నవవసంతసిరిమల్లెబాలకు జన్మదినశుభాకాంక్షలు
మ. నవచైతన్యఖనిన్ జనించిన మణిన్ జ్ఞానాలవాలాద్భుతా ర్ణవచశ్రీ'సిరిమల్లె'నామ్ని నవవర్షప్రాయవిస్ఫూర్జితన్ నవనీతాభమృదుస్వభావలలితన్ సాహిత్యసౌగంధికన్ స్తవనీయార్యపరంపరాన్విత సురామ్నాయంబు దీవించుతన్!
భావము -
క్రొత్తచైతన్యము అనే గనిలో పుట్టిన మణిని, జ్ఞానమునకు నిలయమైన ఆశ్చర్యకరమగు అక్షరములతో కూడిన/తియ్యని మాటలసంపద కల ‘సిరిమల్లె’ అనే పేరున్నదానిని, తొమ్మిది ఏండ్ల వయస్సుతో ప్రకాశిస్తున్న దానిని, వెన్నవంటి కోమలస్వభావముతో మనోజ్ఞమైనదానిని, నుతింప దగిన చదువుకొన్నవారి (Ph.D.) వంశముతో పరస్పరసంబంధము కల దానిని, దేవతల సమూహము దీవించుగాక!
తే.గీ. ధాన్యనందులు నిధులు రత్నాలు భక్తి మార్గములు వ్యాకరణములు దుర్గ లిజ్య(1) లావరణములు రససాక్షిదేవతలును(2) నవవిధంబులు; ‘సిరిమల్లె’ నందినికిని(3) నవవసంతాలహారతి భవిక(4) మొసఁగు! (1) ఇజ్యలు=పూజలు[అర్చనము, మంత్రపఠణము, ధ్యానము, హోమము, వందనము, స్తుతి, యోగము, సమాధి, మంత్రార్థచింతనము] (2) సాక్షిదేవతలు=సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము (3) పుత్రికకు (4)మంగళము కం. ఇద్దఱి మానసపుత్రిక యిద్దరి నద్దరినె కాక యెద్దరినైనన్ ముద్దులు గుల్కుచుఁ బెద్దగు, దిద్దఁగ మాతులురు(1) తమసుధీత్వముతోడన్ (1) మేనమామలు (మే మందఱము)