ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఓ పాము, అందులో ఒకరి కాలుపై కాటు వేసింది. ఎలా జరిగిందో ఏమో అనుకోని ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టులయ్యారు వారు. గబుక్కున కౌషిక్ రాయి తీసుకుని పామును చంపబోయాడు.
"వద్దు కౌషిక్ మూగ జీవుల్ని చంపకూడదు." అంటూ కౌషిక్ ని వారించాడు దినేష్.
"అది మనల్ని గాయపరిచిందిగా. దాన్ని ఊరికే వదిలేయాలా?" అడిగాడు కౌషిక్.
"వదిలేయాలి చీకట్లో చూడకుండా దానిని తొక్కి ఉంటారు. పాపం దానికి నోరు లేదుకదా! అరవడానికి అందుకే కరిచి ఉంటుంది." అన్నాడు దినేష్.
"ఒరేయ్ ఇప్పుడు వాదులాటలెందుకు ముందు ఫస్ట్ ఎయిడ్ సంగతి చూడండి." అంటూ తన జేబు లో ఉన్న రుమాలు తీసి గాయానికి కొంచెం పైగా కట్టుకట్టాడు చరణ్.
దినేష్ పళ్ళతో ఆ గాయం దగ్గర వత్తి విషాన్నిగట్టిగా పిల్చి ఉమ్ముతున్నాడు.
శార్వాణి లో ఉన్న భయం మాయమయి పోయింది. గాయపడిన అతనికి తనకు తోచిన రీతిగా సహకరించాలనే తపన...వారు ఎవరు? ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నలను అణచివేసింది.
గబగబా వెతికి కాకి దొండాకులను తీసుకొచ్చి పసరు పిండి ఆ వ్యక్తి గాయానికి పూసింది.
"శర్వాణి ఏం చేస్తున్నావ్? ఇలాంటి నాటు వైద్యం చేయకూడదు. పాముకరిస్తే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లి ఇంజక్షన్ చేయించాలి." అంటూ శర్వాణి చేస్తున్న పనిని ఆపబోయాడు కౌషిక్.
"లేదు కౌషిక్ తగ్గిపోతుంది మేము ఇలాగే వైద్యం చేసుకుంటాము." అన్నాడు దినేష్.
వచ్చిన వాళ్లు పిల్లలు చేస్తున్న పనిని సంబ్రమంగా చూస్తున్నారు. ముక్కు మొహం తెలియకపోయినా...... వారు పడే తాపత్రయం, ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యమేసింది వారికి.
పిల్లలు చూస్తుండగానే గాయపడిన అతనికి గాయం కనబడకుండా మాయమయ్యింది. మళ్లీ వీళల్లో భయం మొదలైంది.
"హాయ్... మేము మీ స్నేహితులం...భయపడకండి". అన్నారు వాళ్ళు.
"హాయ్ మీకు తెలుగు వచ్చా.!?!” సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు చరణ్.
"మాకు అన్ని భాషలు వచ్చు అందరి గురించి మాకు తెలుసు అన్నాడు" పాముకాటుకు గురైన వ్యక్తి. చూడటానికి వారి ముగ్గురిలో ఈయనే పెద్దలాఉన్నారు. అతడే కల్పించుకుంటూ "ముందు మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాం. నా పేరు మేథా. వారిలో పొడవుగాఉన్న వ్యక్తిని చూపిస్తూ...“అతని పేరు క్రేన్” అని పొట్టిగా వున్న వ్యక్తి ని చూపిస్తూ “ఇతని పేరు డింగు. మేము అంతరిక్ష వాసులం. మమ్మల్ని ఎంతో ముద్దుగా మీరు ఏలియన్స్ అని పిలుచుకుంటూ ఉంటారుగా!
మా ఫ్లయింగ్ సాసర్ కి ట్రబుల్ వచ్చి అనుకోకుండా ఇక్కడ ల్యాండ్ అయ్యాం ... మీ కంట పడ్డాము."
అని చెప్పాడు పెద్దమనిషి లా ఉన్న వ్యక్తి.
"నా పేరు...... "చెప్పబోతున్న చరణ్ ను వారించి "మీ..పేర్లు నాకు తెలుసు." అన్నాడు మేథా.
"నీ పేరు శార్వాణి వాడి పేరు కౌషిక్ కదా!" అంటూ వారివైపు వేలు పెట్టి చూపుతూ అన్నాడు క్రేన్.
భయపడుతున్న దినేష్ వంక చూస్తూ "ఓయ్ దినేష్ మమ్మల్ని ఏ సుడిగుండాలు ఎత్తుకు పోవు మేమే ఆ సుడిగుండాలను సృష్టించగలం లేకుండా చేయగలం తెలుసా నీకు... " అన్నాడు పొట్టిగా ఉన్న డింగూ.
అంతే దినేష్ లాగూ తడిసిపోయింది. గజగజ వణికిపోతున్నాడు.
“ఏయ్ భయపడక మిమ్మల్ని ఏం చెయ్యం.” అన్నాడు క్రేన్.
