మొక్క జొన్న అంటే మనకు గుర్తుకు వచ్చేది రోడ్డు ప్రక్కన బండిమీద కాల్చి కారం ఉప్పు దట్టించిన కంకులు. లేదంటే సినిమాకి వెళ్ళినప్పుడు మనకు మంచింగ్ కొరకు తినే పాప్ కార్న్. అయితే మొక్క జొన్నతో అనేక విధములైన పదార్థాలు తయారౌతాయని నాకు ఈ మధ్యనే తెలిసింది. అది మీతో పంచుకోవాలని నా ఉబలాటం.
- మొక్కజొన్న లో ఉన్న తీపి పదార్ధం ‘డెక్ష్రోజ్’ ను వేరు చేసి దానితో ప్లాస్టిక్ లా సాగే సీలు తయారుచేసి, తిండి పదార్థాలను నిల్వ చేసే చిన్న చిన్న కంటైనెర్స్ మూతలు విడిపోకుండా వాడుతారు.
- ఇంటిని నిర్మించేటప్పుడు వాడే డ్రై వాల్, తేమ వలన చెడిపోకుండా మొక్కజొన్న నుండి తీసిన పదార్థాన్ని పూతగా వాడతారు.
- మొక్కజొన్న నూనెను కొన్ని రసాయనక చర్యలతో మారిస్తే ఏర్పడే ఆల్కైడ్ ను వార్నిష్ లో వాడతారు.
- మనం రోజూ ఉత్తరాలను పంపే కవర్లు అతికించేందుకు ఆ కవర్ల అంచులలో వాడే బంక పదార్ధం కూడా మొక్కజొన్న నుండే తయారుచేస్తారు. అందుకే మనకు నాలుకతో తడి చేసి అతికించడం అలవాటైనను ఇబ్బంది లేదు.
- ఇంకా మన టూత్ పేస్టు లలో, మందు గుళికలు తయారుచేయుటకు, చివరకు చిన్న పిల్లల డైపర్ లు తయారుచేయడానికి కూడా మొక్క జొన్నను వాడుతున్నారు. ఎందుకంటే మొక్కజొన్న కు తడిని పీల్చే గుణం ఎక్కువ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళితే మొక్కజొన్న వలన ఎన్నో ఉపయోగాలు.
పైన చెప్పిన పదార్థాల విషయం ఒక ఎత్తు. మరి మన రాజకీయ నాయకులు ఇప్పుడు మొక్కజొన్న వాడి తయారుచేసిన వాహనాలను తమ ప్రచారానికి కూడా వాడుకునే ఆలోచనలో ఉన్నారని ఈ మధ్యనే ఒక స్నేహితుని ద్వారా విన్నాను. బహుశా ఆ వాహనంలో ఇంధనం ఖర్చు లేకుండా చల్లగా ఉంటుందేమో!
చైనా వాసులు ఇంకొంచెం ముందుకు పోయి ముప్పైవేల మొక్క జొన్న కంకులతో ఏకంగా 30 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పుతో ఉండే ఒక ఇంటినే నిర్మించారు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక పెద్ద విశేషమై ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదండీ మన మొక్కజొన్న చరిత్ర.