స్త్రీల పట్ల వివక్ష
యది స్త్రీ యద్యవరజః శ్రేయః కించిత్సమాచరేత్ |
తత్సర్వమాచరేద్యుక్తో యత్ర చాస్య రమేన్మనః || (2- 223)
ఒక స్త్రీ గానీ అవరజుడు (కింది వర్ణానికి చెందినవాడు) గానీ ఏదైనా శ్రేయోదాయకమైన మంచి కార్యం చేయాలని తలపెడితే దానిని చిత్తశుద్ధితో చేయాలి. తన మనసుకు ఆనందం కలిగించేది, అదే సమయంలో ధర్మశాస్త్రం ప్రకారం తప్పు కానట్టి ఏ పని చేయాలనిపిస్తే దానిని వారు చేయవచ్చు.
శూద్రులకు, అన్ని వర్ణాల స్త్రీలకు మనువు కాలంనాటి సమాజంలో మిగిలిన వర్ణాల పురుషుల కంటే తక్కువ ప్రతిపత్తి ఉందనే దానికి ఇదే తార్కాణం. నాటి పురుషాధిక్య సమాజంలో అగ్ర వర్ణాలవారిలోనూ ప్రాముఖ్యమంతా పురుషులదే. స్త్రీలు అన్ని విషయాలలోనూ శూద్రులతో సమానులుగానే చూడబడ్డారు. వారికి యజ్ఞోపవీతార్హత లేని కారణంగా వారు శూద్రులుగానే భావించబడ్డారు. దీనిని విమర్శిస్తూనే ప్రజాకవి వేమన ఏమన్నాడో చూడండి.
తల్లిగన్నతల్లి తనతల్లి పినతల్లి
తండ్రిగన్న తల్లి తాతతల్లి
ఎల్ల శూద్రులైరి తానేటి బాపడు ?
విశ్వదాభిరామ వినురవేమ.
ఇంతమంది శూద్రస్త్రీలకు పుట్టినవాడు తానెలా బ్రాహ్మణుడౌతాడని వేమన ప్రశ్న.
‘భగవద్గీత’ లోనూ ‘పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాన్తి పరాం గతిమ్’ అంటూ మోక్షసాధన విషయమై పాపయోనిలో జన్మించిన వారిని, అన్ని వర్ణాల స్త్రీలను, వైశ్యులను, శూద్రులను ఒకే గాట కట్టడం కూడా గమనార్హం.( భగవద్గీతా - రాజవిద్యా రాజగుహ్య యోగం - 9-32) ప్రాచీన భారతీయ సమాజంలో నిమ్నవర్ణాలకు చెందిన స్త్రీ పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండేదో అగ్రవర్ణాలకు చెందిన స్త్రీల పట్ల కూడా అదే తరహా వివక్ష ఉండేది.
పురుషార్థాలలో ఏది శ్రేష్ఠం?
ధర్మము, అర్థము, కామము, మోక్షము - ఈ నాలుగింటినీ ప్రాచీనులు పురుషార్థములుగా పేర్కొన్నారు. విజ్ఞులు కొంతమంది ఐహిక జీవితంలో ధర్మము, అర్థము అనే పురుషార్థముల సాధనే శ్రేష్ఠమని భావిస్తారు. మరికొందరు అర్థ, కామముల సాధనే శ్రేష్ఠమంటారు. కామము (భౌతిక ప్రపంచంలోని వస్తువులపై కోరిక) ను తీర్చుకుంటూ వీలైనంత సంపద పోగేయడం శ్రేయస్కరమని వారి భావన. ఇంకొందరు ఐహిక ప్రపంచంలో ధర్మసాధన మాత్రమే శ్రేయోదాయకమంటారు. ఇంకా కొందరు అర్థ సముపార్జన మాత్రమే ఐహిక జీవిత పరమార్థమంటారు. కానీ సరైన నిర్ణయం మాత్రం మోక్షప్రదములైన ధర్మార్థకామములనే మూడు పురుషార్థములూ శ్రేయోదాయకములే.