“నువ్వు చదివిన ఆకారాలకు మాకు పోలిక లేదని ఆశ్చర్య పోతున్నావా చరణ్” అంటూ చరణ్ వంక చూసాడు మేథా.
అవును లేదు ఏం చెప్పాలో అర్థంకాక చరణ్ తలను అడ్డదిడ్డంగా ఊపాడు.
"మా మనసులో మాట ఎలా చెప్పగలుగుతున్నారు?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు చరణ్.
"మేము మీ మనసులో మాట చెప్పగలం. మీ గురించి చెప్పగలం... అన్ని మాకు తెలుసు." అన్నాడు మేథా.
"అవునా మా జాతకం చెప్పగలరా మీరు" అడిగాడు చరణ్.
"ఓ తప్పకుండా చెప్పగలం". అన్నాడు క్రేన్.
"అయితే నేను పెద్దయ్యాక ఏమవుతానో చెప్పు చూద్దాం."... అన్నాడు కౌషిక్.
"ముసలి వాళ్ళవుతారు" అన్నాడు డింగూ.
“అబచా మాకు తెలియదు లే" అన్నాడు చరణ్.
"భవిష్యత్తు గురించి తెలుసుకునే అర్హత పిల్లలకు లేదు నాన్నా" అన్నాడు మేథా.
"ఏం ఎందుకు లేదు నా జాతకం ఎప్పుడో చెప్పేసింది నాకు నా కంప్యూటర్." అన్నాడు కౌషిక్.
"కళ్ళు, నోరు లేని యంత్రం కదా ఎవరిమాటయినా అది వినేస్తుంది" అన్నాడు డింగూ.
"మీరు ఆ...పైనుంచే వచ్చారు కదా...! అక్కడి నుంచి చూస్తే మేమెలా కనిపిస్తాము..? ఆ అందమైన ఆకాశం, చందమామ, నక్షత్రాలు.... ఇవన్నీ మీరు రోజు చూస్తారా" అమాయకంగా అడిగాడు దినేష్..
"ఆ.. మేము అక్కడి నుంచే వచ్చేది" అన్నాడు క్రేన్.
"మీరు విశ్వంలో వింతలు చూడాలనుకొంటున్నారా"....అడిగాడు మేధా
“ఆ అవును” తలవూపింది శార్వాణి.
"అయితే మిమ్మల్ని మాతో తీసుకుని వెళ్ళి అన్నీ చూపిస్తాం వస్తారా?" అడిగాడు డింగూ..
"అమ్మో కొత్తవాళ్ళతో వెళ్ళకూడదని మా అమ్మ చెప్పింది మేము రాము." అన్నాడు దినేష్..
"మేము మీ దోస్తులం గా." అన్నాడు డింగూ.
"అమ్మో మేము రాము... ఆలస్యమైతే ఇంట్లో తంతారు" అంది శార్వాణి.
"మీరేం భయపడకండి మేము మీ కాలాన్ని స్తంభింప చేస్తాము. మాతో మీరు వచ్చిన విషయం మీకు తప్ప ఎవరికి తెలియదు" అన్నాడు క్రేన్.
"ఎలా .."ఆశ్చర్యం గా అడిగాడు కౌషిక్.
"అది మా టెక్నాలజీ మీకు అర్థం కాదు. మేము మానవులను కాంతి గా మార్చి మా లోకం తీసుకువెళ్తాము. భూమిపై వారి టైమును స్తంభింప చేస్తాము. అంటే మీరు మా దగ్గర వారం రోజులు ఉన్నారనుకోండి, ఆ వారం రోజుల టైమును వెనక్కి తిప్పుతాం" అన్నాడు క్రేన్.
"అమ్మో...!" కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా గుండెల మీద రెండు చేతులు వేసుకుంటూ
"నిజంగా" అంది శార్వాణి.
"నిజంగా నిజం" అన్నాడు డింగూ.
"మరి మమ్మల్ని కాంతిగా మార్చి తీసుకువెళితే....మేము ఏం చూస్తాం ...? మాకు అంతరిక్షంలో ఉన్న అద్భుతాలు చూడాలని ఆశ" అన్నాడు చరణ్.
"ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిన మీ శరీరం ఆ వాతావరణం ను తట్టుకోలేదు. అందుకే అలా మార్చి మిమ్మల్ని తీసుకుని వెళ్లి మా గ్రహంలో మీకు అనుకూలంగా ఏర్పాటుచేసిన వాతావరణంలో మిమ్మల్ని ఉంచుతాం” అన్నాడు క్రేన్.
"అంటే మమ్మల్ని పూర్వం విఠలాచార్య సినిమాలలో కామిని, మోహినీ లాంటి దెయ్యాలు మనుషులను మార్చేస్తారే అలాగా....." అన్నాడు కౌషిక్.
"కొంపతీసి మీరేమన్నా చెడ్డవాళ్ళా ఏంటి భయంగా" అన్నాడు దినేష్.
