Menu Close
Satyam-Mandapati
మనిషికి డబ్బు చేసింది! (కథ)
-- సత్యం మందపాటి --

(ఈమధ్యనే మన హైద్రాబాదు నగరంలో జరిగిన మూడు నిజ జీవిత సంఘటనల సమాహారమే ఈ కథ)

ఇక నిద్రకి ఉపక్రమిద్దామని సిద్ధమౌతుంటే ఫోన్ మ్రోగింది. హైద్రాబాదునించి రమ్య.

“నిద్ర పోతున్నావా, తాతయ్యా! పోనీ మళ్ళీ రేపు పిలుస్తాలే” అన్నది రమ్య.

“అవును నాన్నా. ఇప్పుడే బాగా నిద్ర వస్తుంటే పడుకోబోతున్నాను. ఫరవాలేదులే చెప్పు. నువ్వూ, అమ్మా బాగున్నారా?” అడిగాను.

“ఇప్పుడొద్దులే, నేను చెప్పేది కొంచెం పెద్ద కథే. ఇవాళ రాత్రికి పిలుస్తాను. అంటే మీకు అమెరికాలో ప్రొద్దున్న అవుతుంది. అప్పుడైతే మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అందరం బాగానేవున్నాం. పడుకో తాతయ్యా. గుడ్నైట్” అన్నది, ఏం చెబుతుందో, దేని గురించో చెప్పకుండానే ఫోన్ పెట్టేస్తూ.

మళ్ళీ ఇదో సస్పెన్స్. ఇక ఈ రాత్రికి నాకు నిద్రపట్టదు.

ప్రసూన “ఏముంది, ఏవో పిచ్చాపాటీ కబుర్లు. దానికి మీతో మాట్లాడకపోతే తోచదు. మీకూ అంతేను. అసలు మనవడితో కన్నా, సిసలు మనవరాలి మాటలే మీకు ఇష్టం మరి. మీకీరాత్రి నిద్రేం పడుతుంది” అన్నది లైటు ఆర్పేస్తూ.

అవును. రమ్య ఏం చెబుతుందా అని ఆలోచిస్తూ పడుకుంటే ఇక నాకు నిద్ర ఎలా వస్తుంది. అయినా కళ్ళు మూసుకుని పైన నెమ్మదిగా తిరుగుతున్న ఫాన్‍ని చూస్తూ పడుకున్నాను. కళ్ళయితే గట్టిగా మూసుకున్నాను గానీ, మనసులోని ఆలోచనలకు మూత వేయలేనుగదా!

రమ్య నా చిన్ననాటి స్నేహితుడు రంగడి మనవరాలు. వాడూ నేనూ, ఒకటో క్లాసు నించి ఇంజనీరీంగ్ కాలేజీ దాకా కలిసే చదువుకున్నాం. రంగడు, అదే, మా పాండురంగ విఠల్ హైద్రాబాదులో ఉద్యోగంలో చేరాడు. నేనేమో వెంటనే అమెరికాకి వచ్చేశాను. అయినా మా స్నేహం ఏమాత్రం దెబ్బతినలేదు. మా వాళ్ళందరూ గుంటూరు, బెంగుళూర్లలో వుండటం వల్ల, మేము సెలవులకి ఎప్పుడు భారతదేశం వెళ్ళినా, హైద్రాబాదు వెళ్ళినప్పుడు వాడింట్లోనే వుండేవాళ్ళం. నా భార్య ప్రసూన, రంగడి భార్య లత కూడా మావల్లనే మంచి స్నేహితులై పోయారు. అమెరికాలో మా నాలుగున్నర దశాబ్దాల జీవితంలో, ప్రతి నాలుగేళ్ళకి ఇండియాకి వెళ్ళటం, మా బంధుమిత్రులతో పాటు రంగడి కుటుంబంతోనూ ఎంత సమయం దొరికితే అంత సమయం గడిపితేగానీ వెనక్కి వచ్చేవాళ్ళం కాదు. కానీ వాడి జీవితం మాత్రం ఎన్నో అనుకోని మలుపులు తిరిగింది. రంగడు లతలకి అమ్మాయి శాంత పుట్టటం, శాంత చక్కగా చదువుకుని జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడటం, శాంతకి మా ఆధ్వర్యంలోనే పెళ్ళి చేయటం, శాంత భర్త సరిగ్గా ఏ ఉద్యోగంలోనూ వుండలేక శాంతను హింసించటం, అది భరించలేక శాంత విడాకులు తీసుకుని కూతురు రమ్యతో అమ్మానాన్నల దగ్గరే వుండటం అన్నీ కలలోలా జరిగిపోయాయి. రంగడు, లత అన్నిటికీ తట్టుకుని గట్టిగా నిలబడ్డారు. నేనూ, ప్రసూనా కూడా మాకు చేతనైనంత మానసిక సహాయం చేస్తూనే వున్నాము.

