“రండి రండి” అని ప్రేమతో లోపలికి ఆహ్వానించే తల్లిదండ్రులను చూసి కరిగిపోయింది నందిత మనస్సు. పిల్లలిద్దరినీ కారులోంచి దింపి బాడుగ ఇచ్చి ఇంటి లోపలికి నడచింది నందిత. సామాన్లను దింపుతూ నౌకరు, “బాగున్నావా తల్లీ” అని ప్రేమగా అడిగాడు. బాగున్నానని తల ఊపుతూ పిల్లలతో “అమ్మమ్మ తాతయ్య కు దండం పెట్టండి” అంది. పిల్లలిద్దరూ పెద్దాళ్ళ కాళ్ళ దగ్గరకు వంగి దీవెనలందుకున్నారు.
“అల్లుడుగారు బాగున్నారా? రాలేదా? అని ప్రేమతో అడిగిన తండ్రితో “ఆయనకేదో ఎమర్జెన్సీ కేసు ఉందంట, అందుకే రాలేదు” అంటూ “వెళ్లి బ్రెష్ చేసి స్నానం చేయండి” అని పిల్లలను గదమాయిoచింది. “రండి బంగారు కొండలూ” అంటూ మనుమలిద్దరిని అక్కున చేర్చుకొని హత్తుకొని, “వేడి నీళ్ళు కాచి రెడీ గా ఉంచాను ...రండి” అని తీసుకెళ్ళే తల్లిని చూస్తూ వుండి పోయింది నందిత.
“నందితా కలైత్తు పోయిరుప్పే! పోయ్ కుళి, కాఫీ కుడి, టిఫిన్ రెడీయా ఇరుక్కు! (అలసి పోయివుంటావు, స్నానం చేసి రా, కాఫీ టిఫిన్ రెడీగా వుంది)” ప్రేమతో అంది అమ్మ. ఈ ఇంట్లో వుండే సంతోషపు జల్లుల నుండి ఓ చినుకు మా ఇంట్లో పడకూడదా..భగవంతుడా! మౌనంగా వరమడిగింది నందిత. కాఫీ, టిఫిన్లు ముగించి, పిల్లలను తోటలను చూసి రండి అని నౌకరుతో పంపి ఆస్తుల గురించి, బంధుత్వాలను గూర్చి అమ్మతో మాట్లాడుతూ కూర్చుంది నందిత. అన్నయ్య, చెల్లెలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. నందిత మాత్రమే కోయంబత్తూర్ లో వున్న తల్లితండ్రులను చూసేందుకు కొచ్చిన్ నుండి ఆరునెలలకు ఒకసారైనా ఖచ్చితంగా వచ్చేస్తుంది. మాతృభాష మలయాళం అయినా దాదాపు యాభై సంవత్సరాల ముందు వీళ్ళ పూర్వీకులు కోయంబత్తూర్ కు వచ్చేశారు. అందుకే వీళ్ళ కుటుంబ సభ్యులంతా తమిళంలోనే మాట్లాడుకుంటారు.
ఎం.ఏ, ఎం. ఫిల్ ఇంగ్లీష్ లో చేసి ఓ ప్రైవేటు కాలేజీ లో లెక్చరర్ గా చేరిన మూడు నెలలకే నందితకు పెళ్లి జరిగి పోయింది. భర్త రవి రంజన్ కొచ్చిన్ లో ఓ పేరు గాంచిన హృదయ రోగ నిపుణులు. చిన్న వయసులోనే కఠిన పరిశ్రమతో అవలీలగా ఎన్నో ఓపెన్ హార్ట్ సర్జరీలను విజయవంతంగా చేసి సమాజంలో గొప్ప పేరు, పలుకు బడి సంపాదించాడు. తలిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. రాజ్ భవన్ లాంటి లంకంత కొంప. ఇంటినిండా పని మనుషులు. తోటలు, ఫార్మ్ హౌసులు. దేనికీ కొదవ లేదు. కానీ, సంతోషం ........? నందిత మనసు బాధతో మూల్గింది.
