వర్ణ ధర్మములు
అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా |
దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానా మకల్పయత్ || ( 1-88 )
అధ్యాపనము అంటే వేదాలు, ఇతర శాస్త్రాలు బోధించడం, అధ్యయనం అంటే తాము చదువుకోవడం, యజనం అంటే యజ్ఞములు చేయటం, యాజనము అంటే యజ్ఞములు చేయించడం, దానం అంటే ఇతరులకు దానంచేయడం, ప్రతిగ్రహం అంటే ఇతరుల నుంచి దానాలు స్వీకరించడం - ఈ ఆరింటినీ షట్కర్మలు అంటారు. ఈ ఆరూ బ్రాహ్మణుల విశేష అధికారాలు (Exclusive Rights or Prerogatives). ఇక్కడ ‘బ్రాహ్మణానామ్ అకల్పయత్’ అని ప్రయోగించడం కారణంగా ఈ ఆరూ బ్రాహ్మణుల విధులు కావనీ, అవి వారిని సృష్టించిన సందర్భంగా బ్రహ్మ బ్రాహ్మణులకు కల్పించిన విశేష అధికారాలనీ వివరణ ఇవ్వబడ్డది. (అకల్ప అనే సంస్కృత పదానికి ‘అడ్డూ అదుపూ లేని’ అని అర్థం. Unrestrained, Unfettered, Not subject to any control or rules).
వర్ణ విభజన సిద్ధాంతానికి ఆద్యుడు మనువు కాదు. ఋగ్వేదంలోని పదవ మండలంలోని పురుష సూక్తం సమాజాన్ని ఒక పరస్మై పురుషునిగా ఎంచి, బ్రాహ్మణులు ఆ పురుషుని నోటిగానూ, క్షత్రియులు అతని బాహువులుగానూ, వైశ్యులు అతని ఊరువులు (తొడలు) గానూ, శూద్రులు ఆ పురుషుని పాదాలుగానూ భావించబడ్డారు. ఇదే భావన యజుర్వేద, అథర్వ వేదాలలోనూ కనిపిస్తుంది.
బ్రాహ్మణో అస్య ముఖమ్ ఆసీత్
బాహు రాజన్య : కృతః |
ఊరు తదస్య యద్ వైశ్య :
పద్భ్యాం శూద్రో అజాయత || [ ఋ-10-90-12, యజు. ( వాజసనేయ
సంహితా) 31-11; అథర్వ 19-6-6 ) ]
ఋగ్వేదం ప్రకారం సమాజం మనుగడకు బ్రాహ్మణులు (Men of Knowledge), క్షత్రియులు (Ruling Men), వైశ్యులు (Men of Trade), శూద్రులు (Working Men) అందరూ అవసరమనీ, నాడు వేదాలు పని విభజనతో కూడిన నాలుగు వర్ణాలను మాత్రమే సంభావించాయనీ, సమాజంలో కులం అనే వారసత్వ సముదాయం అప్పటికింకా ఏర్పడలేదనీ, వేదాలు శ్రమకు తగిన గౌరవం (Dignity of Labour) ఇచ్చాయనీ, అందుకే శ్రామిక వర్ణాన్ని పరస్మై పురుషుని యొక్క అతి ముఖ్యమైన అవయవాలైన పాదాలుగా వైదిక ఋషులు భావించారనీ సుప్రసిద్ధ వేద పండితుడు అబనీష్ చంద్ర బోస్ తన ‘The Call of the Vedas’ గ్రంథంలో అభిప్రాయపడ్డారు (పేజీ 267- భారతీయ విద్యా భవన్, బాంబే ప్రచురణ, 1970).