నేను ఈ ఆలోచనలతో మంచం మీద ఇటూ, అటూ అసహనంగా కదులుతూ వుంటే, “ఏం, నిద్ర పట్టటం లేదా? ఆలోచనలు మానేసి కళ్ళు మూసుకుని పడుకోండి. నిద్ర పడుతుంది” అన్నది ప్రసూన.

ఆమె నిద్ర కూడా చెడగొట్టటమెందుకని నేనేం మాట్లాడలేదు. ఈసారి కదలకుండా పడుకుని ఆలోచిస్తున్నాను. అయినా రంగడి కుటుంబం గురించి ఆలోచనలు ముసురుకుంటూనే వున్నాయి.

రమ్య పై చదువులు అమెరికాలో చదువుకుంటానంటే, ఇక్కడికి రావటంలో సహాయం చేశాను. మా దగ్గిరే వుండి చదువుకోవటంతో మాకు బాగా దగ్గరయింది రమ్య. నన్ను తాతయ్యా అని, ప్రసూనని అమ్మమ్మా అనీ ప్రేమగా పిలిచేది. రమ్య మాస్టర్స్ డిగ్రీ ఇంకా కొన్ని నెలల్లో అయిపోతున్నప్పుడే, రంగడు హఠాత్తుగా కోవిడ్ బారిన పడి వెళ్ళిపోయాడు. అందుకే అమ్మమ్మ, అమ్మలకు చేదోడువాదోడుగా వుంటానని డిగ్రీ చేతికి రాగానే ఇండియాకి తిరిగి వెళ్ళిపోయింది రమ్య. అక్కడ మంచి ఉద్యోగమే సంపాదించుకుని అమ్మ, అమ్మమ్మల తోనే వున్నది. అందుకనే అంత బాధ్యతతో పెరిగిన రమ్యను ప్రేమగా పెంచిన మా రంగడు, శాంతలంటే నాకు ఎనలేని ఇష్టం. ఇక్కడ వున్న ఆ రెండేళ్ళూ నాకు బాగా దగ్గరయింది. ప్రసూన అన్నట్టు నాకు అసలు మనవడు వేణు ఎంతో, సిసలు మనవరాలు రమ్య కూడా అంతే! నాకే కాదు, నేనంటే రమ్యకూ అంతే ప్రేమ. వారానికి ఒకసారైనా ఫోన్ చేసి, తాతయ్యా మొన్నేం జరిగిందో తెలుసా అంటూ కబుర్లు చెబుతుంది. నేను రమ్య ఫోన్ కోసమే ఎదరు చూస్తుంటే, నన్ను వెక్కిరిస్తుంటుంది ప్రసూన.

మర్నాడు స్నాన గాన పానాదులు పూర్తి చేసుకుని, చేతిలో ఫోన్ పట్టుకుని ముందు గదిలోనించి చివరి గది దాకా ఇటూ అటూ పచార్లు చేస్తుంటే, ప్రసూన “హాయిగా ఆ కుర్చీలో నడుం వాల్చండి. మీరు కూర్చున్నా కూడా ఫోన్ మ్రోగుతుంది కదా!” అన్నది నవ్వుతూ.

ఈలోగా ఫోన్ మ్రోగింది. నేను ఎదురు చూస్తున్నట్టుగానే ఇండియానించి రమ్య.

“గోంగూర పచ్చడి రాసుకుని బ్రెడ్డు తినేశావా తాతయ్యా? కాసేపు మాట్లాడవచ్చా?” అడిగింది.

