నాన్నకి కాక మరెవరికి సాధ్యం
వెన్నపూస కన్నకన్నా వేగంగాకరిగేది
నాన్న హృదయం.
వెన్నెముక కన్నా బలంగా నిలిచేది
నాన్న సంకల్పం.
పిల్లల భవిష్యత్తు పై బెంగతో
కసాయి కన్నా కఠినంగా కనబడటం
ఒక కంటకన్నీరు కారుతున్నా
మరోకంట కోపాన్ని ప్రదర్శించటం
రక్షకు ప్రతిరూపమై ఉండికూడా
కక్షకు ప్రతిబింబంలా అనిపించటం
నాన్నకి కాక మరెవరికి సాధ్యం?
అతని క్షమ అర్ధం కానిది
అతని ప్రేమ హద్దులు లేనిది.
ప్రేమిస్తూ ద్వేషించ బడటం
శ్రమిస్తూ దూషించబడటం
నాన్నకి కాక మరెవరికి సాధ్యం?
వేపాకులా ఉపయోగపడటం
కరివేపాకులా తీసి పక్కన పడవేయబడటం
నాన్నకి కాక మరెవరికి సాధ్యం?