Menu Close
Iruvanti-Sreenivas
మిసెస్ మొగుడు (కథ)
-- యిరువంటి శ్రీనివాస్ --

హాయ్ డాడ్ .. మిక్స్డ్ వెజ్ రైస్ వెరీ యమ్మీ.

అప్పుడే వచ్చిన వాట్సాప్ మెసేజ్ చూసి నవ్వుకున్నాను. నా పెద్దకూతురు శృతి ఆఫీస్ నుంచి చేసిన వాట్సాప్ మెసేజ్ అది.

తను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా లో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో బాచిలర్స్ చేస్తూ, ఈ సమ్మర్ లో ఇక్కడ ఆస్టిన్ లో ఇంటర్న్షిప్ కోసం వచ్చింది.

శృతి రోజు ఆఫీస్ కి బయల్దేరేసరికి తనకిష్టమైన డిష్ చేసి బాక్స్ లో పెట్టి పంపించడం, ఆ తర్వాత ఇంటిపనులు చూసుకుని, సాయంత్రం తనకోసం వేచి ఉండటం, రాత్రి భోజనం తయారు చెయ్యడం, తన ఆఫీస్ కబుర్లు చెబుతుంటే వింటూ భోజనం చెయ్యడం, టీవీలో వార్తలు కాసేపు చూసి నిద్రపోవడం ప్రస్తుతం నా దిన చర్య.

అవును నా గురించి చెప్పనే లేదు కదూ. నా పేరు మూర్తి, పూర్తి పేరు చాలా పెద్దది లెండి.

ప్రస్తుతం నా భార్య జ్యోతి, చిన్న కూతురు కీర్తి వేసవి సెలవలు కి హైదరాబాద్ వెళ్లారు.

ఇప్పుడు పెద్ద కూతురికి లంచ్ బాక్స్ ఇస్తూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు టాటా చెపుతున్నాను. ఇంతకుముందు నా భార్య కి, చిన్న కూతురు కి లంచ్ బాక్స్ లు ఇస్తూ టాటా చెప్పేవాడిని.

ఇంట్లోనే కాదు, ఆ కమ్యూనిటీ లో చుట్టుపక్కల ఏ చిన్న వేడుక జరిగేనా వంటల విషయంలో నేను కానీ, నా సలహా లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు.

మూర్తి గారు వచ్చే వారం మా ఇంట్లో ఫలానా ఫంక్షన్. మీరు కొంచెం వంటల దగ్గరుండి డైరెక్షన్ ఇస్తే చాలు, ప్లీజ్ అండి.

మూర్తి గారు ఫలానా డిష్ మీరు చెప్పినట్లే చేసానండి. కానీ ఆ రుచి రావట్లేదు. మీరొకసారి వచ్చి చూస్తారా?

మూర్తి గారు మీరు మూర్తి కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టండి సార్, బాగా ఫేమస్ అవుతారు.

మూర్తి గారు మీరొక రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టండి సార్, మేము పెట్టుబడి పెడతాం.

మిస్టర్ పెళ్ళాం సినిమా గుర్తొచ్చింది. బాపు గారే ఇప్పుడుంటే మిసెస్ మొగుడు సినిమా తప్పకుండా తీసేవాళ్ళేమో.

జీవితం ఎంత విచిత్రం. ఉద్యోగం పురుష లక్షణం ఒకప్పుడు. ఇప్పుడు ఆడ మగ తేడా లేదు ఉద్యోగం చెయ్యడానికి. నిజానికి మగాళ్ళకంటే ఆడవాళ్లు దేన్లో తీసిపోరు. దేశాల్నే ఏలేస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య ఒకటేమిటి అన్ని రంగాల్లో ముందున్నారు. ఒకప్పుడు ఆడ పిల్లకి వయసు రాగానే పెళ్ళి చేస్తే చాలు మన బాధ్యత తీరిపోయింది అనే స్థాయి నుంచి, ఈరోజు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మగాళ్ళకంటే మేమేం తక్కువ కాదు అనే స్థాయికి ఎదిగారు.

ఇలా ఆలోచిస్తూ నెమ్మదిగా గతంలోకి జారిపోయాను.

