నేను కవినా? ఎందుకలా పిలుస్తావ్?
ఏదో శ్లేష మెలిపెట్టినట్లున్నావ్!!
నేస్తమా! క ఖ గ ఘ లు తప్ప కందం, గ్రంథo గుర్తు లేదు.
ఛందస్సు అంటే చందనం పూసిన ఉషస్సు అనుకొంటాను.
ఉత్పలమాల అంటే భ, ర, న, భ, భ, ర, వ లకు బదులు
బడుగుజీవుల బతుకునాడి తగిలి బాధిస్తుంది.
అంత్యప్రాసల ఆనవాళ్ళను ఆద్యంతం పరికించలేను
చూడబోతే అనంతమైన విశ్వం గోచరిస్తోంది.
ఆటవెలది లోని అక్షరక్రమాల ఆకృతిని అభినందిద్దామంటే
ఆటపాటల ఆరోగ్యసూత్రం తప్ప
యతి స్థానాలు ఎఱుక పడవు
యతి అనగానే చేతులు భక్తితో పైకి లేస్తాయి.
పై ఎత్తులోనే యతిస్థలం నిలవాలన్న భావం, ఆటవెలదుల్లో వెదుకనీయదు.
సంధులు అంటే జీవనసంధులు గుర్తొస్తాయి..
హ్రస్వ, దీర్ఘాల, పూర్వ, ఉత్తర పదాల సందర్భ స్పృహతొంగిచూడదు..
యుద్ధ కాముక దేశాల్లో సంధి కుదిరిస్తే ఎంత బాగుంటుందన్న పేరాశ!
విశ్వమానవాళి సుఖ సంతోషాలపై అనంత ఆశ!
వైరి సమాస వైఖరుల వైపు కనుచూపు తిరుగనివ్వదు
సఖ్యతా భావం కవిత్వమైతే నేను కవినే..
కాదంటే సెలయేటి అలలమీద స్వేచ్ఛగా రెక్కల్లారుపుకొనే కవినే!
(*కవి అంటే రెండు అర్థాలు.. కవిత్వం రాసేవాడు, నీటికొంగ)
Posted in January 2019, కవితలు
మిమ్మల్ని కవి అని ఎవరన్నారు?మీరు కళారవి కదూ!