హలో!
హలో నాన్న! ఎలా వున్నారు?
హలో కోమలి. నేను బాగున్నానమ్మా! ఎలావున్నావు తల్లి?
నేను బాగున్నాను నాన్న.
సరే కానీ, నేన్నీకు ఎప్పుడు ఫోను చెయ్యమని చెప్పాను?
పొద్దున్న చెయ్యమన్నావు నాన్న! కానీ అప్పుడు హడావుడి, కుదరలేదు నాన్న.
సరే పరవాలేదులే, కనీసం మధ్యాహ్నం అన్న చెయ్యొచ్చుకదా అమ్మా!
నాన్న! పనంతా చేసుకుని కాసేపు పడుకున్నాను నాన్న. కుదరలేదు...అయినా ఏమైంది, ఇప్పుడు చేసానుకదా!
అవున్లేమ్మ! రోజుకొక్కసారన్న చెయ్యమంటే, కనీసం రెండురోజులకి ఒక్కసారి కాదుకదా, వారం పైనే అయింది చేసి.
సరేలే నాన్న! కుదరలేదు..తీరికచేసుకుని ఇప్పుడు చేస్తున్నాను కదా! మాట్లాడు నాన్న.
అవున్లేమ్మ! ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయ్యావు. నాతో మాట్లాడడానికి , నేను చెప్పేది వినటానికి కూడా నీకు టైం లేదు.
సరేలే నాన్న! ఇప్పుడవన్నీ ఎందుకు? వింటూనేవున్నా కదా నాన్న!
అవునమ్మా! వింటున్నానంటావు కానీ, నాకు తెలీదా నువ్వు వింటున్నావో, వింటున్నట్లు నటిస్తున్నావో. నన్నెందుకో దూరం పెడుతున్నట్లనిపిస్తుంది. ఏమైనా కన్నకూతురివి కదా! నీతో మాట్లాడాలని, ఏదో చెప్పాలని మనసు పీకుతుంటుంది.
అదేం లేదులే నాన్న!
ఏమోనమ్మా! ఏమన్నా చెబుదామంటే, నేనిప్పుడు మేజర్, నాకన్నీ తెలుసంటావు. ఏమ్మా! మేజర్ అయితే నీకేమన్నా కొమ్ములొచ్చాయా? అన్నీ తెలుసంటావు కానీ నీకేం తెలుసో తెలీదో నాకు తెలీదా! నేను చెప్పేది నీ మంచికే కదా! చెప్పేది వినాలికదమ్మ! నిన్ను ఇబ్బంది పెట్టె మాటలు నేనెందుకు చెపుతాను. ఏదయినా నీ మంచికే కదా!
సరేలే నాన్న! ఎందుకలా మాట్లాడుతావు. వింటూనే వున్నా కదా!
అయినా అమ్మ! మీక్కొంచెం వయసొచ్చి, లోకజ్ఞానం తెలిసేసరికి మమ్మలెందుకు అలా తక్కువగా చూస్తారు. నిన్నటిదాకా నాన్నే నా హీరో అని చెప్పేవాళ్ళు కదా! ఉన్నటుంది నేను జీరో అయిపోయానా!
ఎందుకు నాన్న అలా అంటారు? అలా అనుకోకండి.
అవునమ్మా! అయినా నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను నీకు ఫ్రెండ్ లాగ మాట్లాడదామని. కానీ ఏమి చెయ్యను. అందరి తండ్రులలాగా నేనుండలేకపోతున్నానేమో. బహుశా కన్న తండ్రి అన్న అధికారంతో కావచ్చు. స్నేహితుడిలాగా ఉండలేకపోతున్నా! అయినా ఎవరితోనో కంపేర్ చేసి వాళ్ళలాగా వుండలేదంటే నేనేంచేసేదమ్మ. అయినా అందరూ ఒకలాగా ఉండలేరు కదా!
అయ్యో అదేంలేదులే నాన్న. ఎందుకలా అనుకుంటారు.
నువ్వు పెద్దదానివైన తర్వాత కూడా, నీమీద అప్పుడప్పుడు కోపంతో మాట్లాడింది నిజమే. కానీ అది నీకు మంచి చెప్పాలనే తాపత్రయంతోనేకాని, నీ మీద ద్వేషంతో కాదు కదా! అయినా నువ్వు ఒకటిరెండుసార్లు చెప్పగానే మాటవినుంటే నేను అరిచిచెప్పే పరిస్థితి వచ్చేదేకాదు కదా! నేను కోప్పడినా అది నీ మంచికోసమేకదా తల్లి. మీరెక్కడ చిన్నపొరపాటు చేస్తారో అని మీ మంచి కోరేకదా చెప్పేది. అదేమో మీరర్థం చేసుకోకుండా మా చాదస్తం అంటారు.
సరేలే నాన్న! నా మంచికేగా మీరు చెప్పేది.
