అరవై దాటినాక
అహం తగ్గినాక
విశ్రాంతి దొరికినాక
ప్రశాంతతకై వెతికినాక
ఇంటిలో నేను
ఇల్లాలు తను
ఇల్లంతా నిశ్శబ్దం
ఒళ్లంతా ప్రారబ్దం
ఒకటే ఆలోచన
లోలో ఏదో తపన
నేనెవరు! ఈ మేను ఎవరు!?
పూరి గుడిసె నుండి డాబా లోనికి
డాబా నుండి పెద్ద మేడలోనికి
పెద్ద మేడల నుండి ఫామ్ హౌస్ లోకి
ప్రస్తుతం నాలుగు గోడల కౌగిట్లోకి
నడక నుండి సైకిల్ కి
సైకిల్ నుండి స్కూటరుకి
స్కూటర్ నుండి కారులోకి
ప్రస్తుతం నడవలేక
నడుస్తూ చీకటి గదిలోకి
కిటికీ సంకెళ్ల సందులో నుండి
సన్నని సూర్యకిరణాల డోలిక నుండి
ప్రకృతి నవ్వుతూ నన్ను అడిగింది
మిత్రమా నీవెవరని?
నేను పైకి చూసి నేను నేనే అన్నాను
రాష్ట్రాలు తిరిగాను దేశాలు తిరిగాను
ఖండాలు తిరిగాను ఆకాశవీధిలో ఎగిరాను
ప్రస్తుతం నిస్సారంగా పడకగది నుండి
వంటగదికి పయనిస్తున్నాను
నేను అనేక సమాజాలు చూశాను
అనేక సంస్కృతులు చూశాను
నేడు ప్రస్తుతం వయసు పెరిగి
అనారోగ్యంతో బంధించబడ్డాను
ప్రకృతి నను చూసి మళ్లీ అడిగింది
ప్రియ మిత్రమా నీవు ఎవరు?
మళ్లీ నేను నేను నేనే అన్నాను
నేను ధనవంతుడున్నాను ప్రయాణికుడను
గొప్ప వాడిని అన్నాను ఉన్నవాడినన్నాను
పేరు ప్రతిష్ట గల వాడినన్నాను
గుర్తింపు పొందిన వాడినన్నాను
అయినా ప్రకృతి సంతృప్తి పడక
మిత్రమా నీవెవరు అని అడిగింది
ఒకప్పుడు పుట్టినరోజులు పెళ్లిరోజులు
విందు వినోదాలు గొప్పగా చేసుకున్నాను
కానీ నేడు ఆకలి లేక నిద్ర రాకకై ఎదురుచూస్తున్నాను
వెండి బంగారం రత్నాలు వైడూర్యాలు
నా లాకరులలో హాయిగా నిద్రిస్తున్నాయి
బీరువా నిండా షూట్లు బూట్లు
చుట్టూరా ఉన్న అలమారాలలో
రంగురంగుల బట్టలు కుప్పలుగా
మురిసి మురుగుతున్నాయి
కానీ నేడు నా ఒంటిపై
ఒక నేత వస్త్రమే వేలాడుతుంది
ఆ సంపదలేమి నాకు తృప్తినివ్వలేదు
నేనప్పుడు ఇంగ్లీషు హిందీ ఫ్రెంచ్ జర్మన్ భాషలు
మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు నా మాతృ భాషయే
నాకు సౌకర్యంగా మధురంగా ఉంది
అప్పుడు విశ్రాంతి లేక తిండి తినే తీరిక లేక
పని రాక్షసుడులాగా పని చేశాను
అప్పుడు వ్యాపార లాభనష్టాలను
ఇప్పుడు జీవిత లాభనష్టాలను
లెక్కించుకుంటున్నాను
అప్పుడు రాళ్లు తిన్నా అరిగేవి
ఇప్పుడు అటుకులు తిన్నా అరగడం లేదు
అప్పుడు ఎందరో గొప్పవాళ్లు
నా చుట్టూ తిరిగేవారు పొగిడేవారు
ఇప్పుడు నన్ను ఎవరు నా వంక చూడడం లేదు
నేను ఒంటరిగా కిటికీ గుండా బయట
ఎవరైనా కనిపిస్తారేమోనని నిక్కి నిక్కి చూస్తున్నాను
ఎవరూ కనిపించడం లేదు
బయట దూరంగా వాహనాల రొద
పిల్లలు ఎక్కడో ఉన్నారు వినిపించనంత
దూరంగా నా సొద
నేను జీవితంలో ఏం పోగొట్టుకున్నాను
మనిషిగా ఇతరులతో ఎలా ప్రవర్తించాను
ఎవరికి మానవత చూపలేక పోయాను
నాడు నాదే వేదం నాదే వాదం
నాదే లోకం నాదే అహం
నాదే మాట నాదే కోట
అలా అలా సాగిన నా మానవ సామ్రాజ్యం
నేడు విధి చేతిలో పొందింది పరాజయం
ఎత్తు పల్లాల జీవితాన్ని ఒక్క క్షణం
గుర్తుకు తెచ్చుకుంటున్నాను
నాలో నేను గొనుక్కుంటున్నాను
ఒక్క క్షణం ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు
ఇది జీవిత నాటకంలో ఇది చివరి అంకం
ప్రతి జీవి తప్పించుకోలేనటువంటి సుంకం
చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను
ఎన్ని సంపదలు ఎన్ని ఆకర్షణలు
ఎన్ని అనుబంధాలు ఎన్ని ధనబంధాలు
అలా ఆలోచిస్తున్నాను
ప్రకృతి నవ్వుతూ మళ్లీ అడిగింది
ఓ ప్రియమిత్రుడా ఎవరు నీవు అని?
ఒకసారి కళ్ళు మూసుకొని
హృదయం తెరుచుకొని
ఒక్కసారి ఆలోచించాను
నిక్కమేమిటో తెలుసుకున్నాను
గద్గర స్వరంతో అన్నాను
నా పంచప్రాణాలు
నీ పంచభూతాలే
ఓ ప్రకృతి ఓ నా జాగృతి
నేను ..నేనే కాదు
నేను నీవే ..నీవే నేను
అంటూ ఆకాశం వైపు చూశాను
మెల్లగా కృతజ్ఞతతో నేల తల్లిని
తడిమి ముద్దాడాను
మళ్లీ ఇలా అన్నాను.. క్షమించు మాత
మరొక్క అవకాశం ఇవ్వలేవా!
మరొక్క సదవకాశాన్ని జీవితానికి ఇవ్వలేవా
ధనం సంపాదించే యంత్రంలా కాకుండా
ఓ నిజమైన మానవత్వం ఉన్న మనిషిగా
కొంతకాలం బ్రతకడానికి
విలువలతో సాటివారిపై ప్రేమతో
ఆర్తులకు సహాయం కోసం
కుటుంబం ప్రేమ కోసం
ప్రజల కోసం జీవించడానికి
మరొక అవకాశం ఇవ్వలేవా!?
అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాను
ఆ కన్నీళ్ళతో ప్రకృతి మాత
పాదాలు పూర్తిగా తడిచిపోయాయి
ప్రకృతి మాత చల్లని గాలితో
నా తలను ప్రేమతో నిమిరింది
నేను సుదీర్ఘ నిద్రలోనికి జారిపోతున్నాను.🙏
సర్వేజనా సుఖినోభవంతు