రవి రంజన్ కు పక్కనే వున్న బంగళాలో డాక్టర్ ప్రీతీరావ్ భర్తతో ఉంటోంది. రవి, ప్రీతీ మంచి స్నేహితులు. మెడిసిన్ లో క్లాస్ మేట్స్. ఒకే హాస్పిటల్ లో పని చేసే మంచి కొలీగ్స్..అనే పెళ్ళైన కొత్తలో నందిత అనుకునేది.
రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరిదీ స్నేహం కాదని శ్రుతి మించి రాగాన పడ్డ వలపని ఇట్టే తెలుసుకుంది నందిత. షాపింగ్ కాంప్లెక్స్ లో, హోటల్స్ లో, పబ్లిక్ ప్లేస్ లలో చూసి, చాలా సార్లు ఖంగు తింది. ఉండబట్ట లేక ఓ రోజు రవిని దాని గురించి అడిగింది. దానికి రవి “ఓస్! ఇంతేనా! మేమిద్దరం పాత ప్రేమికులం. తల్లి దండ్రుల మనస్సుకు కష్టం కలగగూడదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా ఎఫైర్ సంగతి వాళ్ళ భర్తకే తెలుసు. అయినా నీకేం కొదవ? రాణి లాగ చూసుకుంటున్నాను. ఇవన్నీపట్టించుకోవద్దు..అని అన్నాడు గీతోపదేశం చేస్తున్న కృష్ణ భగవానుడిలా ఫోజు పెట్టి.
ఆ రోజు తలలో పడిన పిడుగు నుండి ఈ రోజు వరకు నందిత తేరుకోలేదు. “ఏమ్మా! అదోలా వున్నావ్? ఒంట్లో బాగో లేదా? నాన్నగారి ప్రశ్నతో ఈ లోకానికి వచ్చింది నందిత. “అదేం లేదు, నాన్నా! బాగానే వున్నాను” అంది ముక్త సరిగా. అంతలో సెల్ మోగడంతో, “ఓ నిమిషం, నాన్నగారూ! అంటూ గార్డెన్ లోకి పరుగెత్తింది.
“హలో! నందితా! ఎప్పుడొచ్చావ్? ఎలా వున్నావ్? అమ్మా, నాన్న, పిల్లలు బావున్నారా? అంటూ ప్రేమతో ప్రశ్నల వర్షం కురిపించింది నందిత ప్రాణ స్నేహితురాలు వసంతి. “వసంతీ! నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మన ఫ్రెండ్స్ తో సహా సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఆర్.ఎస్. పురం దగ్గర వున్నపార్కుకు వచ్చెయ్” అంది నందిత. దానికి వసంతి “నందితా! ఏ విషయంలోనూ తొందర పడవద్దు. ఏదన్నా ఎవిడెన్స్, క్లూ దొరుకుతుందా అని చూడు అంది.”
నందిత, వసంతి, బిందు, రీనా కపూర్ నలుగురూ మంచి స్నేహితులు. వసంతి చెన్నై లో పచ్చయప్ప కాలేజీ లో ప్రిన్సిపాల్ గా వుంది. రీనా ఎప్పుడో నార్త్ నుండి సౌత్ కి వచ్చి స్థిరపడిన ఓ పంజాబీ కుటుంబానికి చెందిన ఐ.పి.ఎస్ అధికారి. ఓ తమిళ యువకున్ని ప్రేమించి తల్లిదండ్రుల అనుమతితో పెండ్లాడి అత్తవారి ఇంట, భర్త వల్ల ముప్పతిప్పలు పడుతున్న మహిళ. బిందు ఓ ప్రైవేటు కంపనీలో ఎం .డి.గా పని చేస్తున్న అత్యాధునిక భావాలున్న పెండ్లికాని యువతి.
xxxx xxxx xxxx
నందిత తన రూంకు వెళ్లి కంప్యూటర్ ను ఆన్ చేసింది. రవికి వచ్చిన మెయిళ్లను వెదుక సాగింది. ఓ వారం రోజుల ముందు చాలా కష్టపడి ‘పాస్ వర్డ్’ ను కనిపెట్టింది. మెయిల్స్ లో ఏ ఎవిడెన్స్ దొరకలేదు. స్పామ్ లో వెదికింది. ఆమె అనుకున్నట్టు ఒక మెయిల్ దొరికింది. చాలా శ్రద్దగా చదువసాగింది.
