ప్రేమకు భాష ఉండదు. ప్రేమను మాటలతోనే కాదు మనసుతో కూడా మరింతగా ముఖంలో ప్రస్ఫుటించే విధంగా ప్రకటించవచ్చు. సామాజిక స్థితిగతుల నియంత్రణ వలన మనసులోని భావాలు ప్రేమికుల మధ్యన మూగబోయిన తరుణంలో కూడా ఆ ప్రేమలోని స్వచ్ఛతను పాట రూపంలో ఎంతో హృద్యంగా రామజోగయ్య శాస్త్రి చూపించారు. ఆ పాటకు ప్రకాష్ కుమార్ గారి స్వరకల్పన తోడై హరిచరణ్, చిత్ర గారి గాత్ర మాధుర్యంతో మరింత వన్నె తెచ్చింది. ఆ పాటను మీకోసం ఈ మే నెల సంచికలో అందిస్తున్నాము.
నీ చూపులే నా ఊపిరి
ఓ సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా
రోజూ కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయింది ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా
నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో
నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరి
ఓ సారి ఇలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా