
ఆనాటి ఉత్తరాలు
అలనాటి ఉత్తరాలకోసం
ఆనాటి ఉత్తరాలకోసం
అప్పటిలాంటి ఉత్తరాలకోసం
అలమటించి పోతున్నాను
అర్రులు చాచి ఉన్నాను
అనుక్షణం క్షణం క్షణం
ప్రతిక్షణం నిరీక్షణం
స్వదస్తూరితో వ్రాసినవి
స్వహస్తంతో వ్రాసినవి
సిరాతో రాసినవి
సంతకం తనే చేసినవి
ఎలాంటి ఉత్తరాలైనా
నా ప్రాణమర్పిస్తాను
అల్లాంటి ఉత్తరాలకి
నా ఎదనరువిస్తాను.
అమ్మానాన్నల దిగుళ్ళు
అక్కాచెళ్ళెళ్ళ పెళ్ళిళ్ళు
అన్నాదమ్ముల సణుగుళ్ళు
చక్కటి మా ఊరి ఊసులు
చిక్కటి నా మిత్రుల బాగోగులు
తెలిపే ఉత్తరాల కోసం
తహ తహ లాడుతున్నా.
దినదినం ఎదురుచూసేవి
దిండుక్రింద దాచుకునేవి
పలుమార్లు చదువుకునేవి
పదిలంగా దాచుకునేవి.
కనులలో కన్నీరు నింపి
వెలలేని అక్షరాలను
సృశించేవి సృజించేవి
తడిమేవి తడిపేవి
కొన్ని బాధించేవి
కొన్నిబోధించేవి
కొన్ని రవళించేవి
కొన్ని రగిలించేవి
కొన్ని రేకెత్తించేవి
కొన్ని కైపెక్కించేవి
కొన్ని నవ్వించేవి
కొన్ని కవ్వించేవి
కొన్ని కదిపేవి
కొన్ని కుదిపేవి
ఆ ఉత్తరాల కోసం
అపేక్షిస్తున్నాను.
కాని ……..
కాలచక్రంలోకలిసి
కనుమరు గైపోయాయి
శిధిలమై పోయాయి!
పురాతన వస్తు
ప్రదర్శనశాలలో
పదిలంగా ఖైదీ
అయిపోయాయి.
దేవుడు - మనిషి
ఓపిగ్గా నన్ను చేసావు
భూమి మీద దింపావు
బేలగా నీ వైపు చూసి
కిం కర్తవ్యం అన్నాను.
ఆ నడిచే మనుష్యులతో
కదం కలుపమన్నావు.
ఆ మారే కాలాలతో
పరుగిడమన్నావు
ఆ తిరిగే ఋతువులలో
మనుగడ సాగించమన్నావు
ఆ చక్కని ప్రకృతిలో
ఒదిగిపొమ్మన్నావు
నీ వాక్కు ననుసరించి నే
బహు దూరం సాగిపోతే
నిన్ను చూడాలంటే ఎలా?
నిన్ను కలవాలంటే ఎలా?
నిన్ను కొలవాలంటే ఎలా?
నీ చిరు దరహాసం నాకో చిక్కయ్యింది
నా చిరు సందేహం తీరక పోతోంది
నా మదిలో ఏదో మధన మొదలయింది
నిను చూడలేననే తపన ఎదురైయింది
భగవాను ఉవాచ
నీవు నన్ను మరచినా
నేనెన్నడు నిన్ను మరవను.
నీ ఉనికి సదా నాకు తెలుసులే నేస్తం!
ఓరోజు సమయానికి వస్తాలే నేస్తం
*****
ముందుమాట
నాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.
మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.
ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.
శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.
డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.
నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.
నమస్కారములతో – పారనంది అరవిందారావు