నా ఇంజనీరింగ్ అయిపోయి టీసిఎస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిన రెండేళ్ళకి జ్యోతి తో పెళ్లిఅయింది. తాను కూడా ఇంజనీరింగ్ చదివింది, తెలివైనది. కానీ ఉద్యోగం చెయ్యనీయలేదు నేను.

అందరి లాగే నేను కూడా. నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరమేంటి. 5 అంకెల జీతం నాకొస్తుంది. ఇంట్లో వుంటూ ఇంటి  పనులు చూసుకుంటూ, రేపు పిల్లలు పుడితే వాళ్ళను చూసుకుంటూ హాయిగా ఉండు. నా మాట కాదనలేక పోయింది నా భార్య. మధ్యలో అపుడప్పుడు "ఏమండి బోర్ గా వుంది ఏదయినా చిన్న ఉద్యోగమైనా చేస్తానంటే" పడనిచ్చేవాడ్ని కాదు.

అప్పుడప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో కోడింగ్ చేసుకుంటుంటే పెద్దగా పట్టించుకునే వాణ్ని కాదు. అలానే ఇదిగో ఈ లాంగ్వేజ్ లో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ డిజైన్ పాటర్న్స్ ఇలా వాడితే కోడ్ పెరఫామెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇదిగో చూడండి ఈ కొత్త టూల్ ఎంత బాగుందో ఇది వాడితే మనకి 50 శాతం టైం ఆదా అవుతుంది అని చెబుతుంటే, నీ బోడి సలహా నాకేం అవసరం లేదన్నట్లు చూసేవాడిని. తను చిన్నబుచ్చుకున్నా ఏమి అనేది కాదు.

తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం, వాళ్ళబాగోగులు చూసుకోవడంలో మునిగిపోయింది. అయినా సమయం దొరికినప్పుడల్లా కంప్యూటర్ ని మాత్రం వదిలేది కాదు.

ఈలోగా టీసిఎస్ వాళ్ళు ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళమనటంతో, అందరం తట్ట బుట్ట సర్దుకొని వచ్చేసాం.

మొదట సన్నీవేల్, బే ఏరియా, తర్వాత ఆర్లాండో, ఫ్లోరిడా ఇలా ఒకటి రెండు సంవత్సరాలకి ఒక్కొక్క రాష్ట్రం తిరుగుతున్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా తిరుగుతుంటే కుదురు ఉండదు, అదీ కాక స్కూల్స్ తరచూ మారటం వల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని, ఒక H1 దేశీ కన్సల్టెంట్ ను పట్టుకుని టీసిఎస్ వదిలేసి క్లయింట్ దగ్గర చేరిపోవడం చకచకా జరిగిపోయాయి.

నాజీవితం మలుపు తిరిగింది సరిగ్గా ఇక్కడే. అమెరికా లో ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు అని తెలిసింది.

ఇమ్మిగ్రేషన్ మోసాల మీద ఒక కన్నేసిన అమెరికా హోంలాండ్ మరియు సెక్యూరిటీ వాళ్ళు దేశమంతా ఈ మోసాల మీద గట్టిగ విచారణ చేయడం, వీటిలో అవకతవకలకు పాల్పడిన వాళ్ళను అరెస్టులు చేయడం, వాళ్ళ కన్సల్టెన్సీలను మూసివేయడం అన్ని ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి.

ఆ ప్రభావం నా కన్సల్టెంట్ మీద కూడా పడింది. ఈ కన్సల్టెంట్ ని మూసివేయడం, ఆ యజమానిని అరెస్ట్ చెయ్యడం జరిగిపోయాయి. దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి.

ఇదంతా జరగడానికి సంవత్సరం ముందు నేను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే,

స్నేహితులు, తెలిసినవాళ్ళు, ఆఫీస్ కొలీగ్స్ సలహా ప్రకారం మా ఆవిడ ని ఉద్యోగానికి అప్లై చేయించటం.

స్వతహాగా తాను తెలివిగల్లది కావటంవల్ల, ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళ అన్ని ఇంటర్వ్యూలలో నెగ్గుకు రావడం, ఆ కంపెనీ వాళ్ళు తీసుకోవడం, వాళ్ళే ఆ సంవత్సరం H1B లాటరి కి అప్లై చెయ్యడం, తాను సెలెక్ట్ అవ్వడం జరిగిపోయాయి.