అయితే వర్ణ విభజనను వ్యతిరేకించేవారు బ్రాహ్మణులను పరస్మై పురుషుని ఉత్తమాంగమైన నోరుగానూ, శూద్రులను నీచాంగమైన పాదాలుగానూ భావించడంలోనే శ్రామిక వర్ణం పట్ల వైదిక ఋషులకున్న స్పష్టమైన వివక్షాపూరితమైన వైఖరి ద్యోతకమౌతున్నదని వాదిస్తారు. ఎందుకంటే శరీరంలో బొడ్డుకంటే పైన ఉండే భాగాలు (అవయవాలు) మిక్కిలి పరిశుద్ధమైనవని, అందునా ముఖము (నోరు) సర్వశ్రేష్ఠమైనదని బ్రహ్మయే స్వయంగా చెప్పాడు (మనుస్మృతి 1- 92). కనుక నోటినుంచి పుట్టుకొచ్చిన బ్రాహ్మణుల శ్రేష్ఠత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేమీలేదని వైదిక ఋషుల భావం. అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము అనే షట్కర్మలు బ్రాహ్మణునికి మాత్రమే పుట్టుకతో సంక్రమించే హక్కులని చెప్పడంలో మనువు యొక్క స్పష్టమైన ‘బ్రాహ్మణ పక్షపాతం’ మనకు కనిపిస్తున్నది. పైపెచ్చు మనువు అధ్యాపనము( విద్య గరపడం), యాజనము (గృహస్థుల చేత యజ్ఞాలు చేయించడం), ప్రతిగ్రహము (దానాలు స్వీకరించడం) అనే వ్యక్తిగతంగా ఆర్ధిక మేళ్లు చేకూర్చే వాటన్నింటినీ బ్రాహ్మణులకు పుట్టుకతోనే సంక్రమించే ప్రత్యేక హక్కులుగా, అవి వారి విశేషమైన అధికారాలుగా పేర్కొనడం గమనార్హం. విద్యగరపేందుకు ప్రాచీనకాలంలో గురువులు విద్యార్థుల నుంచి ప్రత్యేకించి రుసుములేమీ వసూలు చేయకున్నా, విద్యాబోధనా కాలంలో వారు అంతేవాసుల (విద్యార్థుల) సేవలు పొందేవారు. బోధనానంతరం విద్యార్థులనుంచి గురుదక్షిణగా తాము కోరుకున్నది అడిగి పొందే వెసులుబాటు గురువులకు కల్పించబడింది. (కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడు విలువిద్యా బోధనానంతరం తాను విద్యనేర్పిన అర్జునుడిని గురుదక్షిణగా తన శత్రువు ద్రుపదుడిని బంధించి తెమ్మని కోరడం మనకు తెలిసినదే. అలాగే తాను విద్య నేర్పకున్నా తన స్ఫూర్తితో ధనుర్విద్యను స్వయంకృషితో నేర్చుకున్న ఏకలవ్యుడిని అతడు విలువిద్యా ప్రావీణ్యంలో తన ప్రియశిష్యుడు అర్జునుడికి అడ్డువస్తాడని ఎంచి అతడి కుడి బొటనవ్రేలును గురుదక్షిణగా కోరడమూ మనకు తెలుసు.) యాజకులుగా యజ్ఞాలు నిర్వహించిన బ్రాహ్మణులకు గృహస్థులనుండి భారీగా సంభావనలు ముట్టేవి. అంతేకాదు. ‘మనుస్మృతి’ ( 1- 86) శ్లోకంలో కలియుగంలో దానమే పరమ శ్రేష్ఠమైన ధర్మమని పేర్కొనడం ద్వారా దానిని శ్రేష్ఠమైన కలియుగ ధర్మంగా వ్యవస్థీకరింపజేయడం, మరో వైపు ప్రతిగ్రహాన్ని (దాన స్వీకరణను) బ్రాహ్మణులకు మాత్రమే బ్రహ్మ కల్పించిన ఒక విశేషమైన అధికారమని చెప్పడం కారణంగా మనువు చేత అసలీ వర్ణధర్మాలు ఎవరి ప్రయోజనం కోసం రూపొందించబడ్డాయో స్పష్టంగా అర్థమౌతున్నది. ఇలా బ్రాహ్మణ వర్ణానికి విశేషాధికారాలను కల్పించిన మనువు శూద్రవర్ణానికి మాత్రం పై మూడు వర్ణాలకూ సేవ చేయడం ఒక విధి లేక బాధ్యతగా నిర్ణయించాడు. ఆ కారణంగా వర్ణ విభజన విషయంలో మనువు వైఖరి అసమంజసమైనదిగానూ మరియు వివక్షాపూరితమైనదిగానూ విమర్శించబడింది.