“ప్రియమైన తాతయ్యకు! ముద్దులు” అని సంబోధించి లెటర్ అంతా ప్రేమను ఒలకబోసి వచ్చే వారం మూనార్ కు వెళదాం అని గెస్ట్ హౌస్ అడ్రస్ ఇచ్చి మరీ ఆహ్వానించింది. “అరే ...పాపిష్టి దానా! ఇతరుల కుటుంబాన్ని చెడిపేoదుకే నీ లాంటి వాళ్ళు పుట్టారా..! అని అనుకుంటుండగానే మొబైల్ మోగింది. “ఏం నా ముద్దుల కొలంబస్ పెళ్ళామా! కనుగొనేసావా! నా మనవరాలి లెటర్ ను చదివేశావా?” అని పైశాచిక వికృత నవ్వుతో....రవి గొంతు. ఫోన్ కట్ అయింది. వెంటనే నందిత ఫోన్ చేసి విషయాన్ని వసంతికి చెప్పి బాధ పడింది. దానికి వసంతి “తొందర పడవద్దు సాయంత్రం మాట్లాడుకుందాం” అంది. పోనీ ! తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పేద్దామా అనిపించింది నందితకు. వద్దు...ముసలితనంలో వాళ్ళ సంతోషాన్ని ఎందుకు బలిచేయడం, వాళ్ళన్నా మానసిక శాంతితో బతుకనీ....మనస్సు హెచ్చరించింది. సాయంత్రం పిల్లలతో బాటు మరుదమలై గుడికి బయలు దేరారు కారులో నందిత అమ్మానాన్నలు. తను రానని ముందే చెప్పేసింది నందిత.
ఐదు గంటలకు చెప్పినట్లు నందిత స్నేహితురాళ్ళు వచ్చేశారు. పక్కనున్న రెస్టారెంట్ లో కాఫీ తాగి నలుగురూ పార్కుకు చేరారు. వసంతిని చూసి అక్కున చేర్చుకుని నందిత బావురుమంది. నందితను చూసి వసంతి “ఏడ్వకు ..!” అని ఓదార్చింది. బిందు, రీనా నందిత భుజంపై చెయ్యి వేసి ఓదార్చారు. “ఏం చెయ్యబోతున్నావ్?” బుజ్జగిస్తూ తమిళంలో అడిగింది రీనా. వెంటనే బిందు “ఏముంది..? విడాకులే...ఇలాంటి స్టుపిడ్స్ కు ఇవ్వాలి” అంది కోపంగా. “బిందూ ..! కాస్త నీవు మౌనంగా వుండు, ఆమెను ఆలోచించుకోనీ..” అంది వసంతి. నందిత వైపు తిరిగి “నందితా! నీ భర్త సిటీ లో ఓ ప్రముఖ వ్యక్తి. కోర్టో, పోలీసో ఏమీ చెయ్యలేదు ....అన్నదాన్ని ముందు గుర్తు పెట్టుకో..” అంది వసంతి. దానికి రీనా “అవును! షి ఈజ్ రైట్. ఇది చాలా సెన్సిటివ్ కేస్, మెల్లగా డీల్ చేయాలి..” అంది.
