గత సంచిక తరువాయి...
సాటిలేని నాటి 'నాసదీయసూక్తం'
యజ్ఞ యాగాదులు, పశుబలులు, సోమపానాలు, దేవతాస్తుతులు జరుగుతున్నా కాలంలోనే ఇంత విచిత్రమైన ఊహ ఆ మునులకు ఎలా స్ఫూరించిందోనని ప్రపంచ మేధావులందరినీ ఆశ్చర్యపరచిన ప్రశ్న (అడగ). అవి ఇవే... ప్రశ్నలు.
- నా సదాసీన్నో సదాసీత్తదానీం - నా సీద్రజోనోవోమాప రోయత్
కిమావరీవః కుహకస్యశర్మన్నంభః - కీమాసీద్గహనంగంభీరం
దీని తెల్లము (అర్థము):
అప్పుడు సృష్టికి పూర్వం సత్తు (ఉండడం) లేదు. అసత్తు (ఉండకపోవడం) లేదు. భూమి లేదు, సమున్నత ఆకాశం లేదు. మూతవంటిది ఒకటి ఉన్నదే? అదేమిటి. అదెక్కడ వున్నది! దానికి ఏది ఆశ్రయమిచ్చింది. సుఖ దుఃఖాల అనుభవం ఎవరికి? అక్కడ గంభీరమైన, అగాథమైన కొలవలేని ఈ జలరాశి (వెల్లువ) అప్పుడు ఉన్నదా?
- అప్పుడు చావు (మృత్యువు) లేదు. అమృతతత్వం (మిత్తిడి) లేదు. రాత్రి లేదు. పగలు లేదు. అద్వితీయమైన 'ఆది' తన స్వశక్తి చేత (తన స్వభానుసారం) గాలి లేకుండా శ్వాసిస్తుంది. 'ఆది' తప్ప మరేదీ అప్పుడు అక్కడ లేదు.
- అప్పుడు మొదటగా చీకటి చేత ఆవరించబడిన చీకటి మాత్రమే ఉన్నది. ఈ సమస్తం అంతరాయం లేని నిరంతర ద్రవం (సలిలం). చివరికి వేడిమి శక్తి చేత ఏమీలేని (చుట్టూరా) దాని నుండి ఆది జన్మించింది.
- అన్నింటికంటే 'ఆది' లో సృష్టించాలనే కోరిక ఉంది. అదే మనస్సులో భావిసృష్టికి ప్రథమ బీజం అయ్యింది. మునులు వారి హృదయాలను శోధించి, జ్ఞానంచేత సత్తు (ఉన్నది) కు, అసత్తు కు గల అవినాభావ సంబంధాన్ని తెలుసుకోగలిగారు.
- సూర్యుడు ఉదయించగానే, అంతటా తక్షణం కాంతి ప్రసరించినట్లు క్షణంలో వాటి వెలుగు మధ్యంతరాళంలో వ్యాపించింది. దానికి క్రింద ఏది వుంది? పైన ఏది ఉంది. అది సృష్టికి బీజమైంది. సృష్టికి కారణమైన శక్తి అయింది. దిగువ బలీయమైనది. ఎగువ ఉత్తేజమైనది.
- సృష్టి రహస్యం స్పష్టంగా ఎవరు తెలుసుకోగలరు? ఎవరు వివరించి చెప్పగలరు. ఇది అంతా ఎక్కడినుండి వచ్చింది. ఎలా జన్మించింది. ఈ జగత్ పుట్టుక తర్వాతే కదా దేవతలందరూ కూడా పుట్టినది. అందుచేత వారికి కూడా విశ్వ సృష్టి ప్రక్రియ తెలియదు. మరి ఇదంతా ఎలా ఏర్పడిందో ఎవరికి తెలుస్తుంది.
- ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో తెలుసుకోగలవారు ఎవరూ లేరు. అతడు ఈ విశ్వాన్ని సృజించాడో లేదో ఎవరికీ తెలియదు. పరమాకాశానికి ఆద్యుడైన పరమాత్మకు మాత్రమే, బహుశా ఈ సృష్టి ఆరంభ రహస్యం తెలిసి ఉంటుంది. బహుశా అతనికి కూడా తెలియదేమో?
ఈ నాసదీయ సూక్తాన్ని "బిగ్ బాంగ్" సిద్ధాంతం తో పోల్చి చూడండి. కొన్ని అంశాలలో ఎంత పోలిక కనిపిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. విశ్వాన్ని నడిపించే మూల సూత్రం ఏది? విశ్వము దేనితో ఏర్పడింది. మొదట్లో సృష్టికి ముందు నీరుందని ఎలా ఊహించారు. ఐన్ స్టెయిన్ సిద్ధాంతం బ్లాక్ హోల్స్ ఉనికి, స్టీఫెన్ హాకింగ్ రేడియోధార్మికత వివరణ అన్నింటిని పై ఏడూ ప్రశ్నలు సృజించాయి.
నిజానికి జీవం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో ఎవరికీ తెలీదు. ఒక రకంగా పరిశీలిస్తే సృష్టికి ముందు వుండే 'ఏమీకానీస్థితి' కీ సృష్టికి చివరవుండే "ఏమీలేనిస్థితి' కి చాలా పోలికలున్నాయి. ఈ విషయాలను భారతీయ తాత్విక చింతనలోని భావాలతో పోలిస్తే సారూప్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అందుకే జర్మనీ శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత "ఐసెన్ బర్గ్' ఏమన్నాడో చూడండి.
"భారతీయ తత్వశాస్త్రానికి, క్వాంటమ్ సిద్ధాంతానికి చాలా పోలికలున్నాయి. నా శాస్త్ర పరిశోధనలను భారతీయ తత్వశాస్త్రం ఎంతో ప్రభావితం చేసింది.”
కాబట్టి మన వేదఋషులు సత్, అసత్ లేని పరిస్థితిని, స్థల, కాల రాహిత్యాన్ని, జీరో స్పేస్, జీరో టైమ్ లను ఎలా ఊహించారో నిజంగా వారి మేధస్సుకు, దివ్యదృష్టికి, జ్ఞాననేత్రాలకి వేల వేల దండాలు, మెచ్చుకోళ్ళు.