బ్రహ్మచారి - పెద్దల పట్ల గౌరవం
ప్రత్యేకించి ఒక బ్రాహ్మణుడు - తన ఆచార్యుడు, తల్లిదండ్రులు, అన్న తనను ఎంతగా నొప్పించినా తాను మాత్రం ఆ పెద్దలపట్ల ఎట్టి పరిస్థితులలోనూ అమర్యాదకరంగా ప్రవర్తించరాదు.
ఆచార్యుడు బ్రహ్మస్వరూపుడు. తండ్రి హిరణ్యగర్భుడైన ప్రజాపతి స్వరూపుడు. తల్లి భూదేవి స్వరూపిణి. అన్న ఆత్మ స్వరూపుడు. వీరంతా దేవతారూపులు. అందుకే వీరిని తిరస్కరించ కూడదు.
తమ బిడ్డలకోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడతారు. తల్లి బిడ్డను తన గర్భంలో పదినెలలు మోస్తుంది. ప్రసవవేదనను అనుభవించి ఆ బిడ్డ జన్మకు కారణం అవుతుంది. తండ్రి పసితనంలో తన బిడ్డను సంరక్షించడం, ఉపనయనం మొదలైన సంస్కారాలు చేయడం, వేదవిద్యలు నేర్పించేందుకు కృషిచేయడం వంటివి చేస్తాడు. వీరిరువురూ పడే శ్రమకు పరిహారం వందేళ్ళలోనైనా వారి పిల్లలు తీర్చుకోలేరు.
అట్టి తల్లిదండ్రులకు, గురువుకు శిష్యుడు ఎప్పుడూ ప్రీతి కలిగించాలి. ఆ ముగ్గురూ సంతుష్టి చెందితే బ్రహ్మచారి చేసే తపస్సులన్నీ ఫలించినట్లే.
వారు ముగ్గురికీ శుశ్రూషలు చేయడమే ఒక బ్రహ్మచారి చేయదగిన అత్యుత్తమమైన తపస్సు. ఏ ఇతర పుణ్యకార్యములైనా ఆ ముగ్గురి అనుమతి లేకుండా చేయరాదు.
ఎందుకంటే వారే లోకత్రయ ప్రాప్తికి హేతువులు కనుక వారే ముల్లోకములు. వారే మూడు ఆశ్రమ ధర్మాలు. వారే మూడు వేదాలు (త్రయీ విద్యలు). వారే యజ్ఞాది ఫలదాతలు కనుక వారే మూడు పవిత్రాగ్నులు (త్రేతాగ్నులు). భూలోకము, అంతరిక్షము (అంతరాళము), బ్రహ్మలోకము అనే మూడింటినీ ముల్లోకములు లేక ముజ్జగములు అంటారు.
తండ్రి గార్హపత్యము అనే అగ్ని. తల్లి దక్షిణాగ్ని. గురువేమో ఆహవనీయాగ్ని. మాతాపితృగురు రూపములైన, మిక్కిలి శ్రేష్ఠములైన ఈ మూడు అగ్నులనూ త్రేతాగ్నులు అంటారు.
ఈ ముగ్గురి విషయంలో ఎలాంటి తప్పిదం లేకుండా వారికి శుశ్రూషలు చేసుకునే బ్రహ్మచారి ముల్లోకాలలో మేటిగా నిలుస్తాడు. వారు మువ్వురికీ సేవలు చేసే గృహస్థు కూడా దివ్యశరీరము కలవాడై సూర్యాది దేవతలలాగే స్వర్గంలో దివ్య తేజస్సుతో వెలుగొందుతాడు.
ప్రతి వ్యక్తి తన తల్లికి చేసే శుశ్రూషల కారణంగా భూలోకాన్ని, తన తండ్రికి చేసే సేవల కారణంగా మాధ్యమాన్ని (అంతరిక్షాన్ని), తన గురువుకు చేసే శుశ్రూషల వలన బ్రహ్మలోకాన్ని పొందుతాడు.