“అబ్బబ్బా! ఎంత మంచి దేశం మనది. ఓ ప్రిన్సిపాల్ గారూ ఓ మహిళా పోలీసు అధికారి ఎంత భద్రత స్త్రీ కు ఇస్తున్నారు?” అంది బిందు వేళాకోళoగా. “బిందు! నీకు పెళ్లి అవలేదు, నీకీ విషయాలు తెలియవు, నీలాంటి వాళ్లకు ఆ శ్రీ రామచంద్రుడే భర్తగా వస్తాడులే” అంది రీనా నవ్వుతూ. దానికి బిందు “అమ్మా! తల్లీ...! పెళ్ళాన్ని సందేహించే రాముడు వద్దు, రాసక్రీడలు జరిపే కృష్ణుడూ వద్దు, మిమ్మల్నందరినీ చూసిన తర్వాత నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా..” అంది. “అయితే ఈ ప్రౌఢ బ్రహ్మచారిణి ఇలాగే వృద్ధ బ్రహ్మచారిణి గానే మిగిలి పోతుందన్న మాట..!” అంది వసంతి. ఆమె మాటలకు అంతా నవ్వేశారు. వసంతి నందితతో “నీవు చదువుకొన్న దానివి. ఓ మంచి ఉద్యోగం చూసుకో కాస్త శాంతి లభిస్తుoది. కాస్త కాలం గడవనీ ..! దేవుడు వున్నాడు. పోలీస్ అధికారిగా వున్న రీనాను చూడు. మన రాష్ట్రo గూడా కాదు. భర్త, అత్తగారి ఈసడింపు మాటలను, తిట్లను లెక్కచేయకుండా తన సంపాదనంతా మెట్టింటికి ధారపోస్తూ ఎంత ఓర్పుతో వుందో ....” అంది వసంతి.
“అవునవును. చాలా...చూశాను, ఆవిడ ఓర్పును. ఆ రోజు, స్వాతంత్ర్య దినోత్సవం రోజు “స్త్రీలను గౌరవించేది గృహమా? కార్యాలయమా? అన్న అంశంపై జరిగిన డిబేట్ కు అధ్యక్షురాలుగా నా ప్రక్కన వేదికపై కూర్చొని వుంది. ఆవిడ భర్త అర్ధ గంట కొకసారి ఫోనులో వెయ్యి తేళ్ళు కుట్టినట్లు కుడుతూనే వున్నాడు ...పాపం! చాలా బాగుంది మన వూర్లో మహిళా స్వాతంత్ర్యం...” అంది బిందు వెటకారంగా. “అదే జీవిత మంటే..!” అంది వసంతి.
“మనల్ని మనమే ఏమార్చుకుంటూ, నకిలి జీవితం జీవించడం కంటే మన సంపాదనలో మనం సంతోషంగా జీవిస్తూ, సమాజంలోని నలుగురు బీదలకు సహాయ పడాలి. అంతేకాని, మొత్తం జీతాన్ని ఇంటికి ధారపోసి , తనపై ప్రేమ, కృతజ్ఞతా భావం లేని ఓ రాక్షసుడి దగ్గర వివాహం పేరిట రాజీ పడి యావజ్జీవ ఖైదీగా ...అనుకుంటేనే బాధగా, కంపరంగా కూడా వుంది. ఏమీ .. ఆలోచించకు నందితా! విడాకులు వాడి మొహాన విసిరేసేయ్యి ...” అంటూ “రీనా లాగ మన దేశంలో మహిళా పోలీసులు ఉండబట్టే డిల్లీలో అదీ, బస్సులో విచ్చల విడిగా అమ్మాయిని మాన భంగం చేశారు. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణం. పసి పాపలను గూడ తీసుకెళ్ళే కామాంధులు. దుబాయ్ లాగా మన దేశంలో కూడా కఠిన శిక్షలు అమలు చేస్తే ఎవడూ తప్పు చేయడు. ఐదేళ్ళ పాప హాయిగా బయట ఆడుకోలేని దారుణస్థితి...ఛీ...ఛీ. ఫైన్ సిస్టం తేవాలి. పబ్లిక్ ప్లేసులలో సిగరెట్, బీడీ కాలిస్తే, ఉమ్మి వేస్తె జరిమానా పెట్టు. అమ్మాయిలను మానభంగం చేస్తే ఉరి శిక్ష విధించు. క్రమశిక్షణ పెరుగుతుంది, దేశం రాబడి పెరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వమే లైసెన్సు ఇచ్చి సారా కొట్టు నడుపుతుందిగా...! అన్నీ చానల్స్ లో పెద్ద పెద్ద హీరోలతో మద్య పానం, గుట్కా, పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రతి దినం గంటకు ఓ సారి చెప్పించు. వరదలు వస్తే భాధితులకు విరాళాలు హీరోల ద్వారా, క్రికెటర్స్ ద్వారా చెప్పిస్తారే.. అలాగే పొగాకు వల్ల కలిగే నష్టాలను గురించి కూడా ప్రకటించు. రేషన్ కార్డుకు టీవీ, మిక్సీ ఇలాంటివి ఇవ్వడం మానేసి ఓ బీద కుటుంబం నుండి ఇంటికో బిడ్డ చొప్పున మంచి విద్యా సౌకర్యం పెద్ద చదువుల వరకు ప్రభుత్వం కల్పించాలి...మన దేశంలో ప్రభుత్వం, పోలీస్ లాంటి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయి చాలా కాలం అయ్యిందిలే...” ఆవేశంగా అంది బిందు.
