పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
నక్క – ఢంకా
అనగనగా ఒక అడవి. అందులో ఒక జిత్తులమారి నక్క నివసిస్తుండేది. ఒక రోజు ఆ నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ అడవిలో తిరుగుతుండగా దానికి ---ఢం..ఢం...గర్..గర్...గర్...అంటూ విచిత్రమైన శబ్దం వినవచ్చింది.
‘అమ్మో! ఇదేం శబ్దం? ఏదైనా వింత జంతువుగానీ ఈ అడవిలోకి రాలేదు కదా?’ అనుకుని భయపడి గబగబా పరిగెత్తుకుని పోయి ఒక పొద వెనకాల దాక్కుని అటూ ఇటూ చూసింది.
ఎంతసేపటికీ నక్కకి ఆ చుట్టు ప్రక్కల మానవ సంచారం కానీ, జంతు సంచారం కానీ కనిపించలేదు.
నక్క ‘అమ్మయ్య’ అనుకునే లోగానే మళ్ళీ అదే శబ్దం ‘ఢం..ఢం...గర్..గర్..గర్ర్..’ అని ఈసారి ఇంకా ఎక్కువగా కర్ణ కఠోరంగా వినిపించింది.
‘ఇక్కడ చూస్తే కనుచూపు మేరలోఎవ్వరూ కనిపించడం లేదు, మరి ఆ శబ్దం ఎక్కడనుండి వస్తోందబ్బా?’ అనుకుని ధైర్యం చేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పొద చాటునుండి బయటకి వచ్చి ఆ పరిసరాలని పరికించి చూసింది. అప్పుడు ఆ నక్కకి తాను నిలుచున్న ప్రదేశానికి కొంత ఎత్తులో ఒక చెట్టు క్రింద ఏదో పెద్ద వస్తువు కనిపించింది. అదేమిటా అని దగ్గరగా వెళ్ళి చూడగా అది ఒక ఢంకా (లేదా యుధ్ధ భేరి - A Drum Type Instrument whose upper part is made of a layer of animal skin which on beating will produce sound due to vibrations. It was used in olden days in Kingdoms during war or any crisis times to Alert people).
ఆ చెట్టు కొమ్మలు ఢంకా మీద వ్రాలి గాలికి అటూ ఇటూ రాసుకుంటూ కదులుతుండడం చేత ఆ శబ్దం వస్తున్నదని గ్రహించింది నక్క.
అంతే అకారణ కోపంతో ‘ ఓసి మాయదారి ఢంకా ! నువ్వా నన్నంత హడలు గొట్టి భయపెట్టావు? ఉండు నీ పని చెప్తాను’ అని శబ్దం చేస్తూ దానిపై పొరలా ఉన్న జంతు చర్మాన్ని కొరికి తింది. అలా కొన్నాళ్ళు ఆ చర్మాన్నే ఆహారంగా తింటూ అక్కడే ఉండిపోయింది నక్క.