ఈ ముగ్గురినీ ఆదరించిన వ్యక్తి తన ఐహిక విధులన్నీ నిర్వర్తించినట్లే. జనులందరినీ ఆదరించినట్లే. ఈ ముగ్గురినీ ఆదరించనివాడు శ్రుతులలోనూ, స్మృతులలోనూ చెప్పబడిన శ్రౌత, స్మార్త కర్మలను ఎన్నింటిని ఆచరించినా నిష్ఫలమే.
ఈ ముగ్గురూ ఎంతవరకు జీవించి ఉంటారో, అంతవరకు వేరే ధర్మమును వారి అనుమతి లేకుండా చేయరాదు. ప్రతిరోజూ ఒక బ్రహ్మచారి ఈ ముగ్గురికీ ప్రియమైన, హితమైన కార్యాలు చేస్తూ, వారికి శుశ్రూషలు చేయాలి.
ఈ ముగ్గురి శుశ్రూషకు ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటూ బ్రహ్మచారి వారికి పరలోక ప్రాప్తి చేకూర్చే పనులను మనోవాక్కాయకర్మల ఏకీభావంతో ఆచరిస్తూ ఎప్పటికప్పుడు వారికి తాను చేసే పనులను నివేదిస్తూ ఉండాలి.
ఈ ముగ్గురికీ శుశ్రూషలు చేయడమే బ్రహ్మచారి ముఖ్య ధర్మము. తక్కిన యజ్ఞాది కర్మలన్నియు అముఖ్యధర్మములే.
తన తల్లిదండ్రులు, గురువు పట్ల ఒక బ్రహ్మచారి ఎంత వినయ విధేయతలతో మెలగాలో మనువు చాలా స్పష్టంగా నిర్దేశించాడు. బ్రహ్మచారి చేసే ఏ కార్యమైనా వీరి మువ్వురి అనుమతిలేకుండా చేయరాదనే నియమం కారణంగా వర్ణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. అన్నిటా ప్రశ్నించడం కాకుండా కేవలం అనుసరించడానికే ప్రాధాన్యం ఇవ్వబడింది.
మంచి ఎక్కడున్నా గ్రహించాలి
శ్రద్ధగలవాడు తనకంటే తక్కువవాని దగ్గరనుంచైనా ఉత్తమవిద్యను గ్రహించాలి. ఉత్తమ ధర్మాన్ని అంత్యజుని (నిమ్నజాతి వాడు) నుంచైనా నేర్చుకోవాలి.
తక్కువ కులస్థుడి నుంచైనా స్త్రీరత్నాన్ని స్వీకరించాలి.
విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితమ్ |
అమిత్రాదపి సద్వృత్తమమేధ్యాదపి కాంచనమ్ || ( 2- 239 )
విషంనుంచైనా సరే అమృతాన్ని, బాలుని నుంచైనా సుభాషితాన్ని, శత్రువు నుంచైనా సదాచారాన్ని, అమేధ్యము నుంచైనా బంగారాన్ని గ్రహించాలి. అమేధ్యము లేక అశుద్దము అంటే విసర్జిత పదార్థము (Excrement - మలము).
స్త్రియో రత్నాన్యథో విద్యా ధర్మశ్శౌచం సుభాషితమ్ |
వివిధాని చ శిల్పాని సమాదేయాని సర్వతః || ( 2- 240)
స్త్రీలు, రత్నాలు, విద్య, ధర్మము, శౌచమునకు సంబంధించిన నియమాలు, సుభాషితాలు, వివిధ శిల్పాలు (ఇక్కడ శిల్పాలు అంటే వివిధ కళలు - వచో శిల్పం, రచనా శిల్పం వంటివి), ఎక్కడున్నా (ఎవరి నుంచైనా) వాటిని మనం స్వీకరించవచ్చు.