“దీనికంతా ప్రభుత్వమో, పోలీసో కారణం కాదు. మార్పనేది మనిషిలో రావాలి. ఓ వ్యక్తి మంచి లేదా చెడు గుణాలకు తల్లిదండ్రుల పెంపకం, మిత్రులు, పెరిగిన వాతావరణం..ఇలా చాలా చాలా కారణాలుంటాయి. ఏ కాలేజీలోనూ, యూనివర్సిటీలోనూ సంఘ విద్రోహులుగా, పశువులుగా తయారు చేసే విద్యను భోదింపరు. తల్లిని గౌరవించే వాడు పెళ్ళాన్ని గౌరవిస్తాడని అంటారు. కానీ తల్లే లేకుండా పెరిగిన వాడు కూడా భార్యను చక్కగా చూసుకుంటాడు. మొన్న మా ఇంటికి ఓ ప్రొఫెసర్ వచ్చాడు పెళ్ళాన్ని పిలుచుకొని. లక్షలలో సంపాదిస్తున్నాడు..ఏం లాభం? పెళ్ళానికి ఇంత వరకు ఓ మంచి పట్టు చీరో, నగ, నట్రో కూడా కొని ఇవ్వడంట. అంతెందుకు ఆ అమ్మాయి కంటికి డబ్బులు చూపడంట..! ఆ అమ్మాయి ఎం.కాం. చదువు కొని చక్కగా జాబ్లో ఉన్నింది. జాబ్ మాన్పించి ఈ వెధవ పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి చక్కగా వుంటుంది. వీడి ఇంట్లో వండి పెట్టే బానిస లాగా తిరుగుతుంది. ఈ విషయాలు ఎంత మంది బయటకు చెబుతారు..? ఏదో కొంత మంది క్రూర మృగాల లాగ బిహేవ్ చేస్తే దానికి సమాజమో, ప్రభుత్వమో ఎలా భాద్యత వహించగలదు ...?చెప్పు!” అంది రీనా ఆప్యాయంగా బిందు భుజం మీద చేయి వేసి.
“శభాష్! భలే...ప్రభుత్వ పోలీస్ అధికారివని ఋజువు చేశావ్....ఎంత మంచి సందేశం..!” అంది బిందు. “తనేమి తప్పుగా మాట్లాడలేదే?ఈ నాటి మహిళలు ఓ నడిచే ఏ.టి.ఎం. కార్దులే అని మాకూ తెలుసు. ఎంత మంది వీరేశలింగం పంతులు, గురజాడలు వచ్చినా ఎవరి గుణాలను మార్చలేం. ఆనాడు ఉద్యోగం పురుష లక్షణమని మగవాణ్ణి నమ్మి పిల్లనిస్తారు మరి ఈ నాడు ఆఫీస్ లో, ఇంట్లో, సమాజం లో అన్నీ చోట్లా అన్నీ వర్గాల మహిళలు ఓ వైపు వర్కింగ్ వుమన్ గా, మరో వైపు గృహణిగా, తల్లిగా మరిన్ని భాద్యతలను మోస్తూ నడుస్తున్న ఏ.టి.ఎం కార్డుగా మల్టీ టాస్క్ మెషిన్ లాగా తిరుగుతూ ఇంటి ఖర్చులన్నీ భరించే కల్పతరువులుగా గూడా జీవిస్తున్నారు. అందరూ డైవర్స్ ఇచ్చేస్తే ఎవడికీ అమ్మాయిలు దొరకక అల్లాడి చస్తాడు మగవాడు. భారత దేశంలో కుటుంబ వ్యవస్థ కూలి పోతుంది. కానీ ఏ మహిళ కూడా వీటిపై కుటుంబ రీతుల దృష్ట్యా మక్కువ చూపదు. అందుకే ఆ విధానం ప్రాక్టికల్ గా పనికి రాక, ఆడది కోర్ట్ ల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగడానికి ఇష్టపడక రాజీ పడిపోతుంది. మగవాడు దానిని అలుసు గా భావిస్తాడు.