ప్రజలను సంరక్షించడం, దానాలు ఇవ్వడం, యజ్ఞాలు చేయడం, వేదాలు చదవడం, విషయవాంఛలకు దూరంగా ఉండడం క్షత్రియుల ధర్మములుగా బ్రహ్మ నిర్ణయించాడు. పశుపోషణ, దానములు ఇవ్వడం, యజ్ఞాలు చేయడం, వేదాలు అధ్యయనం చేయడం, వర్తక వాణిజ్యములు చేయడం, కుసీదం (వడ్డీ వ్యాపారం) చేయడం, కృషి (వ్యవసాయం) చేయడం వైశ్యుల ధర్మములుగా నిర్ణయించబడినాయి. (వైశ్య అనే శబ్దానికి వ్యవసాయదారుడని అర్థం.) (1 - 89, 90).
ఇలా క్షత్రియులకు, వైశ్యులకు కూడా వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం, దానాలు ఇవ్వడం ధర్మములుగా నిర్ణయించి, వేదవిద్యలు బోధించడం, యజ్ఞాలు నిర్వహించడం, దానాలు స్వీకరించడం మాత్రం బ్రాహ్మణులకు మాత్రమే పుట్టుకతో సంక్రమించే ప్రత్యేక హక్కులుగా నిర్ణయించడం కారణంగా సమాజంలో బ్రాహ్మణ వర్ణం అత్యంత ప్రయోజనం పొందే (the most privileged) వర్ణంగా రూపొందింది.
బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మాన్ని విధించాడు. అదేమంటే - గుణనింద చేయకుండా తన పై మూడు వర్ణాల వారికి శుశ్రూషలు చేయడం. ( 1- 91)
ఇక ఈ నాలుగవ వర్ణమైన శూద్రులకు హక్కులు, అధికారాలు ఏవీ లేవు - కేవలం బాధ్యతలు తప్ప. పై మూడు వర్ణాల వారి దూషణ, భూషణ, తిరస్కారాలతో నిమిత్తంలేకుండా అది తన విధ్యుక్త ధర్మంగా భావించి వారికి సేవలు చేయాలి. మరోపక్క బ్రాహ్మణులకేమో షట్కర్మలు జన్మతః సంక్రమించిన హక్కులట. ఒక బ్రాహ్మణుడు వేదాలు తాను అధ్యయనం చేయవచ్చు. ఇతరులకు బోధించవచ్చు. పుణ్యం కోరి తాను దానం చేయవచ్చు. ఇతరులిచ్చే దానాలు స్వీకరించవచ్చు. యజ్ఞ ఫలసిద్ధి కోసం తాను యజ్ఞాలు చేయవచ్చు. ఇతరులుచేసే యజ్ఞాలలో తాను యాజకుని పాత్ర నిర్వహించవచ్చు. అలా బ్రాహ్మణ వర్ణం ఈ వర్ణవిభజన కారణంగా అన్ని విధాలుగా లాభపడిన వర్గం కాగా శూద్ర వర్ణం ఈ వర్ణ విభజన వల్ల సామాజికంగానూ, ఆర్థికంగానూ తీవ్ర ఇక్కట్ల పాలయ్యింది.
క్షత్రియులకు వేదాలు అధ్యయనం చేయడం ఒక ధర్మంగా నిర్ణయించబడింది. కనుక ప్రతి క్షత్రియుడు వేదాధ్యయనం చేసి తీరాలి. క్షత్రియులకు అధ్యాపనం చేసే హక్కు లేదు. అధ్యాపనం (విద్య గరపడం) బ్రాహ్మణుల జన్మహక్కు కనుక ఒక క్షత్రియుడు తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుడి వద్ద వేదాలు అధ్యయనం చేయాల్సి ఉంది. దానం కలియుగ ధర్మం కనుక ప్రతి క్షత్రియుడూ దానం చేసి తీరాలి. దానస్వీకరణ బ్రాహ్మణుల జన్మహక్కు కనుక క్షత్రియులు బ్రాహ్మణులకే భూదాన, గోదాన, సువర్ణాది దానాలు చేసేవారు. అనులోమ వివాహం (పై వర్ణానికి చెందిన పురుషుడు కింది వర్ణానికి చెందిన స్త్రీని వివాహం చేసుకొనడం) శాస్త్ర సమ్మతమే కనుక ఒక బ్రాహ్మణుడు కోరితే కన్యాదానం ఇవ్వడం కూడా కింది మూడు వర్ణాల వారికి తప్పనిసరి. (అలా చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడికి నాలుగు వర్ణాలవారు తమ తమ పుత్రికలను కన్యాదానం చేయగా జన్మించిన వారే వరుసగా వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి). ఇక యాజనము (యజ్ఞాలు చేయించడం) కూడా బ్రాహ్మణులకు మాత్రమే హక్కు కనుక వారు యాజకులుగా వ్యవహరిస్తూ క్షత్రియులనుంచి భారీగా సంభావనలు పొందేవారు.
