
ఆక్రోశాలు మిన్నంటిన చోట
ఆలోచనలు విరమించిన చోట
దాడులు నిత్య కృత్యాలవుతున్నాయి.
మనిషిని మనిషిగా చూడాల్సిన చోట
మారణకాండలు విలయతాండవం చేస్తున్నాయి.
దేవుడా నువ్వేమైనా చేయ్
శాంతి బీజం మొలకెత్తేలా
నీరు పొయ్.
కక్షలు సమస్యకి పరిష్కారం కావు
కర్మ సిద్ధాంతం వెన్నంటి ఉంటుంది.
ప్రజా గొంతుక ఏడుస్తోంది
అమాయక ప్రాణాలు విలపిస్తున్నాయి.
వరాల వెలుగు కోసం
కోట్ల కళ్ళు దిక్కులు చూస్తున్నాయి.
నువ్వు క్రూల దోస్తావ్
రేపు వాళ్ళు పునః నిర్మాణం చేస్తారా?
ఇక్కడ ప్రజల కోసం
నిర్మాణాలు జరగాలి
విధ్వంసాలు కాదు.
విదుర నీతి పాఠాలు వినిపించటం కాదు
నిజ ధర్మ ఆచరణ చూపించాలి.
నెత్తురోడుతున్న నేల మీద
శిశుపాలుని పాపాలు పండే కాలానికి
రావణ కాష్టం రాక్షస రాజ్యం
నిద్దుర లేకుండా మనిషిని బాధిస్తోంది.
ప్రేమ కు తలలు వంచిన చోట
విద్యుక్త ధర్మం పరిఢవిల్లిన చోట
ఆనందాలు అనుమతులు తీసుకోకుండా
విరాజిల్లుతాయి.
సంక్షేమం, అభివృద్ధి మీద
లయకారులవుదాం.
మరో తరానికి
ఆదర్శ పాఠాలు గా
ఒకరికొకరు చేయూత అవుదాం....!