకు జన్మనిచ్చిన భాష, మన తెలుగు భాష ఆళ్ళ శ్రీదేవి:

  • జనని సంస్కృతంబు సకల భాషలకును
  • దేశభాషలందు తెలుగు లెస్స
  • జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
  • మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
  • తెలుగు పలుకు తేనెలొలుకు

యనమండ్ర నారాయణ శ్రీకాంత్: మాతృత్వ మాధుర్యంతో అలరారే జీవ చైతన్య భాష తెలుగు!

బొబ్బల జితేందర్: నాటి, నేటి, రేపటి సాహితీ ప్రక్రియల సంధానకర్తలం. సామాజిక భాషాసేవ కార్యకర్తలం.

నామాల కిషోర్: అమ్మ నుడి, అన్నివేళలా ఆనందాన్ని పంచే ఒక భావసిరి.

రామాయణం సుదర్శన్: మన తెలుగువారందరికీ ముఖ్యంగా భావితరాలకు బహుచక్కనైన అమ్మనుడి మాధుర్యాన్ని అందించి, ఆదరింపచేద్దాం.

ఉదయగిరి భాను దీప్తి: అజరామరమైన మన తెలుగు, అమృతం ఓలే నిత్యం స్రవించే ఒక తీయని జీవధార.

మధు బుడమగుంట:

  • మన తెలుగును నిత్యం పఠిస్తూ అక్షరమాలతో ఆరాదిద్దాం.
  • అందరం తెలుగులోనే మాట్లాడుకుందాం. మాతృభాష లో ముచ్చడించుకుంటూ ముందుకు సాగుదాం.

అందరూ: జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి

సమాప్తం......

Posted in August 2024, నాటికలు

8 Comments

  1. GSS Kalyani

    మధు గారు, నమస్కారం. ముందుగా, “సిరిమల్లె” పత్రిక 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు!

    “నిరుపమానమైన తెలుగు భాష – అక్షర నీరాజనం” నాటిక అద్భుతంగా ఉంది! పాత్రల సంభాషణ మన తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని నేటి తరానికి తెలియపరిచే విధంగా ఉంది. మన తెలుగు భాషలో ఉన్నన్ని మాండలికాలు మరే ఇతర భాషలలోనూ లేవేమో! వాటిని ఈ నాటికలో చక్కగా ఉపయోగించి నాటికను ఆసక్తికరంగా మలిచారు. తద్వారా సాహిత్యాభిమానులతోపాటూ ఇతరులకు కూడా నాటిక తేలికగా అర్థమయ్యి, అందరూ నాటికను ఆద్యంతం ఆస్వాదించేలా చేశారు. ఈ నాటిక వెనుక మీరు చేసిన కృషి అభినందనీయం. పాత్రధారులకు సంభాషణ విషయంలో స్వేచ్ఛనివ్వడం అనేది అంత సులువైన పని కాదని నా అభిప్రాయం. అయితే నాటికలో పాత్రలను పోషించినవారంతా తెలుగు సాహిత్యంపై అవగాహన కలిగినవారు, తెలుగు భాషకు తమకు తోచిన రీతిలో సేవ చెయ్యదలచినవారు కావడంవల్ల కాబోలు నాటిక యొక్క ప్రధాన లక్ష్యం నెరవేరే విధంగా వారంతా అద్భుతంగా నటించగలిగారు. ఈ నాటికను నేను ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ పాత్రల సంభాషణలను పూర్తిగా ప్రచురించడంవలన నాటికను చదువుతున్నంతసేపూ చూస్తున్నట్లే అనిపించింది. ఇంత చక్కటి నాటికను రూపొందించిన మీకూ, మరియు నాటికలో పాలుపంచుకున్న పాత్రధారులకూ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలూ తెలియజేసుకుంటున్నాను💐🙏

    • Sirimalle

      కల్యాణి గారు, మీ విశ్లేషనాత్మక అభినందనలకు మనఃపూర్వక కృతజ్ఞతలు. చాలా బాగా అక్షరాలను ఒలికించారు. -మధు

  2. భక్తవత్సలం

    మధు గారికి రచనా పద సమ్మేళనానికి మరియు అద్భుతమైన ఆలోచనా విధానానినికి తెలుగు భాషకు ఉన్నత కీర్తి తీసుకురావాలని ఉన్న ఆశయానికి నమస్సుమాంజలి 🙏🙏

    • Sirimalle

      భక్తవత్సలం గారు, మీ ప్రోత్సాహక వాక్యాలకు మనఃపూర్వక ధన్యవాదాలు -మధు

  3. గరిమెళ్ల వెంకట లక్ష్మి నరసింహం

    నాటిక చదివేను. మధు బుడమగంటి వారి రచన అద్వితీయం.

  4. కిరణ్ కుమార్ నామాల

    తెలుగు పై మక్కువ కల్గిన భాషాభిమానులకి వందనం అభివందనం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!