“అవన్నీ ఎప్పుడో అయాయి నాన్నా. ఏమిటి నిన్న ఏదో చెప్పాలన్నావు? మూడు వారాల క్రితం మాట్లాడిన వింత పెళ్ళికొడుకు గురించా? ఒక చెక్‍లిస్ట్ కూడా ఫోనులో పెట్టుకుని తెచ్చాడన్నావు. నేను గ్రోసరీ షాపుకి వెడుతుంటే ప్రసూన కూడా అలాగే ఏవీ మరచిపోకుండా ఒక చెక్‍లిస్ట్ ఇస్తుంది, పాలూ, అరటిపళ్ళూ, టమోటాలూ, కొత్తిమీర అంటూ” అన్నాను.

“అవును. అతనొక్కడే కాదు మా అమ్మ ఏదో వెబ్‍సైటులో చూసిన ఇంకొకతను కూడా ఫోన్ చేస్తున్నాడు”

“అంతకుముందు చెప్పిన అతనేగా తన చెక్‍లిస్ట్ ప్రకారం ఎన్నో ప్రశ్నలడిగాడు. చివరికి తనకి ఏ బాధ్యతలూ తీసుకోవటం ఇష్టం లేదనీ, పెళ్ళి చేసుకుంటే మీ ఇద్దరే తప్ప ఇంకా ఎవరూ మీతో వుండకూడదనీ అన్నది” అడిగాను.

“అవును. అప్పుడే అతనికి చెప్పాను. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెంచిన పెద్దవారిని నేను విస్మరించననీ, వారి బాధ్యతని పూర్తిగా తీసుకుంటాననీ, ఈ వివాహం మన మధ్య జరగదనీ. అమ్మా, అమ్మమ్మా వెళ్ళిపోయేదాకా మేం ముగ్గురం కలిసే వుంటాం. మధ్యలో వీడెవడు అలా కాదనటానికి. అలా గట్టిగా నేను ఫోనులో మళ్ళీ చెప్పాక ఏమన్నాడో వింటే నువ్వు నమ్మవు” కోపంగా అని, తనని తనే తమాయించుకుంటూ చెప్పటం ఆపింది రమ్య.

“అవున్నాన్నా. నిన్ను ఎంతో ప్రేమతోనేకాక క్రమశిక్షణతోనూ సంస్కారంతోనూ పెంచారు రంగడూ, లతా, శాంతా. వీడు కాకపోతే ఇంకొకడు. ఇంతకీ ఏమన్నాడేమిటి?”

కొంచెం ఆగి నెమ్మదిగా అన్నది రమ్య. “అతను ఏదో పెద్ద అమెరికన్ కంపెనీలో పని చేస్తున్నాడుట. నెలకి రెండు మూడు లక్షలు జీతంట. ఒక పెద్ద అపార్ట్మెంటు కొనుక్కుని ఒంటరిగా వుంటున్నాడుట” అని, ‘ఇది చెప్పటానికి కూడా కష్టంగా వుంది’ లోపల అనుకుంటున్నాననుకున్నది కానీ, పైకే అనేసింది.

నేను మాట్లాడలేదు. ఏం చెబుతుందా అని ఆలోచిస్తున్నాను.

ఒక్క క్షణం ఆగి అన్నది, “సహజీవనం చేద్దామన్నాడు తాతయ్యా. పెళ్ళి చేసుకోకుండా ఇద్దరం అక్కడే అతని ఎపార్ట్మెంట్లోనే హాయిగా విలాస జీవితం గడుపుదామన్నాడు. ఎంతో ఉదారబుద్ధితో, నా ఖర్చులకు నేనే నా జీతంలో సగం నెలనెలా అతనికిచ్చి, మిగిలినది మా కుటుంబ బాధ్యతలకు వాడుకోమన్నాడు. నాకెప్పుడు ఇష్టమైతే అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు చూసుకురమ్మన్నాడు”

రమ్య గొంతులో గద్గతమైన మార్పుని వింటుంటే, ఆమెలో ఏడుపు తన్నుకు వస్తుంటే ఆపుకుంటున్నదని అర్థమైంది. నా ఎనభై ఏళ్ళ జీవితానుభవం ఆమెని ఎలా ఓదార్చాలో చెప్పలేకపోతున్నది. ఆమెకు కొంత సమయం ఇవ్వటమే మంచిదని నిశ్శబ్దంగా వున్నాను.