"నీకాభయం అక్కరలేదు. మేము మంచి వాళ్ళం. మమ్మల్ని నమ్ము" అన్నాడు డింగూ.
"ఏలియన్స్ అందరూ ఒకే రకమైన వాళ్ళు కదా మంచి ఏంటి చెడేంటి?” అన్నాడు కౌషిక్.
"మీ మానవుల్లో లాగానే మా ఏలియన్స్ లో కూడా మంచి చెడు అనే రెండు వర్గాలు ఉంటాయి." చెప్పాడు డింగూ.
"అది ఎక్కడైనా ఉన్నదే కదా!" అన్నది శార్వాణి.
"ఏలియన్స్ అందరూ ఒకదగ్గరే ఉంటారా? ఒకలాగే ఉంటారా? "అడిగాడు చరణ్.
"ఏలియన్స్ అంటేనే గ్రహాంతరవాసులు. మేము మూడు రకాల వాళ్ళం. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాం." అన్నాడు క్రేన్.
"ప్లీజ్ ప్లీజ్ మాకు మీ వివరాలు చెప్పరా?" కుతూహలంగా అడిగాడు చరణ్.
"మాలో గ్రేస్, రెప్టెలియన్స్, నోర్డిక్ ఏలియన్స్ అని మూడు రకాలు. మేము గ్రేస్ అంటే బూడిద రంగు ఏలియన్స్ మి. మేము హోవ్బేస్నుజీటారెటియులి అని పిలిచే భూగ్రహవాసులం. మమ్మల్ని జీటారెటియులీ ఏలియన్స్ అని కూడా పిలుస్తారు.
ఇక పోతే రెండో రకం వాళ్ళు రెప్టేలియన్స్ చెడ్డవాళ్ళు అని చెప్పాను కదా వాళ్లే వీళ్ళు. డ్రాకో కూటమి నుండి వస్తారు. మీ భూమికి అడుగునే వీరి నివాసం. మీరు పిలిచే డ్రాగన్స్ వీరే. చైనీయులు వీరిని దేవతగా కొలుస్తారు. ఇక మూడవ వారు నోర్డిక్ ఏలియన్స్. వీరి కళ్ళు వైలెట్, పింక్, ఎరుపు, ఆకుపచ్చ, ఊదా రంగులో ఉంటాయి." వివరణ ఇచ్చాడు మేథా.
"మేము మంచి వాళ్ళము మమ్మల్ని మీరు నమ్మండి." అన్నాడు క్రేన్.
"నిజంగా మీరు మంచి వాళ్లేనా?" అనుమానంగా అడిగింది శార్వాణి.
"ఇది మీకో మంచి అవకాశం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. మీలో ఉన్న మీ మంచి మనస్సు మాకు నచ్చి తీసుకు వెళ్దాం అనుకున్నాం. ఇలా మిమ్మల్ని మాలోకం తీసుకెళ్ళడం మాకు కష్టమే ..అయినా మీ ప్రేమ మమ్మల్ని కరిగించి వేసింది. అందుకే మీకీ అవకాశం ఇచ్చాం. అయినా మంచివాళ్ళం కాకపోతే మీకు తెలియకుండా మిమ్మల్ని ఎత్తుకు పోయే వాళ్ళం కదా!" అన్నాడు డింగూ.
"మా అమ్మ వాళ్లు కంగారు పడకుండా చూడాల్సిన బాధ్యత మీదే" అన్నాడు దినేష్.
"ఇంకేం అప్పగింతలు లేవా పదరా...పోదాం పోయా వింత లోకాలు చూసి వద్దాం" కుతూహలంగా అన్నాడు చరణ్.
"మమ్మల్నిఇలాగే తీసుకెళ్ళరా ప్లీజ్ "అన్నాడు కౌషిక్.
సరే అయితే ఈ హెల్మెట్స్ పెట్టుకోండి అంటూ నలుగురికీ నాలుగు ఏంటీనాలు కలిగిన హెల్మెట్స్ లాంటి వాటిని వారి తలలకు అమర్చారు.
ఆ హెల్మెట్ వాళ్ళ తల మీద పెట్టుకో గానే వాళ్ళ మనసులో ఉన్న భావాలు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి.
“ఒరేయ్ మా అమ్మ ఇంట్లో ఏం చేస్తోందో అనుకున్నారా అంతే మా అమ్మ ఇంట్లో పకోడీలు వేస్తూ కనిపించింది” అన్నాడు ఆశ్చర్యంగా చరణ్.
"అవును మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళు మీకు కనబడతారు అంతే కాదు మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా అక్కడకు క్షణాలలోవెళ్లి పోగలరు" అన్నాడు మేథా.
"భలే భలే బాగుందే" అన్నాడు గెంతుతూ కౌశిక్.
"దీనికే... ఇంకా ఎన్నో వింతలు విశేషాలను మీకు చూపిస్తాం" అన్నాడు క్రేన్.
అందరూ కలసి ఫ్లైయింగ్ సాసర్ దగ్గరకు వెళ్లారు.