Menu Close

page title

మీసాలపక్షి

మీసాలపక్షి

'ఇంకా టెర్న్‌' అనే పక్షిని ‘మీసాలపక్షి’ అని పిలుస్తారు. ఇది సముద్ర పక్షి. స్టెర్నిడే జాతికి చెందింది. ముదురు బూడిద రంగులో ఉంటుంది. ఇవి పెద్దవేం కాదు. సుమారుగా నలభై సెం.మీ.ఉంటాయి. వీటికి తెల్లటి మీసాల్లా ఈకలు పెరుగుతాయి. దానివల్ల దీనికి మీసాలపక్షి అనే పేరు వచ్చింది. మగ, ఆడపక్షులు రెండూ కూడా ఒకేలా ఉంటాయి. రెండింటికీ మీసాలు వస్తాయి. పిల్ల పక్షులకు మీసాలు ఉండవు. మనుషుల్లో మగవారికి యువకులయ్యాకే మీసాలు వచ్చినట్లుగా వీటికీ పెద్దయ్యాకే మీసాలువస్తాయి. కొండ అంచుల్లోను, పెంగ్విన్‌ పక్షులు వదిలేసిన చోట్ల ఇవి గూళ్లను పెట్టుకుంటాయి.

సాధారణంగా ఎవరికైనా వారి పెరుగుదల ఎత్తు, లావు, బరువులను బట్టి ఆరోగ్యం నిర్ణయిస్తే, ఈ మీసాల పక్షులకు వాటి మీసాల పొడవును బట్టి అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తెలుస్తుందిట! వీటి అరుపు మాత్రం చిత్రంగా పిల్లి కూతలా ఉండటం విశేషం. ఇవి చలికి వెరవవు. పెరూ, చిలీ దేశాల పసిఫిక్ మహా సముద్ర తీరాల్లో ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. వీటి సంఖ్య దాదాపు 150,000. కానీ వీటి సంఖ్య తగ్గుతున్నదని పర్యావరణ పరిరక్షణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

మీసాలపక్షి

ఈ పక్షుల జీవితకాలం 12-14 సంవత్సరాల వఱకూ ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని మీసాల పక్షులు 21 ఏళ్ల వరకు కూడా బతకగలవు. కానీ అకాల మరణం సంభవిస్తే ఏమీ చేయలేము. ఆకాశంలో విహరిస్తూ సముద్రంలోకి చూస్తూ చిన్న చేపలు కనిపించగానే హటాత్తుగా క్రిందికి తారాజువ్వలా వాలిపోయి నీటి మీదకు చేపలు రాగానే ఒక్క ఉదుటున ముక్కుతో పట్టుకుని తింటాయి. వీటికి ఈత రాదు కానీ, నీటిమీద తెప్పలో కూర్చున్నట్లుగా తేలుతూ కూర్చోగలవు. ఇవి పెద్ద దొంగపక్షులు, ఎందుకంటే ఇతర పక్షులు సేకరించి దాచుకున్న ఆహారాన్ని గుట్టుగా తినేస్తాయి. వేటాడి తినను బధ్ధకం. నీటిమీది చేపల్ని లాక్కొచ్చి విందు చేసుకుంటాయి. మగ పక్షులు గాలిలో తమాషాగా విన్యాసాలు చేసి ఆడ పక్షులను మెప్పించి, మురిపించి ప్రపోజ్‌ చేసి, జతకట్టాక జీవితాంతం జంటగా కలిసి ఒక్కరితోనే ఉంటాయి. ఎంత నీతి! వీటినుంచీ మనం నేర్చుకోవలసింది ఏక పత్నీ, పతీ వ్రతం. కాదంటారా! వీటి నీతి ఎంత గొప్పది!

Posted in October 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!