రెండు నిమిషాలు మా మధ్య ఏ మాటలూ దొర్లలేదు అనేదానికన్నా, మాటలు దొరకలేదు అంటే సబబేమో.

నెమ్మదిగా రమ్య, “తాతయ్యా, లైన్లో వున్నావా? ఫోన్ కట్టయిందా? నీకివి చెప్పి బాధపెట్టానా?” అని అడిగింది.

“లేదు నాన్నా. ఇక్కడే వున్నాను. ఇంతకుముందు ఇక్కడ అమెరికాలో వాళ్ళ సంస్కృతిలో ఇలాటివెన్నో విన్నా, నేను పెరిగిన మన భారతదేశంలోనే ఇలా… అదీకాక చక్కటి కుటుంబ సంస్కారంతో పెరిగిన నీ విషయంలో ఇలా జరిగిందంటే భరించలేక పోతున్నాను. అంతే. నువ్వు అతనికి ఏం జవాబిచ్చావో చెప్పమని నేను అడగను. నాకు తెలుసు మా బంగారు తల్లి ఏం చెప్పివుంటుందో. అలాటి వాళ్ళతో మళ్ళీ మాట్లాడటమే తప్పు” అన్నాను.

“అవును. అతన్ని మళ్ళీ నాతో మాట్లాడవద్దని చెప్పేశాను. అమ్మకి తెలిసినవారెవరో ఇంకొకతను మంచి కుర్రాడు అని చెబితే, అతనితో కూడా రెండు రోజుల క్రితమే మాట్లాడాను” అన్నది రమ్య.

“అవును. అందరూ అలాటి వెధవలే వుండరు. ఇతను మంచివాడే అయుండాలి” అన్నాను.

పెద్దగా నవ్వింది రమ్య. “అదే పెద్ద పొరపాటు తాతయ్యా! ఇతని మీద ఆ ముందువాడే నయం” అన్నది.

ఆమె అలా నవ్వగానే ముళ్ళపూడి వెంకటరమణగారు వ్రాసింది గుర్తుకి వచ్చింది. “నవ్వొచ్చినప్పుడు ఎవరైనా నవ్వుతారు. ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో” అని.

“ఇతనేమడిగాడు. నీ జీతం పూర్తిగా ఇచ్చేయమన్నాడా?” అడిగాను.

“లేదు తాతయ్యా! ఇతను బాగా డబ్బున్నవాడే. వాళ్ళ నాన్నకి ఎన్నో వ్యాపారాలు, కోటానుకోట్ల ఆస్తి వున్నది. నేను ఎంతో అందంగా వున్నానుట. అతనికి బాగా నచ్చానన్నాడు. అతని నాన్న చాల డబ్బు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్ళి జరిపిస్తాడుట. ఇద్దరం ఒక గంటసేపు బాగా మాట్లాడుకున్నాం. తర్వాత అతను ఒక యాప్ నా ఫోన్లో డవున్లోడ్ చేసుకోమన్నాడు. అదేమిటని అడిగాను. అది ఒక గ్రూపుట. ప్రతి వారాంతం ఒక పెద్ద హోటల్లో పార్టీ రూములో కలుస్తారుట. ఆ రెండు రోజులూ అక్కడే అందరూ ఆనందంగా గడుపుతారుట. అదొక స్వింగర్స్ క్లబ్బుట. అక్కడ ఎవరు ఎవరితోనైనా గడపవచ్చుట. అలా స్వేఛ్చా స్వాతంత్ర పార్టీల్లో ఎంతో సంతోషంగా వుండటమే కాక, అతనికి నేనెవరితో వెళ్ళినా ఇబ్బంది లేదుట. అలాగే అతను ఎవరితో వెళ్ళినా నేను బాధ పడకూడదుట. అతనది చెబుతుంటేనే నేను అసహ్యించుకుని వెనక్కి తిరిగి వచ్చేశాను. ఈసారి నాకు అతన మీద ఏవగింపు, జాలి మాత్రమే వచ్చాయిగానీ, ఏడుపు రాలేదు. అతని జీవితం అతనేం చేసుకుంటే నాకేం. నేను కలలో కూడా అంత అధోగతికి దిగజారలేను” అన్నది రమ్య.

“అవునమ్మా! మనం ఇలాటి వాళ్ళని వాళ్ళ ఖర్మకి వదిలేసి ఎంత దూరంగా వుంటే అంత మంచిది” అన్నాను.

