Menu Close
Kadambam Page Title
నవ్వుతూ వెళ్లిపోవాలి
-- సాంబమూర్తి లండ

నవ్వుకోవాలనే ఉంటుంది
పొద్దుపొద్దున్నే విచ్చుకునే
వేకువ రేకుల్లా
విచ్చుకోవాలనే ఉంటుంది
పసిపాపగా ఉన్నప్పుడే
విధి మా నుదుటిమీద
నల్లబొట్టుకు బదులు
ఆకలిబొట్టు పెట్టిందేమో
మా బతుకుపొలంలో
ఏడాదంతా నవ్వుల అనావృష్టే!

నవ్వుకోవాలనే ఉంటుంది
పంటి బిగువున అదిమిపెట్టుకున్న దుఃఖమే
ఒక్క నవ్వు తునకగానైనా
తుళ్ళిపోనివ్వదు
ప్రతిరోజూ నవ్వుల పావురాల్లా
ఎగరాలనే ఉంటుంది
పేదరికపు సంకెళ్ళుపడ్డ రెక్కలే
పంజరాన్ని దాటిపోనివ్వవు
విత్తుకోవడానికి
గుప్పెడు మట్టైనా లేనప్పుడు
నవ్వుగింజలూ
మాకేసి చూసి నవ్వుకుంటాయి
విరబూయడానికి
పిడికెడు ఆకాశమైనాలేనప్పుడు
నవ్వు రేఖలూ
మమ్మల్ని చూసి దిగంతాల్లో దాక్కుంటాయి

నవ్వుకోవాలనే వుంటుంది
పెదవులే
బిగదీసుకుపోయి
సహాయనిరాకరణ చేస్తుంటాయి
ఇప్పుడొక్కటే కోరిక
బంధాల చెట్టు పైనుండి
ఒక ఆకులా రాలిపోయేటప్పుడైనా
నవ్వుతూ వెళ్లిపోవాలి!

Posted in June 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!