అయినా మీరెందుకమ్మా ఇలావుంటారు? బయటవాళ్ళందిరికి మీరు బాగానే వుంటారు. మీ అమ్మాయికేమండి బంగారం అంటుంటే సంతోషంగా ఉంటుంది. కానీ ఇంట్లో మమ్మల్ని ఎందుకు శత్రువులుగా చూస్తారు? ఎంత పెద్దయినా మీరు మాకు చిన్నపిల్లలుగానే కనడపడతారు. అయినా మీ స్వేచ్ఛనేమి మేము హరించలేదుకదా!
అయ్యయ్యో! అదేంలేదు నాన్న. ఎందుకలా అనుకుంటారు?
మా పేరెంట్స్ తో మేమెలా ఉన్నామో చెపుతుంటే మీదంతా పాత తరం అనికొట్టిపారేస్తారు. అయినా పాతకాలం పేరెంట్స్ లా కాకుండా, ఎంతోకొంచెం అప్డేట్ అవుతూనేవున్నాను. అయినా ఇంకా మేము మారాలంటే ఎలాగా! మీ జనరేషన్ తో సమానంగా ఉండాలంటే ఎలాగా? మాకుండే భయాలు మాకుంటాయి కదా! మీరే అర్ధం చేసుకోవాలి.
ఎందుకు నాన్న అన్నన్నిమాటలు. మీరు బాగానే వున్నారు.
అయినా ఎందుకు తల్లి మీకంత కోపం? ఏదయినా విషయం ఒకటికి రెండుసార్లు చెపితే నచ్చదు. జాగ్రత్తగా ఉండమంటే కోపం. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయమంటే కోపం. ఎవరితో ఎలావుండాలో, ఎలావుండకూడదో చెబితే కోపం.
అదేంలేదులే నాన్న. మీరు చెప్పినవన్నీ వింటూనేవున్నాకదా!
నీ పెళ్లి అయేంతవరకు నీభాద్యత నాదేకదా! అలా అని మా అభిప్రాయాల్ని నీ మీద బలవంతంగా ఏమీ రుద్దడంలేదుకదా! అంత నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అని చెప్పాము కదా! అయినా ఉద్యోగం వచ్చి కొంచెం డబ్బులు చేతిలో పడంగానే ఎందుకలా అయిపోతారు? ఇంట్లో వాళ్ళని అస్సలు లెక్కచెయ్యకుండా, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. ప్రపంచంలోని విషయాలన్నీ మీకే తెలిసినట్లు, మాకేమి తెలియనట్లు అంత ఆరిందాన్లా మాట్లాడుతావు. మా అనుభవమంత లేదుకదా నీ వయసు.
అయ్యో అదేం లేదులే నాన్న. నిన్నెప్పుడన్న బాధ పెట్టుంటే క్షమించండి.
అయినా ఇంట్లో ఉండి చదువుకున్నంతవరకు బాగానే ఉన్నావు. వేరేఊళ్ళో చదువుకోసమని బయటి ప్రపంచం చూసేసరికి నీలో మార్పు వచ్చింది. అలాఅని నేను నా కూతురు బావిలో కప్పలా ఉండాలనుకోలేదుకదా!
లేదులే నాన్న. నేను నీ కూతుర్ని. నేనేమి మారలేదు.
నేనేదన్న చెబుదామంటే, దానికి ముందే నువ్వు రివర్స్ లో చెప్పి నన్ను మాట్లాడకుండా చేసేదానివి. బహుశా బయట స్నేహితుల ప్రభావం అయ్యుండొచ్చు. ఒక్కొక్కసారి ఏం మాట్లాడితే ఏమౌతుందో, ఏం చేసుకుంటావోనని నాకు భయమేసేది నీతో మాట్లాడాలంటేనే.
అలా అనకండి నాన్న. నాకు ఏడుపొస్తుంది.
కోమలి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా కూలబడి పోయింది. తన కన్నీళ్లతో ఆ మొబైల్ ఫోన్ పూర్తిగా తడిసిపోయింది. ఎంత ఆపుకుందామన్న కన్నీళ్ల ప్రవాహం ఆగటం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. చాలా సేపటినుంచి ఆ సెల్ ఫోన్ లో తాను మాత్రమే మాట్లాడుతుంది. అవతల నాన్న తియ్యగా మాట్లాడుతున్నట్లు, నాన్న తిడుతున్నట్లు, అరుస్తున్నట్లు ఊహించుకుని వాటన్నిటికీ పొడిపొడిగా సమాధానం చెబుతుంది.
నాన్న లేడు. ఈ లోకంలోనే లేడు. కానీ తను చెప్పిన మాటలు, జాగ్రత్తలు, జీవితపు పాఠాలు, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా గౌరవించబడాలి, ఎవరితో సన్నిహితంగా ఉండాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఎందుకుంచాలి, ఎన్నో ఎన్నెన్నో అన్నీ తను చెప్పినవన్నీ అక్షరసత్యాలే.
చిన్నప్పుడు దగ్గరుండి అన్నీనేర్పించాడు. ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పేవాడు. తప్పు చేస్తే ఆలా వద్దని చెప్పేవాడు, వినకపోతే తిట్టేవాడు కొట్టేవాడు. అంతా నా కోసమే కదా! ఎంత పెద్దయినా ఇంకా చిన్నపిల్లలకి చెప్పినట్లే అంతా వివరంగా చెప్పేవాడు.