“తాతయ్యా! ఈనాటి యువతని చూస్తున్నాను కదా. అందరూ అననుగానీ, పెద్ద నగరాల్లో చాలమంది తాగటం, డ్రగ్స్ తీసుకోవడం, ఇలాంటి చెత్త పనులు చేయటం ఎందుకు మొదలుపెట్టారు? మా ఇంజనీరింగ్ క్లాసులో చెప్పేవారు, ఏదైనా ప్రోడక్ట్ లో గానీ, ప్రాసెస్‍లోగానీ ఏదైనా తప్పు జరిగితే, దానికి మూలకారణం కనుక్కుని సరిచేస్తేగానీ, ఆ తప్పుని పూర్తిగా సవరించలేం అని. మరి మీ రోజుల్లోనూ, మా అమ్మా నాన్నా రోజుల్లోనూ లేని ఈ చెత్త ఇప్పుడెందుకు మన సమాజంలోకి వచ్చింది? నువ్వూ క్వాలిటీ ఇంజనీరింగులో పని చేశావు కదా. చెప్పు” అడిగింది రమ్య.

రమ్య చాల తెలివైన పిల్ల మరి. అందుకే అడిగాను, “అది కూడా నువ్వే చెప్పు?” అని.

ఒక్క నిమిషం ఆలోచించి అన్నది. “అది మనుష్యుల్లో వుండాల్సిన సంస్కారం, విలువలు, క్రమశిక్షణ దిగజారి పోవటం వల్లనా?” అడిగింది.

“చాల బాగా చెప్పావమ్మా. నూటికి నూరుపాళ్లూ అదే కారణం. ఈనాటి మనిషికి డబ్బు చేసింది!” అన్నాను.

“మనిషికి జబ్బు చేసింది అనబోయి, డబ్బు చేసింది అన్నట్టున్నావు తాతయ్యా” సవరించింది రమ్య.

చిన్నగా నవ్వాను.

“లేదమ్మా, సరిగ్గానే చెప్పాను. మనిషికి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి జబ్బు నయం చేయించుకోవచ్చు. కానీ ఇలా మనిషికి డబ్బు చేయటమనేది ఆనాటి ప్లేగ్, కలరా, ఈనాటి కరోనాల కన్నా పెద్ద మహమ్మారి రోగం. దాన్ని నయం చేయటం అంత సులభం కాదు. దాని ‘లక్షణాలు - ఫలితాలు’ అంటే ‘సింప్టమ్స్ - ఎఫెక్ట్స్’ ఏమిటో తెలుసా? అహంకారం, ధనమదం, డబ్బులేనివారి పైనా, నీతీ నిజాయితీలతో బ్రతికే వాళ్ళపైనా ద్వేషం పెరిగిపోవటం. న్యాయాన్నీ, చట్టాన్నీ కొనేయగలగటం. అంతేకాదు మానవధర్మం, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సంస్కారం, మానవతా విలువలకు అతీతులమని విర్రవీగటమే కాక, వాటిని తమ చెప్పుచేతల్లోనే పెట్టుకోవటంలాటివి ఎన్నో చూస్తున్నాం. అందుకే ఈనాడు ఇలాటి పిచ్చి ఆలోచనలు ఎక్కువయాయి. అంతేకాదు ‘కాలం మారింది, పాత కాలంనాటి మీరే మారలేదు. అలాటివి ఈరోజుల్లో తప్పు కాదు’ అనేవాళ్ళు కూడా ఎక్కువయారు” అన్నాను.

“మరి ఇలాటివాటికి పరిష్కారం?” అడిగింది రమ్య.