అంటే నా ఉద్యోగం పోవడం, తనకి ఉద్యోగం రావడం ఒకేసారి జరిగిపోయాయి.

ఏదో సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ "ఎక్కడ నెగ్గాలో కాదు... ఎప్పుడు తగ్గాలో తెలిసినోడే గొప్పోడు." నేనంత గొప్పోడిని కాక పోయినా, భేషజాలకు పోకుండా నేను తగ్గాను, తను నెగ్గింది.

అప్పట్నుంచి, ఇద్దరి స్థానాలు మారిపోయాయి. అప్పటిదాకా కిచెన్ లోకి వెళ్లని నాకు, తానే దగ్గరుండి అన్ని నాకు నేర్పించింది. నా భార్యే నా గురువు, మెంటార్ ఈ విషయంలో. మొదట్లో కొంచెం కష్టంగానే అనిపించింది అలవాటు లేని పని అవ్వడం వల్ల. అయినా ఎంతమంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలుచేస్తూ, వంట చేసుకోవడంలేదు. వాళ్లలో భార్యలకు వంట రాకో లేదా వాళ్ళ వంట నచ్చకో, వంటచేసి పెట్టి ఉద్యోగాలు చేసుకునే మగవాళ్ళు నాకు తెలిసిన వాళ్లు చాలామంది వున్నారు. వాళ్ళందరూ చదువుకునేటప్పుడు ఇంటికి దూరంగా ఉంటూ, హాస్టల్ తిండి పడక వంట నేర్చుకుని ఇప్పుడు చేయి తిరిగిన వాళ్లే. వాళ్ళందరూ వంటల్లో ఆరితేరి పోయిన వాళ్ళు. వాళ్ళతో పోల్చితే నా పని సులువే మరి. పరిస్థితులు మనుషులని మారుస్తాయంటే ఇదేనేమో.

తాను ఉద్యోగంలో అతి త్వరలోనే ప్రాజెక్ట్ మేనేజర్ స్థానానికి చేరుకొని బాగా బిజీ అయ్యింది. ఇంటి పని, వంట పని, పిల్లల్ని స్కూల్ కి దింపి తీసుకురావడం, వాళ్ళ చదువులగురించి చూసుకోవడం నాకు అలవాటయ్యింది.

మద్యమద్యలో ఎప్పుడన్నా వీలుచిక్కినప్పుడల్లానో వారాంతంలోనో తను నాకు సహాయం చేద్దామని వంటగదిలోకి వచ్చినా నేను రానిచ్చేవాణ్ణికాదు. నాకు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో పని ఎలావుంటుందో, ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసి ఉండటం వల్ల, సమయం దొరికితే పిల్లలతో గడపమనో లేదా విశ్రాంతి తీసుకోమని చెబుతుండేవాణ్ణి.

ఆ తర్వాత ఒకట్రెండు సార్లు నేను ఉద్యోగానికి ప్రయత్నించి, నా పాత H1 ను కొత్త ఎంప్లాయర్ కి బదిలీకి ప్రయత్నించినా అవ్వకపోవటం వల్ల, ఇక నేను ఉద్యోగం గురించి ఆలోచించటం మానేసి, ఇంటికే పరిమితమయ్యాను.

ఏమండీ, నాకేదోలా ఉందండి, మీరిలా ఇంట్లో ఉండడం నేను ఉద్యోగం చెయ్యడం. మనం ఇండియా వెళ్ళిపోదాం.

చూడవోయ్, ఎంతమంది పెద్ద హోటళ్లలో చెఫ్ ప్రొఫెషన్ లో పనిచెయ్యటంలేదు. నేను ఇంట్లో ఆ పని చేస్తున్నాను అంతే కదా. అయినా నీవు నలభీమపాకమని వినలేదా? ఇది ఇప్పుడు మగాళ్ళకి కొత్తేమి కాదు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఎలాగూ ఏమీ అనుకోరు. చక్కగా మా అమ్మాయికి అల్లుడు చేసి పెడుతున్నాడని సంతోషిస్తారు. ఇక మా అమ్మ, నాన్న, మా వైపు వాళ్ళు సహజంగానే చెవులు కొరుక్కుంటారు. మనం అవన్నీ పట్టించుకొని ఇబ్బంది పడకుండా, తేలిగ్గా తీసుకుని వదిలేయటం మంచిది. ఎందుకంటే ఇది మన జీవితం మనమే చూసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఫీలవ్వాల్సిన అవసరమే లేదు. మనలో ఏ ఇగో లు లేనంతవరకు ఎవరేమనుకున్నా పట్టించుకోను. నువ్వూ పట్టించుకోకు.

