Menu Close
Paranandi-Aravindarao
మనసు విప్పిన మడతలు - 9
-- పారనంది అరవిందారావు --

ఉన్నది నేనే!

unnadi-nene

ఎంత చక్కటి వనమిది!
పలురకాల పరిమళాలు పట్టపగ్గాలు త్రెంచుకుని
పోటీపడుతూ పడుతూ లేస్తూ
నాల్గుదిక్కుల తమ ఉనికిని తెలుపుతూ
తూగుతున్న ఉపవనమిది

పూగుత్తులు సున్నితంగా రాచుకుంటూ
ముసి ముసి నవ్వుల గుసగుస లాడుతున్నాయి
కొంటెగాలి పొంచి ఉండి
వాటి ముచ్చట్లని మూటగట్టి
వనమంతా పరుగెట్టి
నలుదిక్కుల వెదజల్లుతున్నాయి
ఇవాలకించిన తరువుల తలలూపుడులు
కొమ్మల రెమ్మల గలగల నవ్వులు!
….పంచుకున్న గుసగుసలు
పదిమంది విన్నారని
గులాబి చెక్కిళ్ళు ఎర్రబారి
మల్లెల మోములు తెల్లబోయె..

ఇంత చక్కటి నందనంలో... ఏదో చిన్న అలికిడి
అలికిడి కాదు! చిన్న కూత! ఊళ!
అవును!
సరైన స్వరాలాపానలో సరిపడని సంగతిలా!
దారి తప్పిన దరువులా
వసంతంలో హేమంతలా…
వడివడి అడుగులతో వెదికాను నేను !

కూత కాదు! ఇది సన్నటి మూలుగు!
ఎవరిది? ఎంత బాధ ఆ మూలుగులో.....
పొదలలో తొంగిచూచి
తీగలని కదిపి చూసి
గజిబిజి అడుగులతో గాలించాను నేను
అది మూలుగు కాదే!
ఎదని చీల్చుకుని దుముకుతున్న
వికృతమైన ఆక్రందన!
ఆవేదన!విలపిత రాగంలో ఆలాపన!

ఎవ్వరూ లేరు! ఉన్నది నేనే!
ఉలిక్కిపడి వింటే
ఉబికి ఉబికి నాలోంచే వస్తోంది...
పట్టరాని దుఃఖం
కట్టలు తెంచుకున్న ఖేదం!
కన్నీటి ప్రవాహం!

ఊహల్లో ఊసులు

oohallo-oosulu

ఆకాశం జల్లించాను
చుక్కలు వొడిలో వాలాయి
చుక్కలన్నీ… చక్కని చుక్కలై
చెక్కిలిపై చిటికేసి
చుక్కలరాజుని …రా! చూద్దామన్నాయ్

మనస్సుని మక్కువతో కుదిపాను
మల్లెపూలు కురిసాయి
మల్లెపూలలాంటి మధురస్మృతులు
ముసి ముసి నవ్వులతో ఒకదాన్నొకటి
మత్తుగా అల్లుకుని హత్తుకున్నాయ్

కంచికెళ్ళిన కలలని తట్టి లేపాను
కనులు నులుపుకుంటూ లేచి
కంటి రెప్పలు మూయి నీవి
కల్ల కాని కలలరువిస్తా మన్నాయ్

కలం దప్పి సిరాతో తీర్చాను
కులుకుతూ కాగితాన్ని ముద్దిడి
క్రీగంటి చూపుతో కురిపించింది
చిరు చిరు చిరకవితల్ని

*****

ముందుమాట

Paranandi-Aravindaraoనాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.

మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.

ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.

శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.

డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.

నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.

నమస్కారములతో – పారనంది అరవిందారావు

Posted in October 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!