రాను రాను అంతా నాకే తెలుసన్న అహంకారం. తను నాన్న మాటలు వినలేదు. తనని లెక్కచేయ్యలేదు. అంతా తేలిగ్గా తీసుకుంది. ఈ పెద్దవాళ్లంతా ఇంతే అనుకుంది. ఇప్పుడు నాన్న చెపుతుంటే విందామంటే ఆయన లేడు, నాన్న పక్కన కూర్చుని కాసేపు మాట్లాడమంటే ఆయన లేడు.
నాన్న పోయినప్పటినుంచి, తనకిది అలవాటే. నాన్న ఏదేదో చెపుతున్నట్లు ఊహించుకుని గంటలు గంటలు తనతో మాట్లాడటం. తను ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా వినలేదు, ఇప్పుడు నాన్న లేడు, కానీ ఆయనతో మాట్లాడాలని ఆయన చెప్పేది వింటుండాలని ఉంది. కానీ నాన్న రాడు, ఎప్పటికీ రాడు. నాకింకేమి చెప్పడు, నాతో మాట్లాడడు.
నాన్న చెప్పేవాడు, తను పుట్టినప్పుడు పెద్ద పండగే చేశారట. ఇక ప్రతిసంవత్సరం తన పుట్టినరోజుకి నాన్న చేసే హడావుడి అంతాఇంతా కాదు. మా ఇంటి మహాలక్ష్మి, మా యువరాణి, మా గారాల పట్టి, మా వండర్ గర్ల్ అంటూ చెప్పేవాడు. చిన్నప్పుడు గంటలు గంటలు ఆడుకుని వస్తే, నా బంగారు తల్లికి కాళ్ళు నెప్పులంటూ నా కాళ్ళు ఒత్తుతూ నిద్రపుచ్చేవాడుట నాన్న.
అసలు మాకెప్పుడు అబ్బాయి కావాలని అనుకోలేదురా. అమ్మాయినే అనుకున్నాం.. భగవంతుడు నిన్నిచ్చాడు. అనేవాడు నాన్న. ఎంత మురిపెంగా చూసేవాడు.
తను కాలేజీ లో జాయిన్ అయ్యి, కొంచెం బయటి ప్రపంచం అలవాటయ్యి నాన్న తో గడపటం తగ్గి పోయింది. తను నాతో మాట్లాడాలంటే appointment ఇచ్చేది. ప్రతి చిన్న విషయానికి విసుక్కునేది. ఇంకా చాల్లే నాన్న చెప్పిందే చెపుతావ్వంటూ ఫోన్ పెట్టేసేది. ఎంత తల్లడిల్లిపోయాడు నాన్న.
ఇప్పుడు నువ్వు నా కూతురివి. మళ్ళీ జన్మంటూ ఉంటే నేనే నీ కడుపున పుట్టాలి. ఇదుగో, ఇప్పుడు నిన్నెట్లా చూసుకున్నానో, నువ్వు కూడా అలానే నన్ను చూసుకోవాలి తెలుసా అంటూ నవ్వేసేవాడు.
తన కాలేజీ అయిపోయి, ఉద్యోగ రీత్యా ఇంకా దూరం వెళ్ళింది. నెలకొకసారన్న మాట్లాడాలంటే గగనమైపోయేది. తన సరదాలు, స్నేహితులతో షికార్లు ఎక్కువైపోయాయి. ఇంక నాన్నను చూడటానికి ఊరెళ్ళటం అసలేలేదు. తన చివరి చూపు కూడా నోచుకోలేకపోయుంది. చివరి క్షణం వరకు తననే కలవరస్తూ, తనని చూడాలని ఆరాటపడుతూ కన్నుమూశాడట నాన్న.
నాన్న నన్ను మన్నించు. నాన్న నువ్వు కావాలి. నీతో మాట్లాడాలి. కోమలి కలవరిస్తుంది.. ఆలా కలవరిస్తూనేవుంది. ఈ ప్రపంచంలో లేని నాన్న కోసం ఆరాట పడుతోంది. తన మనసంతా నాన్న తోనే నిండి ఉంది. తన తలపుల్లోనే వున్నాడు నాన్న. నాన్న ఐ మిస్ యు నాన్న ... ఐ మిస్ యు నాన్న.
ఈ కథని ఎంతో బాగా వ్రాశారు శ్రీనివాసరావుగారు. ఇది మన జీవితాల్లో చాల చోట్ల చూస్తున్న కథ. మనవాళ్ళు ఎదురుగా వున్నప్పుడు పట్టించుకోని మనం, దూరమైనప్పుడు బాధ పడటం సహజంగా జరుగుతున్నదే! కళ్ళు తెరిపించే సున్నితమైన విషయం మీద హృద్యంగా అల్లిన కథ. అభినందనలు. శుభాకాంక్షలు!
ధన్యవాదాలు సత్యం గారు.
Lovely story
Thank you Sritha garu