ఆ తర్వాత ఇద్దరం ఒకే మాట మీద వున్నాం. ఎవరేమనుకున్నా మేం పట్టించుకోలేదు. మా జీవితాలు సాఫీగా, సంతోషంగా వెళ్లిపోతున్నాయి. నా భార్య తన ప్రొఫెషన్ లో పెద్ద స్థాయి కి వెళ్ళింది. ఈ మధ్యనే ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాం.

నేను ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా భారతీయ వంటకాల మీద పూర్తి సమయం వెచ్చించి, కొత్త కొత్తవి భిన్న రుచులతో ప్రయోగాలు చెయ్యటం మొదలెట్టాను.

తాను కొంచెం పెద్ద స్థాయి లో ఉండటం వల్ల EB2 నుంచి EB1 మారి గ్రీన్ కార్డు కి మార్గం సుగమం అయ్యింది.

ట్రింగ్ ట్రింగ్ మొబైల్ మోతతో ఈ లోకంలోకి వచ్చాను.

డాడీ, ఈ రోజు డిన్నర్ ఏమి ప్లాన్ చేస్తున్నావు. ఆఫీస్ నుంచి వస్తూ గ్రోసరీ స్టోర్ నుంచి ఏమన్నా తేవాలా?

వంట చేసేటప్పుడు ఒక్క రోజన్నా దగ్గరవుండవే, చూడు తర్వాత నువ్వు చెయ్యొచ్చు అంటే వినదు. అంతా అమ్మ పోలికే ఎప్పుడు కంప్యూటర్తో కుస్తీ పడుతూ ఉంటుంది.

డాడీ, నువ్వే చెయ్యి డాడీ బాగుంటుంది, నా వల్ల కాదు అంటుంది.

ఈ కూతురు మిసెస్ మొగుడు ఎవరో ఎక్కడున్నాడో అని నిట్టూర్చాను. కనీసం చిన్న కూతుర్నన్నా నాలాగా తయారు చేయాలనుకుని గట్టిగా నిశ్చయానికి వచ్చాను.

********

Posted in May 2024, కథలు

13 Comments

  1. Sreenivas

    మీకు నచ్చినందుకు చాలా సంతోషం నరసింహం గారు. నేను కూడా ఆస్టిన్ వాసినేనండీ. తప్పకుండా కలుద్దాం.

  2. D .Narahari Acharya

    భేషజాల్లేకుండా కథలోలా దంపతులిద్దరూ అవగాహనా పరులైతె చాలా బాగుంటుంది,ఈగోలకి వెళితే నరక ప్రాయమౌతుంది.కథ ద్వారా సలహాసందేశాన్నందించారు బాగుంది,దీనికి పొడగింపు ఎప్పుడో…,D

    • Sreenivas

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం నరహరి గారు. ఈ కథ పొడిగింపు గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ధన్యవాదములు

  3. తేజ

    వెరీ నైస్ శ్రీనివాస్ గారు. స్టోరీ టెల్లింగ్ తో పాటు గొప్ప మెసేజ్ ఇచ్చారు. భార్య భర్తల పట్ల అన్యున్యత మరియు ఒకరిని ఒకరు మోటివేట్ చేసుకుంటూ జీవితం లో ముందుకి సాగటం 👏🏻👏🏻

  4. Mamatha Yeleswaram

    చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది.

  5. Rao Penumudi

    చాలా బాగుంది IT – chef position. It’s big change from office pressure to home scheduling.

  6. గ.వె.ల.నరసింహం

    శ్రీనివాస్ గారి ‘ మిసెస్ మొగుడు’ కథ చాలా బాగుంది. స్వానుభవమా అన్నట్టు ఉంది. ఆయన నేనున్న ఆస్టిన్ వారంటే తప్పక పరిచయం చేసుకొంటాను.

    • Sreeni

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం నరసింహం గారు. నేను కూడా ఆస్టిన్ వాసినేనండీ. తప్పకుండా కలుద్దాం.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!