మనం గడుపుతున్న కలల తోటలో
పరవశపు పువ్వులను చల్లటమే అమ్మపని.
మనం నడుస్తున్న బాటలో
నిరాశల ముళ్ళను తొలగించటమే నాన్న పని.
మన చెడు ప్రవర్తనలను కూడా చిలిపితనంగా భావించి,
కరుణా పూరిత వాత్సల్యంతో కీర్తిస్తుంది అమ్మ,
కానీ, వాటి అసలు రంగులను గ్రహించి,
కఠిన మనస్కుడై కర్కశంగా వాటిని ఖండిస్తాడు నాన్న.
మనం ఎదుర్కొంటున్న ప్రతిక్షణం వల్ల
మనకు ఆనందమే కలగాలన్న కోరిక అమ్మది,
వాటి వల్ల కలిగే అనుభవాలతో
మనం గుణపాఠం నేర్వాలన్నకోరిక నాన్నది.
మనం అడిగినవన్నీ సమకుర్చాలనుకొనే ఆశ అమ్మది,
మనకు మేలుచేసేవే ఎంచి ఇవ్వాలనుకునే ఆశయం నాన్నది.
మన ప్రీతి మాత్రమే అమ్మకు ముఖ్యమైనది,
మన నీతి, రీతి, ఖ్యాతులు కూడా నాన్నకు సఖ్యమైనవే.
మన పట్టుదల అమ్మకు ఇష్టం,
మన ఎదుగుదల నాన్నకు ఇష్టం.
మనం కన్నకలలను వినగానే అమ్మ ఆనందిస్తుంది,
ఆ కలలు నిజరూపం దాల్చినప్పుడే నాన్న ఆనందిస్తాడు.
అమ్మ కనులను ఆప్యాయతా పొరలు మూసిన సమయంలో,
నాన్న కనులను వివేకపు అరలు తెరిపిస్తాయి.
అమ్మ కన్న కలలను మన కృతగ్నత కమ్మేసి, కుమ్మేసిన తరుణంలో,
అమ్మ ఆవేదనను నాన్న బోధనలు మరిపిస్తాయి.
అందుకే,
నాన్న ఎప్పుడూ మన అజ్ఞానానికి అర్ధంకానివాడే,
మన ఆలోచనాతీరుకు వ్యర్ధమైన వాడే.
మన అంచనాలకు అందనివాడే,
మన అంతరంగపు అయోమయానికి చెందనివాడే.
అందుకే మనకు అనిపిస్తుంది ..
అమ్మంటే అవసరానికి మాత్రం వాడుకొని వదిలేసే వస్తువులా,
నాన్నంటే మొదటినుండీ కఠిన పాషాణ మనసులా!