ఇదే విధంగా పశుసంపదకు అధిపతులు, వాణిజ్య వ్యవసాయాలు నిర్వహించేవారైనట్టి వైశ్యులు పుణ్య సముపార్జన కోసం బ్రాహ్మణులకు విరివిగా గోవులు, ధనధాన్యాదులను దానం చేసేవారు. తమకు వేదవిద్యలు గఱపి, తాముచేసే యజ్ఞాలకు యాజకులుగా వ్యవహరించే బ్రాహ్మణులకు వైశ్యులు విధేయులుగా ఉంటూ వారికి ఆర్థికంగా అండగా నిలిచేవారు. అలా ఇజ్యా ( యజ్ఞముల) నిర్వహణ, అధ్యాపనము (వేద విద్యాబోధన) అనే రెంటి ద్వారా మాత్రమే కాక కలియుగంలో దానం చేయడమే పరమ ధర్మమని మనువు నిర్ధారణ చేసినందున, దాన స్వీకరణ బ్రాహ్మణుల జన్మ హక్కుగానూ మనువు నిర్ణయించినందున బ్రాహ్మణ వర్ణం అనతికాలం లోనే సమాజంలో ఒక ఆధిపత్య వర్గంగా రూపొందింది.
‘మనుస్మృతి’ లో చేయబడినది వర్ణ విభజన మాత్రమేననీ, ఆ నాలుగు వర్ణాలనూ నేటి సమాజంలోని కులాలతో పోల్చిచూడడం సరికాదనీ మనం గ్రహించాలి. బ్రాహ్మణులను ప్రాచీన సమాజంలో విద్యలు, సంస్కృతికి చిహ్నాలుగానే మనం భావించాలి. అలనాటి ప్రాయికమైన విజ్ఞానశాస్త్రాలైనట్టి వేదవిద్యలను ఆకళింపు చేసుకుని, వాటిని సాటి బ్రాహ్మణ విద్యార్థులకు, ఇంకా కింది రెండు వర్ణాలైన క్షత్రియ, వైశ్య విద్యార్థులకు బోధించిన మేధావులే బ్రాహ్మణులు. వేద విద్యలను అధ్యయనం చేయడాన్ని మనువు కేవలం పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్ణాలకు మాత్రమే పరిమితం చేసినా నిమ్న జాతులకు (శూద్ర వర్ణానికి) సంబంధించిన పలువురు ఆ యా విద్యలలో ఎలా ప్రావీణ్యం సముపార్జించారనే విషయం మనకు చిత్రమనిపిస్తుంది.
