
నిజాయితీని ప్రదర్శిస్తే
నటన అనే వస్త్రాన్ని విడిచి
నిజాయితీని నగ్నంగా ప్రదర్శిస్తే?
అవసరానికి ఆదుకొనే అబద్ధాలను విడిచి
నిబద్ధాల నిజాలలోకి ప్రవేశిస్తే?
మనసు యొక్క పరువును
నిజం యొక్క బరువును
ఆరుబయట పందిట్లో
నలుగురి సందిట్లో పెడితే?
జగమంతా జగడాలమయమైపోదూ!
వ్యవహారాలు, వ్యాపారాలు అయోమయమై ఆగిపోవూ!
అనుబంధాలు,ఆప్యాయతలు ఇంకిపోవూ!
నిర్లక్ష్యాలు, అలక్ష్యాలు రంకెలేయవూ!
ప్రకృతి తన సహజమైన ఆకృతిని కోల్పోయి
మానవుని వికృతికి పట్టం కట్టినట్లు అగుపించదూ!
మతులు తమ గతులను విడిచి
మమతలు తమ సమతలను
తుడిచిపెట్టినట్లు అనిపించదూ!