Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 18
పారనంది అరవిందారావు

అమ్మ చెప్పినవేవి?

amma-cheppinavevi

అమ్మ పిలుపు విని ఉలిక్కిపడి లేచి
అమ్మ ఆదరణ ..ఆప్యాయత..అభిమానం
కోసం చెంగున లేచి కూర్చుంది ఓ పిల్లవాగు
వీపు నిమిరి దాహం తీర్చిన జలధరాన్ని
హత్తుకుని కన్నీరు పెట్టుకుంది.
పీడకలనా! అని ప్రేమగా అడిగితే
లేదు..అమ్మ పిల్చిందని అంగలార్చింది
మొయిలు కాళ్ళకి మోకరిల్లి
మెల్లగా అడుగు ముందుకేసింది

అమ్మ చెప్పిన దార్లు వెతుక్కుంటూ
కొండగుర్తులు మననం చేసుకుంటూ
చిన్నపిల్ల ఎక్కాలు బట్టీ పట్టినట్లు
మనసులో పదే పదే నెమరేసుకుంటూ
చీకటిలో వృద్ధుడు నడిచినట్లు
భయంగా అడుగులో అడుగేసుకుంటూ
తన భీతి రాయిరప్పకి తెలియకూడదని
సన్నగా ఈల వేసుకుంటూ పోతోంది
తెలిసీ తెలియని దార్లని
కళ్ళు చికిలించి చూస్తోంది.
రెండు మూడు సార్లు తడబడి
అమ్మ చెప్పిన పొడుగాటి చెట్ల
ఆసరా కోసం చూసింది
అలసిపోతే సేదతీర్చే
అడవులుంటాయంది
తెరిపినిచ్చే పిల్ల తెమ్మెరలుంటాయంది
వెన్ను నిమిరి తమ అధరాలతో
సృశించే జనులుంటారంది.
అమ్మ చెప్పిన చెట్టూ చేమలేవి?
అందంగా ఉంటాయన్న పచ్చని చేలేవి?
లేత గడ్డి మేస్తున్న ఆవుదూడలేవి?
కిచకిచ లాడే పిట్టలేవి?
ఆ సూర్యుని వేడిలో
ఆవిరైపోకముందే
అమ్మ దగ్గరకి చేరాలి....

అదిగో! అమ్మ! అది అమ్మేనా!
పరుగు పరుగున చిక్కి శల్యమైన
అమ్మని గట్టిగా కౌగలించుకుని
ఒడిలో తలదాల్చుకుని బావురుమంది

ఎండెరుగని దేశం (దేహం)

enderugani-desam

నాలుగు డిగ్రీల కలవడిన
నాజూకు దేహాలు
నలభై డిగ్రీలలో
నలిగిపోతున్నాయ్

వాడిన మోములతో
వలువలు చించుకుని
వరుణుని వేడుకుని
వాగులలో వ్రాలుతున్నాయ్

ఆంగ్లదేశపు మేనులు
అంశుని ఆతపములో
అదిరి అల్లడిపోవుచూ
ఆవాస ఛాయకై పరిగెడుతున్నాయ్

ఎండెరగని జీవితాలు కూడా
ఎన్నో ఉన్నాయి ఈ జగతిలో
బతుకు గతుకుల్లో బండిచక్రాలూడి
చెట్టుచేమ లేని కొండకోన లేని
వాగువంక లేని బాటలో ఆగిపోయి
గజగజలాడించే గడియలని ఎదుర్కొనలేక
ఎగుడు దిగుళ్ళు లేని త్రోవచూపించే
కాంతి కిరణాల కోసం కలవరిస్తూ
ఎండెరుగని ఎదలు ఎన్నో ఉన్నాయి

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in July 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *