Menu Close
Lingamneni Sujatha
మంచి మనసు (కథ)
-- లింగంనేని సుజాత --

“అమ్మా! దాదాపు పది సంవత్సరాలుగా చూస్తున్నాను. నాన్న స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వుండేవాడు. ఎంత డబ్బు సంపాదించాడో నాకు తెలియదు. కానీ అప్పుడప్పుడూ నాకు కావలసిన డ్రెస్సులు కొనుక్కోమని డబ్బు ఇచ్చేవాడు.

ఈ మధ్యన నాన్న ఏ పనీ చేస్తున్నట్లు లేరు. ఎక్కువగా రాత్రిళ్ళు ఇంటికి తాగి వస్తున్నారు. ఇలాగైతే నాన్న ఆరోగ్యం చెడిపోదా?

అంతే కాకుండా నాన్న తాగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి, అన్నం చల్లారి పోయిందనో, కూరలో ఉప్పు ఎక్కువ అయ్యిందనో, ఏదో ఒక వంక పెట్టి నిన్ను తిడుతుంటే, వినడానికి నాకు కష్టంగావుంది. నీవు ఎలా భరిస్తున్నావు?” అంది సమంత.

"అది అంతా తాగుడు మహత్యం. తాగుడు మైకం తగ్గితే బాగానే ఉంటాడు" అంది శాంత.

“అమ్మా! నీవు ఉదయం అయిదు గంటలకు లేచి, పనులు మొదలు పెడతావు. రాత్రి తొమ్మిది గంటలకు పనులు పూర్తి చేస్తావు. ఆ తర్వాత నాన్న కోసం ఎదురుచూపులు చూస్తావు.

నాన్న తాగి ఇంటికి వచ్చిన తర్వాత, నీతో గొడవ పెట్టుకుని, నిన్ను తిట్టడమే గాని, నీతో ప్రేమగా మాట్లాడడం నేను ఎన్నడూ చూడ లేదు. అయినా నాన్న తప్పు లేదు అంటున్నావంటే... నీవు నాన్నను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతోంది.

నీ కష్టాన్నీ, నీ ప్రేమను తెలుసుకుని, నాన్న ఎప్పుడు మందు తాగడం మానతాడో?... తెలియడంలేదు” అంది సమంత.

“నేను నీకు తెలియని ఒక విషయం చెపుతాను విను” అంటూ...శాంత చెప్పడం మొదలు పెట్టింది.

****

“మా నాన్న నన్ను బి.ఏ. చదివించారు. నేను టీచర్ గా ఉద్యోగంలో చేరాను. నాకున్న ఇద్దరు అక్కలకు పెళ్ళి చేసి మా నాన్న అప్పుల పాలయ్యారు. నాకు పెళ్ళి చేసే స్థితిలో మా నాన్న లేరు.

ఆ సమయంలో మీ నాన్న మధు మా పక్క ఇంటిలో నున్న తన బంధువులను చూడడానికి వచ్చాడు. వయసులో ఉన్న వాళ్ళం కాబట్టి ఒకరంటే ఒకరికి ఆకర్షణ కలిగింది.

మా పక్క ఇంటి వాళ్ళతో మా పెళ్ళికి రాయబారం జరిపించాడు. తానే పెళ్ళి ఖర్చులు భరించి, నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు.

మీ నాన్న చదువుకున్నాడుగాని ఉద్యోగం చేయడంలేదు. కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నాడు. ఆయనకు తండ్రి లేడు. తల్లి, తమ్ముడు ఉన్నారు.

మా నాన్న మా పెళ్ళి జరిపించారు.

మీ నాన్న మధు నన్ను పెళ్ళి చేసుకుని నాకు తన భార్య అనే హోదాను ఇచ్చాడు. బంగారంలాంటి నిన్ను ఇచ్చాడు అంది శాంత.

మా పెళ్ళి జరిగిన తర్వాత కొంత కాలం మా అత్తగారు, మా మరిది మాతో పాటు ఉన్నారు. అప్పట్లో మీ నాన్న, మీ బాబాయి కలిసి కాంట్రాక్ట్ పనులు చేయించేవారు.

మీ బాబాయికి ఉద్యోగం వచ్చి, వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని స్థిరపడ్డాడు. మా అత్తగారు కొంత కాలం మాతోపాటు, కొంతకాలం చిన్న కొడుకుతో ఉండేది.

మీ నాన్నకు వచ్చిన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసిన తర్వాత, కొంత కాలం ఖాళీగా వున్నాడు.

ఆ తర్వాత స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ మధ్యన ఎక్కువగా లాభాలు ఉండడం లేదని ప్రస్తుతం ఖాళీగా వున్నాడు మీ నాన్న.

ఈనాడు మీ నాన్న తాగుడికి అలవాటు పడ్డాడని నాకూ చాలా బాధగా ఉంది. ఆయన చేత తాగుడు మాన్పించలేక పోతున్నాను.

నీవు మీ నాన్న గురించి ఆలోచించి, నీ మనసు పాడు చేసుకోవద్దు.

నీవు శ్రద్ధగా చదువుకుని ఇంజినీరింగ్ పాసై, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. పెళ్ళి చేసుకుని, పిల్ల పాపలతో నీవు హాయిగా ఉండాలనేదే నా కోరిక అంది” శాంత.

****

నాలుగు సంవత్సరాలు గడిచాయి. సమంత ఇంజినీరింగ్ పరీక్ష పాసై, పేరు పొందిన ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

ఒక రోజు అమ్మా! నాన్నా! మా కంపెనీ నన్ను కెనడా పంపిస్తోంది అంటూ సమంత చెప్పింది.

విదేశాలు వెళ్ళాలన్న నీ కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషం అన్నారు మధు,శాంత...

"ఇక్కడుంటే వచ్చే జీతానికన్నా కెనడాలో జీతం ఎక్కువ వస్తుంది. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో, మిమ్మల్ని వదిలి నేను వెళుతున్నాను" అంది సమంత.

“కెనడాలో మా అక్క కూతురు ఉంది. పెద్దమ్మను అడిగి వాళ్ళ అమ్మాయి ఫోను నెంబర్ తీసుకుని అక్కతో మాట్లాడు. నీకు కెనడాలో ఏ అవసరం వచ్చినా, అక్క సాయం తీసుకో!” అంది శాంత.

****

తాను సంపాదించిన డబ్బుతో,...కొంత డబ్బు లోను తీసుకుని సమంత హైదరాబాదులో ఒక ఫ్లాట్ కొన్నది. గృహ ప్రవేశానికి బంధు మిత్రులందరూ వచ్చి వెళ్లారు.

పది రోజుల తర్వాత మధు స్నేహితుడు సుందరం వచ్చాడు.

"మధూ! నీ కూతురిలాగే నా కొడుకు కూడా కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. మా వాడు నీ కూతురికి అందంలో తీసిపోడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే, చూడ చక్కని జంట అవుతుంది. ఏమంటావు?" అన్నాడు సుందరం.

"చాలా బాగుంటుంది. నా కూతురిని అడిగి చెపుతాను. నీవు నీ కొడుకుని అడుగు. ఈ కాలం పిల్లలు కదా! వాళ్ళకి నచ్చితేనే పెళ్ళి చేద్దాం" అన్నాడు మధు.

"మా కొడుకుకు కొన్ని సంబంధాలు చూశాము. కాని మా వాడికి నచ్ఛలేదు. అందంగా ఉన్న మీ సమంతను చూస్తే కాదనడన్న నమ్మకం నాకుంది అన్నాడు" సుందరం.

అక్కడే ఉన్న సమంతను చూసి ... “సమంతా! ఈ ఫోనులో ఉన్న మా కొడుకు ఫోటో చూడమ్మా! నీకు మా వాడు నచ్చితే పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాం” అన్నాడు సుందరం.

"నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు అంకుల్! నన్ను క్షమించండి" అంటూ సమంత తన గదిలోకి వెళ్ళిపోయింది.

"సమంతా! నీకు మంచి పెళ్ళి సంబంధం వచ్చిందని, మీ నాన్నా, నేను సంబర పడుతుంటే ... నీవేమిటమ్మా ఇప్పుడే పెళ్ళి చేసుకోను అంటున్నావు?" అంది శాంత...

“అమ్మా! నాన్న త్రాగుడు మానలేడు. నీవు నాన్నను మార్చలేక రాజీ పడి పోయావు.

"మా పెళ్ళి జరిగే వరకు మా మామగారు తరపు వాళ్ళు బాగా మాట్లాడతారు...నా పెళ్లయిన తర్వాత, నేను మీకు డబ్బు ఇస్తానంటే ఒప్పుకోకపోవచ్చు. వారి మాట కాదంటే, వారు నన్ను మానసికంగా రకరకాలుగా హింసించ వచ్చు".

"తాగుడు వల్ల నాన్నకు ఇప్పటికే బి.పి., షుగర్ వచ్చాయి. భవిష్యత్తులో నాన్నకు రకరకాల రోగాలు రావచ్చు. వాటిని నయం చేసుకోవడానికి డబ్బు కావాలి. అలాంటి సమయంలో మీకు డబ్బు ఇవ్వకపోతే, నాకు మనశ్శాంతి ఉండదు".

అలా కాకుండా, "నా భర్త కూడా నాన్నను చూసి, తాగుడు మొదలు పెడితే...నాన్న తాగితేనె భరించలేని నేను, నా భర్త కూడా తాగితే...నేను ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది".

"నేను పెళ్ళి చేసుకుని ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకోను. నా జీవితం కన్యగా ముగిసి పోవాల్సిందే. నాన్న కడుపున పుట్టినందుకు నా నిర్ణయం ఇది. నాకు నిద్ర ముంచుకు వస్తోంది” అంటూ సమంత తన గదిలోకి వెళ్ళిపోయింది.

భగవంతుడా! మా జీవితంలో ఇలాంటి అపశ్రుతులేమిటి తండ్రీ!... అంటూ, శాంత బాధపడుతూ ఆలోచనలో మునిగింది.

*****

తల్లీ కూతుళ్ళ మాటలు చాటున ఉండి విన్న మధు కూతురు మాటలకు నిర్ఘాంతపోయాడు. సమంత పుట్టినప్పుడు బంగారు బొమ్మలా ఉన్న  పాపను చూసి మధు, శాంత పొంగిపోయారు.

"ఏమండీ! పాపను పెద్ద చదువులు చదివించి, రాజకుమారుడిలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి"అంది శాంత.

"అలాగే! మనం ఇప్పటినుండే డబ్బు పొదుపు చేస్తూ, కూడబెడితే పాపను బాగా చదివించ వచ్చు" అన్నాడు మధు.

శాంత ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తోంది. జీతం చాలా తక్కువగా ఉంటుంది. మధు కాంట్రాక్ట్ పనులు చేయించేవాడు. లాభాలు వచ్చినప్పుడు కొంత డబ్బు కూడబెట్టేవాడు.

కొంత కాలానికి కొంత మంది స్నేహితులతో కలిసి మధు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అప్పుడు సరదాగా తాగడం మొదలు పెడితే, అది అలవాటయ్యింది.

ఈ మధ్యన ఎక్కువగా లాభాలు ఉండడం లేదని, ప్రస్తుతం ఖాళీగా వున్నాడు. తాగకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది.

శాంత స్కూల్ టీచరుగా ఉద్యోగం చేస్తూనే, సాయంత్రం బ్యూటీపార్లర్ పెట్టి డబ్బు సంపాదిస్తూ, సమంతను చదివించింది.

ఈ మధ్యన శాంత కు ఆరోగ్యం బాగా లేక, ఆర్థికంగా ఇబ్బంది పడితే సమంత డబ్బు పంపింది. తన తాగుడు వల్ల  శాంత, సమంత బాధపడుతున్నారు. తన కారణంగానే సమంత పెళ్ళి చేసుకోను అని చెప్పింది.

"తన ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి తాగుడు మానడం. రెండు ఆత్మహత్య. ఆత్మహత్య మహాపాపం అంటారు పెద్దలు. ఇప్పుడేం చేయాలి?"... ఆలోచిస్తూనే ఒక నిర్ణయానికి వచ్చి నిద్ర లోకి జారుకున్నాడు మధు. తెల్ల వారింది.

తల స్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి, పూజగదిలో నుండి హాలులోకి వచ్చాడు మధు.

“సమంతా! నీవూ మీ అమ్మా రాత్రి మాట్లాడుకున్న మాటలు విన్నాను. నావల్ల మీ ఇద్దరూ ఎంత బాధ పడుతున్నది తెలుసుకున్నాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను” అంటూ ..

మధు తన గదిలోకి వెళ్ళి రెండు డ్రింకు సీసాలు తీసుకు వచ్చి, సమంత చేతికి ఇచ్చి...

"సమంతా! ఈ సీసాలు తీసుకు వెళ్లి, కుప్పతొట్టెలో వేయి. నేను జీవితంలో ఇక తాగను. నీవు నా గురించి బాధపడకుండా పెళ్ళికి ఒప్పుకో. ఈ నూతన సంవత్సరం, కొత్త జీవితం  ప్రారంభించు" అన్నాడు మధు.

ఎంత మంచి మనసు నాన్నా! నీది అంటూ ఆనందంతో కొత్త ఆశలతో, సమంత తండ్రి పాదాలకు నమస్కరించింది.

సమంతను లేవనెత్తి, సమంతా! నీవు పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండు అని ఆశీర్వదించాడు మధు.

శాంత వారిద్దరినీ చూస్తూ.... భగవంతుడా!  ఇంత ఆనందాన్ని మాకు కలిగించిన నీకు శతకోటి వందనాలు అంటూ కనరాని దేవునికి భక్తితో నమస్కరించింది.

****సమాప్తం****

Posted in April 2025, కథలు

1 Comment

  1. కర్లపాలెం హనుమంతరావు

    లోతైన అంశాన్ని సహజంగా సరళంగా హృదయానికి హత్తుకునేలా రాయటం చేయితిరిగిన రచయితకు/ రచయిత్రికి మాత్రమే సాధ్యం. మంచి రచనను అందించిన రచయిత్రికి, మంచి రచయిత్రి కథ చదివించినందుకు సిరిమల్లె నిర్వాహకులకు అభినందనలు, ధన్యవాదాలు!!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!