ఆపత్కాల విద్యాసముపార్జన నియమాలు
అబ్రాహ్మణాదధ్యయనమాపత్కాలే విధీయతే |
అనువ్రజ్యా చ శుశ్రూషా యావదధ్యయనం గురో : || ( 2- 241)
ఆపత్కాలంలో ఒక బ్రాహ్మణ విద్యార్థి అబ్రాహ్మణుడైన (క్షత్రియ, వైశ్య) గురువు దగ్గర కూడా (వేదవిద్యలు) అభ్యసించవచ్చు. అయితే అప్పుడు ఆ గురువుకు శిష్యుడు వేదాధ్యయనము ముగిసే వరకు శుశ్రూషగా కేవలం ‘అనువ్రజము’ మాత్రమే చేయాలి.
పాద ప్రక్షాళనము (గురువు కాళ్ళు కడగడం), ఉచ్ఛిష్ట భోజనము (గురువు తిని వదిలేసిన ఎంగిలి తినడం) వంటివి చేయరాదు.
అనువ్రజము అంటే పెద్దల పట్ల గౌరవంతో వారిని అనుసరించి నడవడం. మన ప్రాచీనులు ప్రత్యేకించి పెద్దలను సాగనంపే సమయంలో గౌరవసూచకంగా ఏదైనా నదీతీరం లేక సరస్తీరం వరకు ఆ పెద్దల వెనుక నడిచే వారు. దీనినే ‘అనువ్రజము’, ‘అనువ్రజనము’, ‘అనువ్రజ్యా’ అని కూడా అనేవారు.
నాబ్రాహ్మణే గురౌ శిష్యో వాసమాత్యంతికం వసేత్ |
బ్రాహ్మణే చాననూచానే కాంక్షన్ గతిమనుత్తమామ్ || ( 2- 242).
మోక్షం అనే ఉత్తమ గతిని పొందగోరే బ్రహ్మచారి ఆపత్కాలంలో తప్ప జీవితకాల పర్యంతం ఒక అబ్రాహ్మణుడైన గురువు దగ్గర శుశ్రూషలు చేయరాదు. అలాగే సాంగ వేదాధ్యయనము చేయని బ్రాహ్మణ గురువు వద్ద కూడా జీవితాంతం శుశ్రూషలు చేయరాదు.
వాసము - గురువు ఇంట్లో నివసించడం. ఆత్యంతికమ్ - చివరివరకు.
అనూచానుడు - ఆరు వేదాంగములతో సహా వేదములను అధ్యయనము చేసినవాడు. అననూచానుడు - అలా అంగములతో సహా వేదాలను అధ్యయనం చేయనివాడు.
శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము - ఈ ఆరింటినీ వేదాంగములు అంటారు. వేదాలను ఈ ఆరు అంగాలతో సహా అధ్యయనం చేయడాన్ని సాంగ వేదాధ్యయనము అంటారు. (స + అంగ = సాంగ - అంగములతో సహా). మీమాంస, న్యాయము ( Logic - తర్కము), పురాణము, ధర్మశాస్త్రము - ఈ నాలుగింటిని వేదోపాంగములు అంటారు. వేదాలను ఆరు అంగాలతో, నాలుగు ఉపాంగాలతో సహా అధ్యయనం చేస్తే దానిని సాంగోపాంగంగా వేదాధ్యయనం చేయడం అంటారు.
మరిన్ని బ్రహ్మచర్య నియమాలు
నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతమును ఆచరించగోరే శిష్యుడు ఆత్యంతికము (చిట్ట చివరివరకు) గురుకులంలోనే ఉంటూ, శరీరం విమోక్షణం అయ్యేవరకు (జీవితాంతం) గురు శుశ్రూష (గురువుకు సేవలు) చేస్తూనే ఉండాలి.
