Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

నా మన్మథుడు

సూర్య చంద్ర నక్షత్రాల సోయగమ్ము
మేనిలో నింపుకున్న ప్రేమికుడ వీవు,
నిన్ను క్షణ మైన కానక నిలువ లేను,
అధిక బలహీన హృదయ ప్రేయసిని నేను.

నీదు బుంగమూతిని చూడ నిండు హాయి,
మత్తు కన్నుల చూడ గమ్మత్తు హాయి,
రేయి నామీద నీ కాలు వేయ హాయి,
నీవు నన్నెక్కి తొక్కిన నిండు హాయి.

విబుధు లందరి దృష్టిలో పెద్ద పులిని,
ఛాత్రులకు దివ్య భద్ర గజమ్ము నేను,
అఖిల బంధువులకు సింహ మగుదు నేను,
కాని నీ ముందు నే శునకంబు నగుదు.

నీకు బట్టలు విప్పి నే నీళ్ళు పోసి
ముద్దుగా ఒళ్ళు రుద్దుచు పులకరింతు,
పౌడ రద్దుచు నను నేను మరచిపోదు,
ప్రేయసీ సేవలను గొను ప్రియుడ వీవు.

టన్నుల కొలంది శ్రమ భార మున్న దంత
దూది పింజలవలె తేలి తొలగిపోవు,
నా మనసు రామొజీ ఫిల్ము నగరె యగును,
నిన్ను కౌగిలిలోన బంధించగానె.

కౌగిలికి తీపి ఇంత ఎక్కడిది అనిన
తెచ్చి పెట్టిన స్వీటును తింటి ననెడు
ప్రియుని మాటలలో ఉన్న స్వీటు ముందు
చెలగు బందరు స్వీట్లన్ని చిత్తు చిత్తు.

ముద్దు బుగ్గలు ఆపిలు ముక్క లట్లు
కొరక నిమ్ము, స్వర్గమ్మును ఎరుగ నిమ్ము,
నీదు బుగ్గలలో ఏదొ స్వాదు రసము,
అమృత ధారల నైనను అపహసించు.

ముక్కు కొరికెద నని నిన్ను ముద్దులాడ
నాదు ముక్కును కొరికేసినావు నీవు,
చెవులు కొరికెద నని నేను చెప్పగానె
చెవులు కొరుకుచునుండు నీ చిలిపి ప్రేమ.

బ్రతుకుపై రాగ బంధమ్ము వదలు నాకు
ప్రేమ సూత్రమ్ముతో ముడి వేసినావు,
ఏ ప్రపంచాల నుండి ఏతెంచినావొ
నాకు నీ వైతి వా ప్రపంచమ్ము లన్ని.

లేత సొగసుల నాజూకు ప్రియుడ వీవు
ముసలి ప్రేయసి నని నన్ను వదలబోకు,
నీదు వాటంపు కౌగిలి నీదులాడ
నరము నరమున మధురిమల్ పరుగు లెత్తు.

పూర్వ మా నాడు శ్రీకృష్ణ మూర్తి గాంచి
పురుషులును కూడ మోహంబు పొంది రంట!
కృష్ణ రాముల సొగసును మించు నీకు
బానిసను కాక ఏ విధి బ్రతుకగలను!

నాదు ప్రేమికు డెవ్వరో కాదు, కాదు
మనుమడే నాకు ముద్దుల మన్మధుండు,
నేను ప్రేయసి నెవరినో కాను, కాను
తపనతో పెంచుకొనుచున్న తాత నేను.

Posted in February 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!