సంస్కృతంలో 'రామాయణమ్' ను రచించిన ఆదికవి వాల్మీకి వేటాడడమే వృత్తిగా జీవించే బోయవాడు. సకల ధర్మశాస్త్ర మర్మాలనూ క్షుణ్ణంగా ఎరిగిన ధర్మవ్యాధుడు సైతం బోయ వాడే. పదిమంది ప్రజాపతుల (Patriarchs or Progenitors) లో ఒకనిగా పేరొందిన కర్దమ ప్రజాపతి మాంస విక్రయం చేస్తూ జీవించిన నిమ్న జాతికి చెందినవాడు. 'సిద్ధానాం కపిలో మునిః' అంటూ 'భగవద్గీత' విభూతి యోగం (10-26) లో 'సిద్ధులలో శ్రేష్ఠుని'గా శ్రీకృష్ణునిచే కీర్తించబడిన కపిలముని కర్దమ ప్రజాపతికి, దేవహూతికీ పుట్టినవాడు. కపిల మహర్షి భారతీయ షడ్ దర్శనాలలో ఒకటైన సాంఖ్య దర్శన సిద్ధాంత కర్త. వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు సృష్టించిన వ్యాసుడు పరాశరుడికీ, మత్స్యకార వృత్తి చేసుకునే బెస్త కన్య సత్యవతికీ జన్మించినవాడు. వ్యాసునికే కృష్ణ ద్వైపాయనుడని మరో పేరు. పరాశరుడు సప్తర్షులలో ఒకడైన వసిష్ఠుని మనుమడు. వసిష్ఠుని భార్య అరుంధతి చర్మకారునిగా, మాంస విక్రేతగా పేరొందిన కర్దమ ప్రజాపతి కుమార్తె. కపిల మహర్షి సోదరి. అరుంధతి మహా పతివ్రతగానూ, సప్తర్షులతో సమానమైన కీర్తిగలదిగానూ పేరొందింది. నీతికోవిదునిగానూ, ధర్మాత్మునిగానూ, మహాజ్ఞానిగానూ ప్రఖ్యాతిపొందిన విదురుడు వ్యాసుడికీ, ఒక శూద్ర దాసికీ పుట్టినవాడు.
నిమ్నజాతులకు చెందిన వీరంతా వేదవిద్యాపారంగతులు ఎలా అయ్యారనే విషయం ఆలోచనీయం.
యజుర్వేదంలోని వాజసనేయ సంహితలోని ఈ కింది మంత్రం చూడండి.
యథేమాం వాచం కల్యాణీమ్
ఆవదాని జనేభ్య : |
బ్రహ్మరాజన్యాభ్యాం
శూద్రాయచార్యాయ చ
స్వాయ చారణాయ చ || (య. వే. వా. సం. 26 -2)
కొందరు వ్యాఖ్యాతలు దీనినిబట్టి వేదవిద్యలు సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకే కాక, సమాజంలోని స్వజనులందరికీ, ఇంకా బయటి నుంచి వచ్చిన చారణుల (నానాదేశ సంచారుల) కు కూడా అందుబాటులో ఉండేవనీ, అవి సమస్త జనుల కళ్యాణానికీ ఉద్దేశించినవే తప్ప ఏ ఒక్క సమూహానికో, జాతికో పరిమితమైనట్టివి కావనీ వివరించారు.
కనుక మనువుకు ముందరికాలంలోని వైదిక సమాజంలో వేద విద్యలు యావన్మంది ప్రజలకూ అందుబాటులో ఉండేవని మనం గ్రహించగలం. ఆ కారణంగానే అప్పట్లో నిమ్న జాతులకు చెందిన పలువురు శూద్రవర్ణస్థులు సైతం వేదవిద్యలు నేర్చుకుని, వాటిలో ప్రవీణులైవుంటారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వైదిక యుగంలో చెల్లుబాటైన ధర్మాలను పునస్సమీక్ష చేసి, మనువు శూద్రులను విద్యలకు దూరం చేసిన కారణంగానే సామాజిక, ఆర్ధిక రంగాలలో శూద్రులు వెనుకబడి, శతాబ్దాలపాటు వివక్షకూ, దోపిడీకీ గురయ్యారనేది వాస్తవం. కాబట్టి తమ వెనుకబాటుతనానికి మూల కారణమైన మనువు పట్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారిలో ఉండే వ్యతిరేకత అర్థవంతమేనని మనమంతా గ్రహించాలి.
In almost all Vedic commentaries the term Arya implies the Vaisya. Though the term Arya generally means ‘one who is noble’, it means particularly a Vaisya. It is to be noted that even now the Vaisyas call themselves as Arya Vaisyas. Apart from other meanings, Vaman Shivaram Apte’s ‘ The Practical Sanskrit – English Dictionary’ too gave ‘ a Vaisya’ as the meaning of the term Arya.
చాలా మంచి వివేచన.
శూద్రాయచార్యాయ చ అనే మాట వద్ద ఆర్యాయ అనే మాటకు కూడా అర్థాన్ని వివరిస్తే, మరింత ఉపయోగ కరంగా ఉంటుంది.