ఆ సమాప్తేశ్శరీరస్య యస్తు శుశ్రూషతే గురుమ్ |
స గచ్ఛత్యంజసా విప్రో బ్రహ్మణస్సద్మ శాశ్వతమ్ || ( 2-244)
తన శరీరం నశించేవరకు ఏ శిష్యుడైతే తన గురువుకు శుశ్రూషలు చేస్తాడో, ఆ విప్రుడు తక్షణం శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతాడు.
(ఆ సమాప్తేశ్శరీరస్య = శరీరం నశించేవరకు ; అంజసా - నేరుగా, తక్షణం; గచ్ఛతి - వెళతాడు; సద్మ - గృహము; బ్రహ్మణస్సద్మ - బ్రహ్మ ఇల్లు అంటే బ్రహ్మలోకం)
వేదాధ్యయనము చేయుటకు ముందు శిష్యుడు గురువుకు ఎలాంటి దక్షిణ ఇవ్వరాదు. వేదాధ్యయనం ముగిసిన తరువాత అతడు వివాహం చేసుకొనగోరితే బ్రహ్మచర్య వ్రత దీక్షను గురువు అనుమతితో విరమించి, గురువు కోరిన దక్షిణ ఆయనకు ఇవ్వాలి.
గురుదక్షిణ
క్షేత్రం హిరణ్యం గామశ్వం ఛత్రోపానహమాసనమ్ |
ధాన్యం శాకం చ వాసాంసి గురవే ప్రీతిమావహేత్ || ( 2- 246)
క్షేత్రం(భూమి}, హిరణ్యం (బంగారము), గాం (గోవులు), అశ్వం (గుర్రం), ఛత్రోపానహమ్ - ఛత్రం, ఉపానహం - ఛత్రం (గొడుగు), ఉపానహం (పాదరక్షలు), ఆసనం(కూర్చునే కుర్చీ వంటివి), ధాన్యం (వడ్లు, మొక్కజొన్నలు, గోధుమల వంటి ఆహారధాన్యాలు), శాకం (కూరగాయలు), వాసము (వస్త్రము, ఇల్లు) - ఇలాంటి గురుదక్షిణలు గురువుకు ప్రీతిని చేకూరుస్తాయి.
నైష్ఠిక బ్రహ్మచర్యం
ఆచార్యే తు ఖలు ప్రేతే గురుపుత్రే గుణాన్వితే |
గురుదారే సపిండే వా గురువద్వృత్తిమాచరేత్ || ( 2- 247)
నైష్ఠిక బ్రహ్మచర్యం పాటిస్తూ ఆజీవితం గురువుకు శుశ్రూషలు చేసే విద్యార్థి, తన గురువు మృతి చెందితే గుణాన్వితుడగు గురుపుత్రుడికి, గురుపత్నికి, లేక గురువు యొక్క సపిండునికి అంటే ఏడు తరాలలోపలి జ్ఞాతి (గురువు సన్నిహిత బంధువు) కి తన దేహాంతం వరకు తన గురువు జీవించి ఉండగా చేసినట్లే శుశ్రూషలు చేయాలి.
గుణాన్వితుడైన గురుపుత్రుడు, గురుపత్ని, గురువు సపిండుడు లేకపోయినా లేక వారు సైతం మరణించినా, గురువు హోమం చేసిన అగ్ని కుండం వద్ద పగటిపూట నిలబడి, రాత్రిపూట ఏదైనా ఆసనంలో కూర్చుని అగ్నిలో హోమం చేస్తూ తన జీవితాంతం అగ్ని శుశ్రూష చేయాలి.
ఈ ప్రకారం నడచుకుంటూ ఏ విప్రుడయితే అవిప్లుతముగా (ఎలాంటి అంతరాయము లేకుండా), ఏమరుపాటు లేకుండా, నిష్ఠగా తన బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తాడో, అలాంటి నైష్ఠిక బ్రహ్మచారికి మరణానంతరం ఉత్తమలోకం ప్రాప్తిస్తుంది. అతడికి పునర్జన్మ కూడా ఉండదు.