ఇక మన ఉపన్యాసాలు చాలించి నందిత విషయానికొద్దాం” అంది వసంతి. “నందితా! నువ్వు జాబ్ చెయ్యి. డబ్బు కోసం కాదు శాంతి కోసం. ఇంకొద్ది కాలం చూద్దాం. ఈ మధ్యలో నీకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం వస్తే మేమందరమూ నీతో వుంటాం. దేవుడిపై భారం వెయ్యి. చూద్దాం. ధైర్యంగా వుండు ....” అంది వసంతి. “నాకూ అదే అనిపిస్తుంది, కాస్త ఓర్పు వహించు” అంది రీనా. “అబ్బబ్బా ...! పోలీసమ్మా, ప్రిన్సిపలమ్మా, 21 వ శతాబ్దిలో ఇచ్చే బోడి సలహాలు వినకే ...! వాడికి విడాకులు ఇచ్చేయ్ .! జీవితం ఒక సారి మాత్రమే లభిస్తుంది. దాన్ని పోగొట్టుకోకే ...!” అంది బిందు. “లేవండే, తర్వాత కలుద్దాం నందితా! ఏది చేసినా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించి చెయ్యి. ఇది నీ జీవితం. నీవు మంచి నిర్ణయమే తీసుకుంటావని నమ్ముతాం ,..పదండే” అంది వసంతి. అందరూ సెలవు తీసుకున్నారు.
xxxx xxxx xxxx
దాదాపు ఓ సంవత్సరo తర్వాత....... దుబాయి నుండి వస్తున్నవసంతిని రిసివ్ చేసుకునేందుకై కొచ్చిన్ ఏర్ పోర్ట్ కు వెళ్ళింది నందిని. వసంతిని సంతోషంగా వాటేసుకుంటూ “నీవు చెప్పినట్లే జరిగింది వసంతి. నేను జాబ్ లో చేరాను. విడాకులు ఇద్దామని గట్టిగా నిర్ణయించినపుడు ఓ రోజు జరిగిన ఓ భయంకరమైన కార్ ఆక్సిడెంట్ లో ఇద్దరికీ పెద్దగా దెబ్బలు తగిలాయి. దాంట్లో ప్రీతి చనిపోయింది. పాపం!...పోతూ పోతూ ..నన్ను క్షమాపణ అడిగింది, రవి కొన ఊపిరితో బతికాడు.” అంది కళ్ళు తుడుచుకుంటూ.
తన శత్రువు కోసం కూడా కన్నీళ్లు చిందే నందిత బంగారు మనసును చూసి చలించి పోయింది వసంతి. నీ కథ శోభన్ బాబు సినిమాలా ముగిసింది. మిగతా వాళ్ళు ఎలా వున్నారు? మెయిల్స్ గానీ, ఫోన్స్ గానీ ఎవరూ చేయలేదు. బావున్నారా?” అడిగింది నందిత ఇంట్లో కాఫీను సిప్ చేస్తూ వసంతి. “రీనా నాగ్ పూర్ లో ఇల్లు కొనుక్కొని భర్తతో, పిల్లలతో వెళ్లి పోయింది. మన ప్రౌఢ బ్రహ్మచారిణి స్త్రీలకై ఓ ఎన్.జీ.వో సంస్థను స్థాపించి సంఘసేవ లో లీనమై వుంది. నిన్న రాత్రే దానికి, రీనాకు ఫోన్ చేసి చెప్పాను నీవస్తున్నట్లు. ఫోన్ చేస్తారులే ఈ రోజు నీకు” అంది నందిత నవ్వుతూ. మబ్బులు వీడిన పున్నమి చంద్రుడిలా నిర్మలంగా వున్న నందిత నవ్వును చూసి మనస్సులోనే దేవునికి జోహారులు సమర్పించింది వసంతి.