“ప్రతి సమస్యకూ ఒకటో, కొన్నో పరిష్కారాలు వుంటాయని గట్టిగా నమ్మేవాళ్ళల్లో నేనొకడిని. ఇది ఈనాటి యువత సమస్య మాత్రమే కాదు, ఇది మన సమాజ సమస్య. మనిషి మనిషిగా బ్రతకటానికి కావలసింది సంస్కారం. అది మన తల్లిదండ్రులనీంచీ, తాతయ్య, అమ్మమ్మలాటి ఇతర కుటుంబ పెద్దలనించీ వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులని వృధ్ధాశ్రమాల్లో వదిలేస్తున్నాం. పిల్లల్ని ఆయా దగ్గరో, బేబీ సిట్టర్ దగ్గరో వదిలేస్తున్నాం. మేము మా గురువుల దగ్గర ఎంతో నేర్చుకునేవాళ్ళం. ఈనాటి గురువులకే విషయ పరిజ్ఞానంలేదు. అదున్నా చెప్పే సమయం లేనప్పుడు మనకిక వాళ్ళేం చెబుతారు. ప్రభుత్వాలే చదవులని అమ్మకానికి పెట్టేశాక, చదువు’కునేవారు’ తగ్గిపోయి, చదువు’కొనేవారు’ ఎక్కువయారు. పుస్తకాలనించీ ఎంతో జ్ఞానం వస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలమంది తెలుగు వాళ్ళకి తెలుగు చదవటమే రాదు. ఇక ఇంగ్లీష్ పుస్తకాలే కాదు, ఏ భాషా పుస్తకమైనా చదవటం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అందుకని నువ్వూ, నీలాటి యువతనించే ఈ పరిష్కారం రావాలి. వస్తుంది” అన్నాను.

రమ్య మాట్లాడలేదు. ఆలోచిస్తున్నదని తెలుస్తూనే వుంది.

“ఇంకొక విషయం తల్లీ. నువ్వు చూసినటువంటి చెడ్డవాళ్ళు మన చుట్టూ కొద్దిమందే వుంటారు. ఎంతోమంది మంచి పెళ్ళికొడుకులు వున్నారు. కాకపోతే మారోజుల్లో కన్నా, ఇప్పుడు మీరు మంచి భర్తని సంపాదించటంలో కొంచెం జాగ్రత్తగా వుండాలి. అంతే. నిరుత్సాహ పడకూడదు. నీకు అంతా మంచే జరుగుతుంది బంగారం!” అన్నాను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ!

********

Posted in October 2025, కథలు

8 Comments

  1. సుమచంద్ర

    ఈనాటి యువతకు నిజంగానే డబ్బు చేసింది సర్.చాలా అద్భుతమైన కథ సర్.

    • సత్యం

      అవునండి. ఇది వైద్యులు నయం చేసే ‘డబ్బు’ కాదు. దీనికి కారణం మనిషికి వుండాల్సిన సంస్కారం పాతాళలోకానికి పోవటమే. దీని లక్షణాలు ‘నేను నా డబ్బుతో ఏదైనా శాసించగలను’ అనే అహంకారం. దురాశ. దీనికి వైద్యం లేదు. అది వారి మనసుల్లోనించే రావాలి.

  2. Kumari Samineni

    👏🏼👏🏼🙏🏽🙏🏽వరుడి కోసం వెతకబోతే వానరుల సమూహ (అవి కూడ ఇంత అధ్వానంగా ప్రవర్తించవేమో) డొంకలే తగులుకుంటున్నాయి!

    • సత్యం

      ధన్యవాదాలు కుమారిగారు. కథకి తగ్గ సామెత చెప్పారు. ఇవి మన రోజుల్లాలా కాదు. ఇరుపక్షాలూ జాగ్రత్త వహించటం అవసరం.

  3. Sreeni

    మనిషి డబ్బు చేసింది కథ బాగుంది. ఈ జనరేషన్ లో అందరూ కాదు కానీ, కొంతమంది మనస్తత్వాలు చాల తేడాగా ఉంటున్నాయి. పెళ్లికావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి సెలక్షన్ లో. మంచి కథ అందించినందుకు సత్యం గారికి అభినందనలు.

    • సత్యం

      ధన్యవాదాలు శ్రీనిగారు. అవును, పెళ్లికావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఈ కథలోని సంఘటనలు కల్పితం కాదు. నిజంగా ఈమధ్యనే జరిగినవే!

  4. Annapurna

    Avunu . Ee rojullo varuni – vadhuvunu enchulodam chala kashtamga samasyaga vuntondi .
    Anduke aalasyam avutunnae pellillu .

    • సత్యం మందపాటి

      అవునండి. నేను ఇలాటి ఎన్నో కథలు చూస్తున్నాను. వింటున్నాను. ఇరుపక్కలా ఎంతో జాగ్రత్త వహించటం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *